iDreamPost
iDreamPost
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పెంచేసిందని, వాటిపై ప్రజల నుంచి రూ. వేల కోట్లు దండుకుంటోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధారమైన నిందారోపణలు చేశారు. పెట్రో ధరలు పెరగడమనే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అంటగట్టేసి జనాన్ని నమ్మించాలనే ప్రయత్నం చేశారు.
టీడీపీలో చంద్రబాబు కన్న సీనియర్‌ను అని సందర్భం వచ్చినప్పుడల్లా గొప్పలు చెప్పుకొనే బుచ్చయ్యకు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలపై నియంత్రణ ఎవరి చేతుల్లో ఉంటుందో తెలియదా? ఈ ధరల పెరుగుదలపై జనంలో ఆగ్రహం ఉంది. దాన్ని జగన్‌పైకి మళ్లించాలనే దురుద్దేశంతో బుచ్చయ్య తన వంతు ప్రయత్నం చేశారు. నిజంగా ఈ పెరిగిన ధరల వల్ల జనం ఇబ్బంది పడుతున్నారని ఈయనగారు భావిస్తే ఆ విమర్శలేవో కేంద్ర ప్రభుత్వంపై చేయాలి కదా.. అలాకాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం అంటే కుట్ర కాక మరేమిటి? మోదీ ప్రభుత్వాన్ని విమర్శించలేనప్పుడు పెట్రో ధరల అంశాన్ని ప్రస్తావించడం మానేయాలి కాని ఇలా జనం తెలివితేటలను తక్కువగా అంచనా వేస్తే ఎవరికి నష్టం?
అవే అవాస్తవాలు పదే పదే..
ఆర్థిక ఉగ్రవాది పాలనలో రాష్ట్రం దివాళా దిశగా పయనిస్తోందని, రూ.3 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని అన్నారు. అప్పులమయమైన రాష్ట్రం, త్వరలోనే చీకట్లపాలు కానుందన్నారు. గవర్నర్ అధికారులను పిలిచి, తన పేరు ఎందుకు వాడుకున్నారని మందలించే వరకు పరిస్థితి వచ్చిందంటే, ఈ ప్రభుత్వం ఎటు పోతోందో చెప్పాల్సిన పనిలేదన్నారు. గవర్నర్ రిటైరయ్యి, రేపు తన సొంత రాష్ట్రానికి వెళ్లినా కూడా, జగన్ ప్రభుత్వం చేసిన తప్పులు ఆయన్ని వదలవన్నారు.
అబద్ధాల కార్ఖానాగా మారిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుతానికి వ్యతిరేకంగా రోజుకో అవాస్తవాన్ని ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తోంది. ఆ అబద్దాలను ప్రెస్‌మీట్లు పెట్టి మరీ టీడీపీ నాయకులు వల్లె వేయడం, పచ్చ మీడియా దానికి దరువేయడం రోజూ వారీ కార్యక్రమంగా మారిపోయింది. గవర్నర్ అధికారులను మందలించారంటూ పచ్చ మీడియాలో వార్త రావడం అదే మాటను రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు అందుకోవడం ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే కుట్ర కాక మరేమిటి? ముఖ్యమంత్రిని పట్టుకొని తరచుగా ఆర్థిక ఉగ్రవాది అని సంబోధించడం ఏపాటి సంస్కారమో బుచ్చయ్యే చెప్పాలి. పరుషమైన పదాలతో విమర్శిస్తే ముఖ్యమంత్రి మాటేమోగాని తమరే పలుచన అవుతారు.
Also Read : Kuppam Municipal Elections – చంద్రబాబుకి కఠిన పరీక్షగా మారిన మునిసిపల్ ఎన్నికలు, కుప్పంలో గట్టెక్కేదెలా
పరిపాలన గవర్నర్ పేరు మీద జరగదా?
గవర్నరు అధికారులను మందలించడం వీరు చూశారా? గవర్నర్ రిటైరయ్యి, రేపు తన సొంత రాష్ట్రానికి వెళ్లాక జగన్ ప్రభుత్వం చేసిన తప్పులు ఆయన్ని వదలవని ఈయనగారు జనానికి భవిష్యత్తు దర్శనం చేయించడం ఏమిటో? రాష్ట్రంలో పరిపాలన అంతా గవర్నర్ పేరు మీదుగానే జరుగుతుంది. పరిపాలనలో ఆయన పేరు వాడడం సహజం. ఆయన తర్వాత మరో గవర్నర్ వస్తారు. అప్పుడూ ప్రభుత్వం అప్పు చేస్తుంది. అంత మాత్రాన రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులన్నీ గవర్నర్‌లుగా పనిచేసినవారు తీర్చాలనా దాని అర్థం. అసలు అప్పులు ఇచ్చే ఏ సంస్థలైనా ఈ మాత్రం ప్రాథమిక అవగాహన లేకుండా గవర్నర్‌ను పూచీకత్తుగా భావిస్తాయా? వివిధ రాష్ట్రాల్లో పనిచేసి రిటైరైన గవర్నర్‌లు అందరూ అక్కడి ప్రభుత్వాలు చేసిన అప్పులకు అసలు, వడ్డీ కడుతున్నారా?
ఎందుకొచ్చిన అనుభవం..
సకాలంలో ప్రభుత్వం జీతాలివ్వడం లేదని, కరోనా సమయంలో మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం, రూ.వేల కోట్లను వ్యసనపరుల నుంచి కొల్లగొట్టిందని బాధ పడిన బుచ్చయ్య తమ ప్రభుత్వ హయాంలో ఊరూ వాడా బెల్టుషాపులు ప్రొత్సహించి మద్యం అమ్మకాలు కొత్త పుంతలు తొక్కించిన విషయం మరిచారా? కొన్నాళ్లు మద్యం వ్యాపారం కూడా చేసిన బుచ్చయ్యకు ఎవరి హయాంలో రాష్ట్రం మద్యాంధ్రప్రదేశ్‌గా మారిందో తెలియదా..?
అప్పులు తేవడం అనేది ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు చేసే పనే అని, అదే తాము చేస్తున్నామని, కరోనా కష్టంకాలంలో జన సంక్షేమాన్ని గాలికి ఒదిలేయలేం కదా అని ఆర్థికమంత్రి విస్పష్టంగా వివరణ ఇచ్చిన రోజున కూడా అవే ఆరోపణలు పదే పదే చేయడం ఎందుకు? ఏం విమర్శించాలో తెలియనప్పుడు రోజూ ప్రెస్‌మీట్లు పెట్టడం దేనికి? మీ రాజకీయ అనుభవం అంతగా పరవళ్లు తొక్కేస్తుంటే ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలి గాని ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఏం ప్రయోజనం..?
Also Read : Tdp Mark Politics…టీడీపీ మార్క్ రాజకీయం మొదలు