ఆంధ్ర ప్రదేశ్ లో గుడివాడ క్యాసినో వ్యవహరం హాట్ టాపిక్ గా మారుతోంది. అక్కడ క్యాసినో నిర్వహించారని టీడీపీ, నిరూపిస్తే రాజకీయ సన్యాసమే కాక ఆత్మహత్య కూడా చేసుకుంటానని ఏపీ మంత్రి కొడాలి నాని కామెంట్స్ చేశారు. తాజాగా ఈ విషయం మీద కొడాలి నాని సహా ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బుద్దా వెంకన్నపై విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోతే ప్రజలు కొడాలి నానిని చంపుతారని వెంకన్న వ్యాఖ్యలు చేశారు. కొడాలి నానిని ఎందుకు అరెస్టు చేయలేదో డీజీపీ సమాధానం చెప్పాలన్న ఆయన, గుడివాడలో కొడాలి నాని ఆయిల్ దొంగతనాలు చేశారని.. కొడాలిపై అప్పటి పోలీసు అధికారి వర్ల రామయ్య చర్యలు తీసుకోలేదా అంటూ ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌లా చంద్రబాబు ఇంటి వైపు ఎవరైనా వస్తే చావగొట్టి శవాన్ని పంపుతామన్నారు.
సంక్రాంతి సందర్భంగా గుడివాడలో నిర్వహించిన క్యాసినో సందర్భంగా సుమారు రూ.250 కోట్లు చేతులు మారాయని ఆయన ఆరోపిస్తూ ఇందులో డీజీపీ వాటా ఎంత అని ప్రశ్నించారు. డీజీపీ తీరు డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీగా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో ఇంత జరిగినా రాష్ట్ర డీజీపీ స్పందిచరా అని ప్రశ్నించారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో సోమవారం నాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై బుద్దా వెంకన్న నుండి వివరణ తీసుకొనేందుకు పోలీసులు ఆయన నివాసానికి వచ్చారు.
అయితే చంద్రబాబు నాయుడిపై మంత్రి కొడాలి నాని ఇంత కాలం పాటు తీవ్ర పదజాలం ఉపయోగించి విమర్శలు చేస్తే ఎందుకు నోరు మెదపడం లేదని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. బుద్దా వెంకన్న ఇంటి లోపలికి పోలీసులు రాకుండా ఆయన అనుచరులు గేట్లు బిగించారు విషయం తెలుసుకొన్న విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, టీడీపీ నేత నాగుల్ మీరా తదితరులు బుద్దా వెంకన్న ఇంటికి చేరుకుని సీఎం జగన్ కు, వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతం సవాంగ్‌పై వ్యాఖ్యల నేపథ్యంలో వెంకన్న ను అరెస్టు చేశారు.