సందర్భానుసారంగా మాజీ మంత్రి, కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభం లేఖలు రాస్తుంటారు. కాపు సామాజికవర్గ సంక్షేమం, రాష్ట్ర ప్రజలు, వ్యక్తిగత అంశాలపై ఈ లేఖలు ఉంటాయి. ఇటీవల ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో ఏడ్చిన నేపథ్యంలో.. 2016లో టీడీపీ సర్కార్ హయాంలో తనకు, తన కుటుంబానికి జరిగిన అవమానాన్ని గుర్తు చేస్తూ చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో నాడు ముద్రగడ పద్మనాభం కుటుంబం పడిన బాధ స్పష్టంగా కనిపించింది. చేసిన అవమానానికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా తాను చేశానని, కానీ చంద్రబాబు పతనం కళ్లారా చూడడానికి బతికి ఉన్నానని ముద్రగడ ఆ లేఖలో పేర్కొనడం టీడీపీలోనూ, కాపు సామాజికవర్గంలోనూ సంచలనం కలిగిస్తోంది.
ఇటీవల చంద్రబాబు చేసిన శపథాలను గుర్తు చేసిన ముద్రగడ.. అవి సాధించే శక్తి మనలాంటి వారికి లేదని, అవన్నీ నీటిమీద రాతలని తేలిగ్గా తీసిపారేశారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తానని శపథం చేసిన చంద్రబాబుకు, ఆ దిశగా ఎన్నో ఆశలు పెట్టుకున్న టీడీపీ నేతలు ముద్రగడ లేఖతో ఉలిక్కిపడుతున్నారు. తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేస్తూ.. మళ్లీ అధికారంలోకి వచ్చే అంత సీను చంద్రబాబుకు లేదని ముద్రగడ తన లేఖలో పేర్కొనడం టీడీపీ నేతలకు ఏ మాత్రం మింగుడుపడడం లేదు. ముద్రగడ అలా లేఖ రాశారో లేదో.. ఇలా టీడీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేస్తున్నారు. ముద్రగడ లేఖపై ఆందోళన పడుతూనే.. ఆ లేఖను, అందులోని అంశాల తీవ్రతను తగ్గించేందుకు ప్రకటనలు చేస్తున్నారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే, కాపు సామాజికవర్గానికి చెందిన నిమ్మకాయల చినరాజప్ప.. ముద్రగడపై ఒంటికాలిపై లేచారు. తన ఉనికిని కాపాడుకోవడానికే ముద్రగడ ఇలాంటి ఉత్తుత్తి లేఖలు వదులుతుంటారని ఎద్దేవా చేశారు. అయితే ముద్రగడ ఎలాంటి రాజకీయ పదవిలోనూ, రాజకీయ పార్టీలోనూ లేరన్న విషయం చినరాజప్ప మరిచిపోయినట్లున్నారు. రాజకీయపరమైన లక్ష్యాలు ఉంటేనే ఉనికి కోసం నేతలు పాట్లు పడుతుంటారు. కానీ ముద్రగడకు ఆ లక్ష్యం లేదు. చంద్రబాబు కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ల హామీ అమలు చేయాలని చాలా ఏళ్ల తర్వాత ప్రజల్లోకి వచ్చారు. రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్షలు చేశారు కానీ.. రాజకీయాలు, ఎన్నికలు, పోటీ అంశాల జోలికి వెళ్లలేదన్న విషయం తూర్పుగోదావరి జిల్లాకే చెందిన చినరాజప్పకు తెలియంది కాదు.
చంద్రబాబు కాపులకు ఎంతో చేశారని, రిజర్వేషన్లు ఇచ్చారని చినరాజప్ప చెప్పుకొచ్చారు. తాము చంద్రబాబు వెంటే ఉంటామని చెప్పిన రాజప్ప.. ముద్రగడ లేఖ తమకు ఏ స్థాయిలో నష్టం చేకూరుస్తుందన్న ఆందోళనలో ఉన్నామో చెప్పనే చెప్పారు. రాజప్ప ఆది నుంచి టీడీపీలోనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు వెంట నడిచేది ఏముందనే ప్రశ్న సహజంగానే వస్తుంది. అయితే అంతో ఇంతో టీడీపీకి మద్ధతుగా ఉన్న కాపులు కూడా ఇప్పుడు దూరం అవుతారనే ఆందోళన టీడీపీ నేతల్లో నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. ఇంట్లో కూర్చుని లేఖలు రాయకుండా.. బయటకు వచ్చి కాపులకు నష్టం జరగకుండా చూడాలని ముద్రగడకు సూచించిన చినరాజప్ప.. ఇకపై లేఖలు రాయొద్దని ప్రత్యక్షంగానే వేడుకున్నారు. ఆరు నూరైనా తాను ఎంచుకున్న దారిలో నడిచే ముద్రగడ పద్మనాభం.. చినరాజప్ప వ్యాఖ్యలపై స్పందించే అవకాశం లేదనే చెప్పవచ్చు.
Also Read : Mudragada Chandrababu Letter – మీ పతనం చూసేందుకే బ్రతికి ఉన్నా.. చంద్రబాబుకు ముద్రగడ సంచలన లేఖ