iDreamPost
iDreamPost
ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు తనయుడు మరణించారు. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈనెల 3న ఆయన్ని ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందని అంతా ఆశించారు. అయితే ఆయన తుదిశ్వాస విడవడం అందరినీ విషాదంలో ముంచింది. ఏలూరులో టీడీపీ నేతలు, బాబు అనుచరులను కలచివేసింది. సోమవారం తెల్లవారుజామున మరణించిన మాగంటి రాంజీ మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
మాగంటి కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. మాగంటి బాబు తల్లిదండ్రులు ఇద్దరూ ఏపీ క్యాబినెట్ లో మంత్రి పదవులు అనుభవించారు. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి కీలక నేతగా ఎదిగారు. ఆయన మరణం తర్వాత మాగంటి వరలక్ష్మి మంత్రిగా పనిచేశారు. మాగంటి బాబు కూడా వైఎస్సార్ హయాంలో మంత్రి పదవి దక్కించుకున్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రధాన నాయకులుగా ఎదిగిన మాగంటి కుటుంబం నుంచి 2008 తర్వాత బాబు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో ఏలూరు నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. ఆ ఎన్నికల్లో రాంజీ చురుకుగా పనిచేశారు.
రాజకీయంగా తండ్రి బాటలో పయనించేందుకు ప్రయత్నం చేసారు. టీడీపీ యువనేతగా గుర్తింపుపొందారు. అదే క్రమంలో కొన్ని వివాదాల్లో ఆయన పేరు వినిపించింది. అయితే ప్రస్తుతం అనూహ్యంగా ఆయన్ని కోల్పోవడంతో బాబు కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాబు కుటుంబానికి పలువురు సానుభూతి ప్రకటించారు.