నానేటి.. నా రేంజేటి…మా నాన్న పాతికేళ్ళ కిందటే ఎంపీ సేసాడు.. నాను నిన్నగాక మొన్నటిదాకా ఎమ్మెల్యేను.. అలాటిది నన్ను ఒగ్గిసి నిన్నగాక మొన్నొచ్చిన గుంటడికి పార్లమెంటరీ జిల్లా పెసిరెంట్ పదవిస్తారా.. నాకేమో ఆక్కడెక్కడో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల కోర్దినేటర్ పదవిస్తారా..?? ఏటీ ఘోరం.. ఏటీ అన్నాయం.. ఆ కుర్రోడేమి ఎక్కువ.. నేనేటి తక్కువ చెప్మి.. ఇలాగైతే అవ్వదు.. మనం పల్లకుంతే కుదరదు.. మా జిల్లా పార్లమెంట్ అధ్యక్షునిగా ఉంటే గింటే మా జిల్లావాళ్ళుండాల గాని పొన్నూరోళ్ళు వచ్చి ఇక్కడ ఏటీ సేత్తారు.. మాబాగా ఉంది యవ్వారం అంటూ కొండపల్లి అప్పలనాయుడు రగిలిపోతున్నారు.
ఆదివారం టిడిపి పార్లమెంట్ జిల్లాల వారీగా అధ్యక్షులను, రెండేసి లోక్ సభ నియోజకవర్గాలకు ఒకరిని చొప్పున సమన్వయకర్తలను నియమిస్తూ జాబితాలు విడుదల చేసింది. ఈ లిస్ట్ చూడగానే గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడికి కోపం వచ్చింది. జిల్లాలో తాను ఉండగా తనను కాదని విజయనగరం జిల్లా అధ్యక్షునిగా కిమిడి మృణాళిని కొడుకు నాగార్జునకు ఆ బాధ్యత అప్పగించడాన్ని సహించలేకున్నారు. (ఈ నాగార్జున మొన్న చీపురుపల్లిలో పోటీ చేసి బొత్స చేతిలో ఓడిపోయారు. కిమిడి కళావెంకటరావు తమ్ముడి కొడుకే ఈ నాగార్జున). తనను కాదని,మొన్నమొన్న రాజకీయాల్లోకి వచ్చిన కుర్రాడు నాగార్జునకు పదవి ఇవ్వడాన్ని తట్టుకోలేని అప్పలనాయుడు మరుక్షణమే ఓ ఫ్లెక్సీ తయారు చేసేసి విజయనగరం లోని తన ఆఫీసుకు అంటించేశారు. తనదే అసలైన పార్టీ కార్యాలయం అని చెబుతున్నారు. పార్టీ తనలాంటి సీనియర్లను మోసం చేసిందని, జూనియర్లకు పదవిచ్చి తమను అవమానిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. తన కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని అన్నారు.
ఉన్నట్టుండి నాయుడికి చిర్రెత్తుకు రావడంతో కార్యకర్తలు అవాక్కయ్యారు.. ఇదేటీ ఏకంగా తానే సొంతంగా పార్లమెంటరీ జిల్లా ఆఫీసు పెట్టిసాడు అని ముక్కున వేలేసుకుంటున్నారు