iDreamPost
iDreamPost
అయ్యన్నపాత్రుడు. టీడీపీలో సీనియర్ నేత, ఎన్టీఆర్ హయంలోనే ఆరంగేట్రం చేసి నర్సీపట్నం నుంచి ఆరు సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. మధ్యలో పార్లమెంట్ కి పోటీ చేసి పరాజయం పాలయిన అనుభవం కూడా ఉంది. పంచాయితీ ప్రెసిడెంట్ నుంచి ఏకంగా అమాత్య హోదా వరకూ ఎదిగిన నేత. ప్రస్తుతం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు. ఇంత ఘనమైన గతమున్నప్పటికీ వర్తమానంలో మాత్రం చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లోనూ, పార్టీలోనూ తీవ్రంగా సతమతం అవుతున్నారు. ఇంట్లో ఈగల మోత భరిద్దామనుకుంటే బయట కూడా ప్రజల నుంచి వ్యతిరేకత చల్లారకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు.
రాజకీయాల్లో చాలామంది నాయకుల మాదిరిగానే అయ్యన్నకి సన్ స్ట్రోక్ తప్పడం లేదు. తమ పార్టీ అధినేత తనయుడి మాదిరిగానే అయ్యన్నపాత్రుడి కొడుకు విజయ్ కూడా తండ్రికి పెను భారంగా మారినట్టు కనిపిస్తోంది. నారా లోకేశ్ లో లేని వాగ్దాటి చింతకాయల విజయ్ కి ఉందని అంతా భావించే సమయంలో అతని నోటిదురుసుతనం నిండాముంచినట్టు కనిపిస్తోంది. తండ్రి అనుభవం అక్కరకు రాకపోగా అతి ప్రవర్తించిన విజయ్ తీరుతో అయ్యన్నకి కూడా ఆటంకాలు మొదలయ్యింది. సొంత సోదరుల నుంచే సెగ తప్పలేదు. చివరకు అయ్యన్న తమ్ముడు సన్యాసిపాత్రుడు తిరుగుబాటు బావుటా ఎగురవేసే వరకూ వెళ్లింది. వైఎస్సార్సీపీలో చేరి ఇప్పుడు అయన్న మీద కాలుదువ్వుతున్నారు.
మొన్నటి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పెట్ల గణేష్ శంకర్ ప్రజల్లోకి చొచ్చుకుని పోతున్నారు. వైఎస్సార్సీపీకి క్షేత్రస్థాయిలో ఆదరణ పెంచే ప్రయత్నంలో ఉన్నారు. అదే సమయంలో సీనియర్ నేత అయ్యన్నకు ఇంటా, బయటా ఇక్కట్లతో సతమతం అవుతున్నారు. పైగా ఆయన నోటిదురుసుతనం ఇప్పుడు కార్యకర్తలను దూరం చేస్తోంది. ఇన్నాళ్లుగా అధికారం ఉండడంతో ఆయన వెంట తిరిగిన పలువురు ఇప్పుడు మొఖం చాటేస్తున్నారు. నోటికొచ్చినట్టుగా మాట్లాడే అయ్యన్న తీరు నచ్చని అనేక మంది అధికార పార్టీ కండువాలు కప్పుకుంటున్నారు. దాంతో నర్సీపట్నంలో అయ్యన్న వర్గానికి కోలుకోలేని దెబ్బ తగులుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఇలాంటి సమయంలో 1983 నుంచి వరుసగా బరిలో ఉన్న అయ్యన్నవచ్చే ఎన్నికల నాటికి రిటైర్మెంట్ తప్పదనే సంకేతాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో అయ్యన్న వారసత్వం కూడా ఉన్న గౌరవం కోల్పోయిన నేపథ్యంలో టీడీపీకి తదుపరి దిక్కెవరే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. తండ్రి అండతో రాజకీయాల్లోకి వచ్చిన అయ్యన్నపాత్రుడు తన తనయుడిని దానికి తగ్గట్టుగా తీర్చిదిద్దలేకపోవడంతో ఇప్పుడు తలనొప్పులు ఎదుర్కొంటున్నారు. ఒక దేశలో అనకాపల్లి నుంచి ఎంపీగా బరిలో ఉంటానని ఆశించిన విజయ్ ఇప్పుడు సొంత నియోజకవర్గంలో కూడా బలాన్ని నిలుపుకోలేక చతికిలపడే స్థితికి చేరుకున్నారు. దాంతో నర్సీపట్నం రాజకీయ సమీకరణాల్లో కీలక మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. అయన్న అనంతరం టీడీపీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది.