వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన తిరుపతి లోక్‌సభ స్థానానికి టీడీపీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి టీడీపీ అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మిని ఖరారు చేశారు. పనబాక లక్ష్మి గెలుపు కోసం పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
2019లో జరిగిన ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభకు టీడీపీ తరపున పోటీచేసిన పనబాక లక్ష్మీ వైకాపా అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ చేతిలో పరాజయం పాలయ్యారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం పనబాక లక్ష్మీ దాదాపు సైలెంట్‌గానే ఉన్నారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశాలకు సైతం ఆమె హాజరు కాలేదు. ఒకానొక దశలో ఆమె టీడీపీని వీడి బీజేపీలో చేరనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ వార్తలకు చెక్ పెడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి పనబాక లక్ష్మీపై నమ్మకం ఉంచి ఉప ఎన్నికకు టీడీపీ తరపున అభ్యర్థిగా ఆమెనే ఖరారు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ లో తిరుపతి ఉప ఎన్నికలో గెలుపుకోసం చేయాల్సిన పనులపై దృష్టి పెట్టాలని స్థానిక నేతలను ఆదేశించారు.