iDreamPost
iDreamPost
కోడెల..ఈ మూడక్షరాలు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో 36 ఏళ్ల సంచలనానికి మారు పేరుగా నిలిచాయి .
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవానికి పూర్వం వైద్యుడిగా ప్రస్థానం ప్రారంభించిన కోడెల శివప్రసాదరావు టీడీపీ ఏర్పడ్డ 1983 నుండి 2019 వరకూ రాజకీయాల్లో కొనసాగారు అనడం కన్నా హవా సాగించారు అనొచ్చు .
నరసరావుపేట నుండి ఐదు సార్లు , సత్తెనపల్లి నుండి ఒకసారి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన కోడెల హోమ్ , భారీ మధ్యతరహా నీటి పారుదల , పంచాయితీ రాజ్ శాఖలకు మంత్రిగా వ్యవహరించడంతో పాటు అనేక పార్టీ పదవులు చేపట్టారు . అంతేకాదు తన నియోజక వర్గంలో మాత్రమే కాక కోస్తా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన కోడెల గుంటూరు జిల్లా రాజకీయాలను కొన్నాళ్ల పాటు శాసించారు అని చెప్పొచ్చు . ఈ రోజు టీడీపీలో అగ్రనాయకులగా వ్యవహరిస్తున్న పలువురిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి పార్టీ టికెట్లు ఇప్పించింది కోడెలనే . 2004 వరకూ టీడీపీలో బాబు తర్వాత స్థానం ఎవరిది అంటే పలు దఫాలు కోడెల పేరే వినిపించేది . బహుశా ఇదే కోడెల కష్టాలకు మూల కారణం అనుకొంటా .
Also Read : పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కిపునకు గ్రీన్‌సిగ్నల్
2004 , 09 ఎన్నికలలో వైఎస్ హవా ముందు నిలబడలేక ఓడిపోయిన కోడెల మారిన రాజకీయ పరిస్థితుల రీత్యా 2014 లో సత్తెనపల్లి నుండి పోటీ చేసి గెలిచారు . అందరూ ఊహించినట్లు సీనియర్ నాయకుడైన కోడెలకి మంత్రి పదవి ఇవ్వకుండా మొండి చెయ్యి చూపిన బాబు పార్టీ శ్రేణుల ఒత్తిడితో స్పీకర్ పదవి ఇచ్చి బుజ్జగించారు . 2019 ఎన్నికలలో పేట నుండి పోటీ చేస్తానని కోడెల ప్రతిపాదించగా నిరాకరించి సత్తెనపల్లిలోనే పోటీ చేయించాడు బాబు . ఆ ఎన్నికలలో ఇనుమెట్ల గ్రామంలో కోడెల పై జరిగిన భౌతిక దాడితోనే ఆయన పతనం ప్రారంభమైంది అని చెప్పొచ్చు .
నాటి ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత కోడెల వారసుల పై అసెంబ్లీ ఫర్నిచర్ పక్కదారి పట్టించి తమ సొంత కార్యాలయాల్లో , వ్యక్తిగత నివాసాల్లో దాచుకున్న విషయం బయటపడటంతో పాటు కొన్ని అవినీతి , అక్రమాల ఆరోపణలు రావడం , కోడెల తనయుడు శివరాం వలన మోసపోయిన కొందరు టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వం మారినాక కేసులు పెట్టడంతో బాబు ఇతర టీడీపీ నాయకులు కోడెలతో ఆంటీ ముట్టనట్టు వ్యవహరించసాగారు . ఆ సమయంలోనే వర్ల రామయ్య 99 టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కోడెల తెలుగుదేశం పరువు తీసాడు అని వ్యాఖ్యానించగా , మరికొందరు ఇతర నాయకులు కూడా ఇదే విధంగా మాట్లాడి పార్టీలో ఒంటరిని చేయడంతో కోడెల తీవ్ర మనస్తాపం చెందారు .
తన పై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇస్తానంటూ కోడెల పలుమార్లు బాబు అపాయింట్మెంట్ కోరినా నిరాకరించడంతో పాటు చలోఆత్మకూరు అంటూ పల్నాడులో బాబు తలపెట్టిన యాత్రకు సైతం దశాబ్దాల పాటు పల్నాట పార్టీకి పెద్ద దిక్కుగా నిలబడ్డ కోడెలని ఆహ్వానించకపోగా రావద్దని చెప్పి అవమానించిన తర్వాత కొద్ధి కాలానికి అనారోగ్యంతో గుంటూరు హాస్పిటల్లో చేరినా అదే సమయానికి గుంటూరులో ఉన్న బాబు కనీసం పలకరించలేదు .
Also Read : కోడెల పాత స్థానం రాయపాటికి కావాలంట…
వరుస పరిణామాలతో ఖిన్నుడైన కోడెల హైదరాబాద్లో ఆత్మహత్యకి పాల్పడగా ఇది ప్రభుత్వ హత్య అంటూ రాజకీయం చేసిన బాబు . కోడెల అంతిమ యాత్ర ఆయన అభిమాన గణం ఉన్న పల్నాడు ప్రాంతంలో కాక పార్టీకి పట్టు సంపాదించుకొనే వ్యూహంతో కృష్ణా జిల్లా మీదుగా చేయడం పలు విమర్శలకు తావిచ్చింది . ఆ సమయంలో కోడెల కుటుంబానికి తాను అండగా ఉంటానని , వారి రాజకీయ భవిష్యత్తు తాను చూసుకొంటానని కబుర్లు చెప్పిన బాబు తరువాతి రోజుల్లో వారిని ఏ కోశానా పట్టించుకున్న పాపాన పోలేదు . సత్తెనపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గా కోడెల తనయుణ్ణి కానీ కూతురుని కానీ ప్రకటించాలని ఆయన అభిమానులు కోరుకున్నా ఏ నిర్ణయం తీసుకోకుండా వదిలేశారు .
గత ఏడాది కోడెల మొదటి వర్ధంతి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా చేద్దామనుకొంటే కోవిడ్ నిబంధనల పేరిట ప్రభుత్వం అడ్డుకొంటుంది అని బాబు ప్రకటించగా కనీసం నరసరావుపేట నియోజక వర్గంలోని టీడీపీ కార్యాలయంలో కూడా దీపం వెలిగించి నివాళి అర్పించిన పాపాన పోలేదు .
ఈ యాడాది కోడెల సొంత గ్రామంలో విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసిన కోడెల తనయుడు బాబు సహా పార్టీ పెద్దలందరినీ పిలవగా ఆ గ్రామంలో టీడీపీ వర్గ విభేదాలను సాకుగా చూపి ఆ కారణంగా పార్టీ నుండి తామెవ్వరం వెళ్ళమని టీడీపీ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించగా , వెళ్లకపోతే బాగోదు వీలైతే వెళ్ళండి అని బాబు వ్యాఖ్యానించినట్టు ఓ ఛానెల్ లో స్క్రోలింగ్ వచ్చింది .
తీవ్ర అవినీతి ఆరోపణలు టీడీపీలో చాలా మంది నాయకుల పై వచ్చాయి . కొందరు జైలుకి వెళ్లి రాగా , కొందరి పై కేసులు కొనసాగుతున్నాయి . అయితే కోడెల పట్లే ఇంత నిరాదరణ ఎందుకు అంటే బాబు వ్యవహార శైలే అంత అంటారు పలువురు అనుభవజ్ఞులు . బలం , పట్టు ఉండి ఉపయోగపడే పరిస్థితిలో ఉన్నవారినే బాబు ఆదరిస్తాడని అవి కోల్పోయిన వారికి బాబు దగ్గర ఆదరణే కాదు కనీస స్థానం కూడా ఉండదంటున్న సీనియర్లు ఇందుకు ఉదాహరణగా గుంటూరు జిల్లాలోనే పుష్పరాజ్ , లాల్ జాన్ బాషా , వీరపనేని యలమందరావు వంటి పలువురు నాయకుల ఉదంతాల్ని చూపిస్తున్నారు .
Also Read : ఆ సీనియర్ నేత టీడీపీకి దూరంగా ఉండడానికి కారణాలేంటి?