వినడానికి కొంచెం విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, కేసీఆర్‌లు భారత రత్న ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఓ టీడీపీ నేత. ఏదో పొరపాటుగా, ఏమరుపాటులో ఈ డిమాండ్ చేస్తున్నారని అనుకునేందుకు వీలు లేదు. ఎందుకంటే సదరు నేత సీనియర్ రాజకీయ వేత్త, మంత్రిగా పని చేశారు కూడా. ఆయన ఎవరో కాదు నెల్లూరు జిల్లా టీడీపీ నేత, ఏడాది కిందట వరకూ సాగిన చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
నిన్న ఆదివారం తెలుగు నేత, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పీవీకి భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకేనేమో సోమిరెడ్డికి వెంటనే తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామా రావు గుర్తుకు వచ్చారు. పీవీ 100వ జయంతి నిన్న జరిగింది. 2023లో ఎన్టీఆర్ శత జయంతి జరగబోతోంది. అప్పటి కల్లా ఇద్దరికీ భారత రత్న ఇప్పించాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌లను డిమాండ్ చేస్తున్నారు.
పీవీకి భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కేసీఆర్ తన రాజకీయ గురువు అయిన ఎన్టీఆర్ కూడా భారత రత్న ఇప్పించాలని చంద్రమోహన్ రెడ్డి కోరారు. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం తరఫున డిమాండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ను ఈ విషయంలో డిమాండ్ చేయడం టీడీపీకి పరువుతక్కువ విషయం అయినా కేసీఆర్‌కు ఒకప్పుడు రాజకీయ గురువు ఎన్టీఆర్ కాబట్టి.. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌తో టీడీపీకి రాజకీయ వైరం ఉన్నా సోమిరెడ్డి డిమాండ్‌లో పెద్ద విషయం ఏమీ లేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో తమ రాజకీయ ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని, సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కూడా సోమిరెడ్డి ఇలాంటి డిమాండ్ చేయడమే ఇక్కడ పెద్ద విడ్డూరంగా ఉంది.
ఎన్టీఆర్ మరణం తర్వాత తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, రాష్ట్ర విభజన తర్వాతనూ అధికారం చేపట్టలేదు.. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇప్పించే అవకాశం ఆ పార్టీకి దక్కలేదు అనుకుంటే..సోమిరెడ్డి చేసిన డిమాండ్ మానవతాదృక్ఫథంతో చూడవచ్చు. పేదల అభ్యున్నతికి కృషి చేసిన ఎన్టీఆర్‌కు భారత్న రత్న ఇప్పించేందుకు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కృషి చేయాలన్న సోమిరెడ్డి డిమాండ్‌లో అర్థం ఉంది. కానీ 1995లో ఎన్టీఆర్ నుంచి అధికారం పొందిన చంద్రబాబు ఆ తర్వాత 1999లో కూడా బీజేపీతో పొత్తుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చారు. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత దాదాపు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1999లో ఎన్టీఏ కన్వీనర్‌గా కూడా చంద్రబాబు ఉన్నారు. కేంద్రంలోని వాజపేయి సంకీర్ణ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. అప్పటికి మోడీ కూడా లేరు. వాజపేయి కూడా సౌమ్యులు. రాష్ట్రపతిని, ప్రధానులను ఎంపిక చేశానని, కేంద్రంలో చక్రం తిప్పానని చంద్రబాబు ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. మరి ఇలాంటి చంద్రబాబు తనకు పిల్లనిచ్చిన మామ, పార్టీని, ముఖ్యమంత్రి పదవిని ఇచ్చిన ఎన్టీఆర్‌కు భారత రత్న ఎందుకు ఇప్పించలేకపోయారో ముందు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ అధినేత అయిన చంద్రబాబును నిలదీసి ఆ తర్వాత తాజా డిమాండ్ చేస్తే అందరూ హర్షించేవారు.
సరే, టీడీపీ చంద్రబాబు హస్తగతం అయిన ప్రారంభ సమయం.. ఎన్టీఆర్ పోయినా.. ఆయనపై చంద్రబాబుకు కోపం తగ్గకపోవడం వల్లే అప్పట్లో భారత రత్న ఇప్పించలేకపోయారని భావిద్దాం. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో మళ్లీ ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 1999లో మాదిరిగా 2014లో కూడా చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలిచారు. కేంద్రంలో భాగస్వామి కూడా అయ్యారు. కాకపోతే అప్పుడు వాజపేయి. ఇప్పుడు మోడీ. మోడీతో గతంలో ఉన్న వైరాలు కూడా పక్కనబెట్టి చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. 2014 నుంచి 2018 వరకూ అంటే దాదాపు 4 ఏళ్లు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. ప్రతి ఏడాది మహానాడు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేస్తున్నారు. ఆ డిమాండ్‌లో నిజయతీ, ఆ తీర్మానంలో చిత్తశుద్ధి ఉంటే ఎన్టీఆర్‌కు ఎందుకు భారత రత్న ఇప్పించలేకపోయారనే మౌలిక ప్రశ్న అందరి నుంచి వినిపిస్తోంది.
చంద్రబాబు అధికారంలో లేనప్పుడు, టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయనకు గానీ,ఆ పార్టీ నేతలకు గానీ ఎన్టీఆర్ గుర్తుకు వస్తారనేది నానుడి. ఆయనకు భారత రత్న ఇవ్వాలనే మాట ఈ సమయంలోనే బలంగా వినిపిస్తుందన్న విమర్శలు ఉన్నాయి. అయితే..సోమిరెడ్డి తాజా డిమాండ్.. పరోక్షంగా చంద్రబాబును, టీడీపీని కించపరిచేలా ఉన్నాయనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. చంద్రబాబు వంటి సమర్థుడు, మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి తమ పార్టీ వ్యవస్థాపకుడు అయిన ఎన్టీఆర్‌కు భారత రత్న ఇప్పించలేకపోయారనే కోణం సోమిరెడ్డి చేసిన డిమాండ్‌లో కనిపిస్తోంది. లేకపోతే రెండు రాష్ట్రాల్లోనూ తమ రాజకీయ ప్రత్యర్థులు అయిన కేసీఆర్,జగన్‌లను ఈ డిమాండ్ చేయడం ఏమిటి..? అనే మాట వినిపిస్తోంది.
అయినా ఇలాంటి డిమాండ్ చేసి నవ్వులపాలవడం సోమిరెడ్డికి ఇదేమి కొత్తేం కాదు. తాము ఇచ్చిన రైతు రుణమాఫీ హామీ (3,4 విడతలు)ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేయాలనే విచిత్రమైన డిమాండ్ చేసిన ఘనత సోమిరెడ్డికి ఉంది. అ క్రమంలోనో లేదా ఎన్టీఆర్‌పై ప్రేమతో, అభిమానంతో ఆయన 100వ జయంతి నాటికైనా భారత రత్నగా చూడాలని ఈ డిమాండ్ చేసి ఉంటారు సోమిరెడ్డి. ఈ డిమాండ్ చంద్రబాబుకు చెప్పి చేశారా..? లేదా..? అనేది ఇప్పుడున్న ప్రశ్న..!