iDreamPost
android-app
ios-app

TDP Ex Minster Jawahar -పాపం జవహర్.. రెంటికీ చెడిపోయారు!

  • Published Oct 21, 2021 | 5:37 AM Updated Updated Mar 11, 2022 | 10:37 PM
TDP Ex Minster Jawahar -పాపం జవహర్.. రెంటికీ చెడిపోయారు!

గత కొన్నాళ్లుగా పార్టీ కమిటీలు, నియోజకవర్గ ఇంఛార్జి పదవుల భర్తీకి ఆపసోపాలు పడుతున్న తెలుగుదేశం అందులోనూ పలు సవాళ్లు ఎదుర్కొంటోంది. అడిగిన వారందరికీ కాదనకుండా పదవులు ఇచ్చి పార్టీ కమిటీలను ఎలాగోలా నింపేసినా.. కీలకమైన నియోజకవర్గ ఇంఛార్జి పదవుల విషయంలో గందరగోళం తప్పడం లేదు. కొన్నిచోట్ల పార్టీ నియమించిన వ్యక్తులను కార్యకర్తలు వ్యతిరేకిస్తుంటే.. ఇంకొన్ని చోట్ల పదవులు ఆశిస్తున్నవారికి ఝలక్ ఇస్తూ వద్దన్నవారికి ఇంఛార్జి బాధ్యతలు కట్టబెడుతున్నారు. మరికొన్ని చోట్ల గతిలేని పరిస్థితుల్లో ద్విసభ్య, త్రిసభ్య కమిటీలతో కాలక్షేపం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో అలాంటి పరిస్థితే నెలకొంది. మాజీమంత్రి కె.ఎస్.జవహర్ కు కొవ్వూరు ఇంఛార్జి పదవి ఇవ్వకుండా ద్విసభ్య కమిటీని నియమించారు.

ద్విసభ్య కమిటీ ఏర్పాటు

చాలా కాలంగా ఖాళీగా ఉన్న కొవ్వూరు నియోజకవర్గ ఇంఛార్జిగా తనను నియమించాలని జవహర్ కోరుతున్నారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి పార్లమెంటు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. వాస్తవానికి ఆయనకు అంత స్థాయి, సామర్థ్యం లేవు. అయితే ఎవరూ దొరక్కపోవడంతో జవహర్ ను నియమించారు. ఆయనకు కూడా ఆ పదవి ఇష్టం లేదు. తన పాత నియోజకవర్గం కొవ్వూరు ఇంఛార్జిగా వెళ్లిపోవాలని కోరుకుంటున్నారు. అధినేత చంద్రబాబుకు సైతం విన్నవించుకున్నారు. జవహర్ విన్నపాన్ని పట్టించుకోని చంద్రబాబు కొవ్వూరు నియోజకవర్గ పర్యవేక్షణకు ఇద్దరు సభ్యులతో కమిటీని నియమించారు. కంఠమనేని రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి కమిటీ సభ్యులుగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు, నేతలు-కార్యకర్తల మధ్య సమన్వయం కుదర్చడం వంటి వ్యవహారాలు చూస్తారు. ఈ నియామకంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న జవహర్ నీరుగారిపోయారు. కాగా ఎస్సీ నియోజకవర్గమైన కొవ్వూరు బాధ్యతలను ఆ సామాజికవర్గ నేతలకు కాకుండా కమ్మ సామాజిక వర్గ నేతలకు పెత్తనం కట్టబెట్టడంపై పార్టీలోనూ అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

తిరువూరు పోయే.. కొవ్వూరు దక్కలే..

2014 ఎన్నికల్లో కొవ్వూరు నుంచి పోటీ చేసి గెలిచిన జవహర్ చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. స్వల్పకాలంలోనే ఆయనపై నియోజకవర్గంలో అసంతృప్తి పెరిగింది. టీడీపీ కార్యకర్తలు సైతం వ్యతిరేకమయ్యారు. 2019 ఎన్నికల సమయంలో జవహర్ కు మళ్లీ టికెట్ ఇవ్వొద్దని అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దాంతో జవహర్ ను కృష్ణా జిల్లా తిరువూరుకు పంపించారు. అదే సమయంలో విశాఖ జిల్లా పాయకరావుపేటలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న వంగలపూడి అనితను తీసుకొచ్చి కొవ్వూరులో పోటీ చేయించారు. ఆ ఇద్దరూ ఓడిపోయారు. తర్వాత కాలంలో అనితను తిరిగి పాయకరావుపేట నియోజకవర్గ ఇంఛార్జిగా నియమించడంతో ఆమె అక్కడికి వెళ్లిపోయారు. తిరువూరులో పోటీని చేసిన జవహర్ ను మాత్రం తిరువూరు, కొవ్వూరు కాకుండా రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్ష పదవి ఇచ్చారు. తిరువూరుకు దేవదత్ ను ఇంఛార్జిగా నియమించారు. అనిత ఖాళీ చేసిన కొవ్వూరు పదవి తనకే దక్కుతుందని ఇన్నాళ్లు జవహర్ ఆశలు పెట్టుకున్నారు. కానీ అధినేత ద్విసభ్య కమిటీ వేయడంతో ఆయన ఎటూ కాకుండా పోయారు.

Also Read : TDP Chandrababu – ఆ విధంగా ముందుకు పోతూనే ఉన్నారు..!