iDreamPost
android-app
ios-app

Tdp,janasena – akiveedu మరోసారి తెరమీదకు టీడీపీ జనసేన బంధం .. ఈసారి ఆకివీడు వేదికగా!

Tdp,janasena – akiveedu మరోసారి తెరమీదకు టీడీపీ జనసేన బంధం .. ఈసారి ఆకివీడు వేదికగా!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది కాదనలేని వాస్తవం. అందుకే రాజకీయ నేతల మధ్య మిత్ర బంధం, పార్టీల మధ్య పొత్తు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఏపీ రాజకీయాల్లో జరిగే అన్ని చిత్ర విచిత్రాలు ఇంకెక్కడా జరగవేమో? రాబోయే ఎన్నికల్లో కొత్త పొత్తులు ఉంటాయని చర్చ గత కొంత కాలంగా సాగుతోంది, ప్రస్తుతం బీజేపీతో పొత్తులో జనసేన. వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుంది అనే ప్రచారం ఎప్పటికప్పుడు తెరమీదకు వస్తునే ఉంటుంది. ఈ వాదనను పైకి బీజేపీ, జనసేన నేతలు ఖండిస్తున్నా టీడీపీ నేతలు మాత్రం ఎప్పుడూ నేరుగా ఈ ప్రచారంపై నోరు విప్పిన దాఖలాలు అయితే లేవు. అయితే జనసేన వచ్చే ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకుంటుందని, అలా జనసేన మళ్లీ టీడీపీతో కలిస్తే ఆ పార్టీ ఓటు బ్యాంకు కూడా టీడీపీకి కలిసి వస్తుందని టీడీపీ నేతల భావన.

ఒంటరిగా వైసీపీని ఢీ కొట్టడం కంటే జనసేనతో కలిస్తేనే వైసీపీని సమర్థవంతంగా ఢీ కొట్టవచ్చన్నది టీడీపీ నేతల భావన. 2014లో టీడీపీకి జనసేన మద్దతు ఇచ్చిన కారణంగా ఎలాగో గెలిచేశారు, 2019లో చాలా చోట్ల జనసేన నేతల కారణంగా ఓట్లు చీలి అది వైసీపీ గెలుపుకు మంచి దారయింది. అందుకే జనసేనతో పొత్తు కోసం చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఎదురు చూస్తున్నారు. అయితే ఎప్పుడైనా అది కుదరచ్చు అనే విధంగా రెండు పార్టీల ప్రవర్తన తెరమీదకు వస్తూ ఉంటుంది. అయితే 2024లో కలుస్తారో లేదో పక్కన పెడితే ఇప్పుడు కలిస్తే దాన్ని అక్రమ కలయికే అనాలి. గతంలో బీజేపీని మోసం చేసి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం, జనసేన పార్టీల చీకటి పొత్తు రాజకీయం పరిషత్‌ ఎన్నికల సాక్షిగా బట్టబయలు కాగా ఇప్పుడు అదే జిల్లా ఆకివీడులో మరో మారు బట్ట బయలు అయింది. ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. మొత్తం 20 వార్డులకు గాను టీడీపీ-15, జనసేన-5 వార్డులు పంచుకుని రంగంలోకి దిగుతున్నాయి.

కొద్ది రోజుల క్రితం ఆకివీడులో ఆకివీడు నగర తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పితాని సత్యనారాయణ, పంచుమర్తి అనురాధా, ఎమ్మెల్సీలు అంగర రామ్మోహన్, మంతెన సత్యనారాయణ రాజు , మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, చింతమనేని ప్రభాకర్ లాంటి నేతలు హాజరయ్యారు. ఇంత మంది హాజరయితే ఎన్నికల సన్నాహాక సమావేశం అనుకున్నారు కానీ అటు తిప్పి ఇటు తిప్పి జనసేన పొత్తు వార్డులు ఖరారు చేయడానికి అనే సంగతి బయటకు రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. జనసేన పార్టీకి బలం ఉన్న అయిదు వార్డుల్లో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, ఇతర నాయకులు తలమునకలు అయ్యారు. అయితే వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గోకరాజు రామరాజు, డీసీసీబీ ఛైర్మన్‌ నరసింహరాజు, క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సర్రాజులు వైసీపీ గెలుపు మీద  దృష్టి సారించారు. ఎన్ని అక్రమ కూటములు తెరమీదకు వచ్చినా గెలుపు మాదేనని అంటున్నారు.

ఎన్నికలు ఎప్పుడంటే?
ఈ నెల 15న జరుగుతున్న ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలకు మూడో తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమయింది. ఐదో తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, ఆరో తేదీన నామినేషన్ల పరిశీలన, ఎనిమిదో తేదీ నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండనుంది. 15వ తేదీన ఎన్నికలు, 17వ తేదీన లెక్కింపు ఉంటుంది.