iDreamPost
iDreamPost
గత రెండు రోజులుగా రాష్ట్రంలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీగా సాగుతున్న దూషణలు… విమర్శలు.. ప్రతివిమర్శలు.. ఆరోపణలతో వాతావరణం వేడెక్కింది. తప్పు మీదంటే.. కాదు మీదంటూ… ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. పోటాపోటీగా దీక్షలకు.. ధర్నాలకు దిగుతున్నారు. వివాదానికి కారణమైన ‘బోసు ఢీ కే’ అనే పదానికి ఎవరికి తగినట్టుగా వారు భాష్యాలు చెబుతున్నారు. అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ‘బోసు ఢీ కే’ అంటూ ప్రధాన ప్రతిపక్షానికి చెందిన అధికార ప్రతినిధి దూషించడాన్ని సామాన్య జనం తప్పుపడుతున్నారు. ప్రతిపక్ష టీడీపీలో చాలా మంది నాయకులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. పార్టీ చేపట్టిన ఆందోళనలలో అయితే పాల్గొంటున్నారు కాని ముఖ్యమంత్రి మీద తమ పార్టీ నాయకుడు చేసిన వ్యాఖ్యలు బహిరంగంగా సమర్ధించలేకపోతున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి మీద టీడీపీ అధికార ప్రతినిధి కె.పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపిన విషయం, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు కూడా తెలిసిందే. ఈ వివాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్షకు దిగగా, అధికార పార్టీ నియోజకవర్గాల్లో జనాగ్రహ దీక్షలు చేపట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిపై తమ పార్టీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలకు సమర్థింపుగా టీడీపీ ఎంత ప్రచారం చేసినా సామాన్యుల్లో మాత్రం సానుకూలత రావడం లేదు. అధికార పార్టీ తమపై దాడులు చేస్తోందని, తప్పుడు కేసులు పెడుతోందని టీడీపీ తన అనుకూల మీడియా, సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అలాగే గతంలో వైఎస్సార్‌సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన విమర్శలు సైతం తెర మీదకు తెస్తోంది.
Also Read : Sajjala Ramakrishna Reddy – పట్టాభి మాటలు కరెక్టేనా..? ప్రజలు ఆలోచించాలన్న సజ్జల
రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడం ద్వారా ఆందోళనను ఉధృతం చేయాలని భావించినా వ్యాపార సంఘాలు, ప్రజల నుంచి దీనికి మద్దతు రాలేదు. దీనితో వేడి చల్లారిపోకుండా టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల నిరసన దీక్షకు దిగారు. ఇలా ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా సామాన్యులు మాత్రం పట్టాభి వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. వివాదానికి నోరు అదుపులో లేకపోవడమే కారణమంటున్నారు. పైగా గురువారం స్వయంగా ముఖ్యమంత్రి జగన్ తనమీద చేసిన వ్యాఖ్యలకు అర్ధం వివరించడంతో సామాన్యుల ఆగ్రహం రెట్టింపయ్యింది. ముఖ్యమంత్రిపై వ్యక్తిగత దూషణలు చేసిన పట్టాభి క్షమాపణ చెప్పి ఉన్నా, చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేసినా హుందాగా ఉండేదని, అలా కాకుండా ఎదురుదాడికి దిగడం సమర్ధనీయం కాదంటున్నారు.
పట్టాభి వ్యాఖ్యలను చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌లతోపాటు మరికొంత మంది నాయకులు మాత్రమే మద్దతుగా నిలిచారు. ఇదే సమయంలో పార్టీలో సీనియర్లు, మెజార్టీ నాయకులు అంతర్గత సంభాషణలలో తప్పు పడుతున్నారు. సీఎంను అసభ్య పదజాలంతో దూషించడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందంటున్నారు. ఈ కారణంగానే వారు బుధవారం నిర్వహించిన బంద్‌లో చురుగ్గా పాల్గొనలేదు. చాలా మంది మొఖం చాటేశారు. కొంతమంది పార్టీ పిలుపు ఇచ్చిందని ఆందోళన చేపట్టారే తప్ప పట్టాభి వ్యాఖ్యలు సమంజసమేనని నోరుతెరిచి చెప్పినవారు లేరు. ‘ఈ రోజు పట్టాభి మాట్లాడిన మాటలకు మద్దతుగా నిలిచిన మీ టీడీపీ నాయకులను నేను అడుగుతున్నాను. మీ ఇళ్ల వద్దకు వెళ్లి ఇదే మాట మీ ఆడవారి ముందు మాట్లాడగలరా?’ అని రాష్ట్ర మంత్రి పేర్ని నాని అన్నమాట టీడీపీ నాయకుల నోట పచ్చివెలక్కాయ పడినట్టయ్యింది.
Also Read : TDP Chandrababu – ఆ విధంగా ముందుకు పోతూనే ఉన్నారు..!
ఇటీవల పట్టాభి వ్యవహారశైలి, దూషణలు పరిధి దాటుతున్నాయి. పలు సందర్భాలలో వివాదాస్పదమవుతున్నాయి. అయినా చంద్రబాబు నాయుడు అతనిని వారించడం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ అధినేత కూడా ఇదే కోరుకుంటున్నారా? అనే అనుమానం వారిలో వస్తుంది. ఈ వ్యాఖ్యల వల్ల పార్టీకి మేలు కన్నా కీడే ఎక్కువ అవుతుందంటున్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర లేదు. వివరణాత్మక విమర్శలు లేవు. ‘రెచ్చగొట్టడం… తద్వారా లబ్ధిపొందడం’ అనే వ్యూహంతోనే పార్టీ పనిచేస్తుందని పార్టీ సీనియర్లు వాపోతున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టీడీపీ ఎదురుదాడి సిద్ధాంతాన్ని నమ్ముకుని ఆత్మరక్షణలో పడినట్టయ్యింది.