Idream media
Idream media
ఏపీ టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ చంచల్ గూడ జైలులోనే ఉన్నారు. ఇప్పట్లో బెయిలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియను అరెస్టు చేయకపోతే అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయని హైదరాబాద్ పోలీసులు పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కూడా పొందుపరిచారు. అఖిలప్రియ కస్టడీ కోసం బోయిన్‌పల్లి పోలీసులు సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అఖిలప్రియను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు. రేపటి నుంచి ఈనెల 15 వరకు కస్టడీకి ఇవ్వాలని కోరారు. అఖిలప్రియ అనుచరులకు మరికొన్ని కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని, అఖిలప్రియ భర్త సహా మిగతా నిందితులను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. బాధితులతో సంతకాలు చేయించుకున్న దస్త్రాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని పిటిషన్‌లో పోలీసులు పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్ చేశాక కిడ్నాప్ సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయాల్సి ఉందన్నారు.
మరోవైపు అఖిలప్రియకు బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసుల కౌంటర్ దాఖలు చేశారు. అఖిలప్రియకు బెయిల్ వస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని, ఆమెపై తప్పుడు కేసులు పెట్టే ఉద్దేశం మాకు లేదని పోలీసులు తెలిపారు. ‘‘సాక్ష్యాల సేకరణకు దర్యాప్తు బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయాలి. అఖిలప్రియకు బెయిల్ ఇస్తే మరిన్ని నేరాలకు పాల్పడవచ్చు. అఖిలప్రియ చర్యల వల్ల స్థానికుల్లో అభద్రతాభావం నెలకొంది. అఖిలప్రియకు ఆర్థికంగా, రాజకీయంగా ప్రభావితం చేయగలిగే పలుకుబడి ఉంది. అఖిలప్రియకు బెయిల్ ఇస్తే కేసు విచారణ నుంచి తప్పించుకునే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.
హఫీజ్‌పేటలో ప్రవీణ్‌రావు 2016లో ఖరీదు చేసిన 25 ఎకరాల భూమికి సంబంధించిన వివాదాన్ని అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి తదితరులు పరిష్కరించారు. అప్పట్లోనే ఒప్పందం ప్రకారం నిర్ణీత మొత్తాన్ని ప్రవీణ్‌రావు చెల్లించారు. ఇటీవల ఆ భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో తమకు అప్పట్లో ఇచ్చిన మొత్తం చాలదని, భారీ మొత్తం చెల్లించాలని, లేదంటే ఆ భూమిలో వాటా కావాలని అఖిలప్రియ, ఆమె భర్త భార్గరామ్ కలసి ప్రవీణ్‌రావుపై ఒత్తిడి తెచ్చారు. ఇందులో భాగంగా నెరవేర్చుకోవడానికే గుంటూరు శ్రీను, సాయి, చంటి, ప్రకాశ్ తదితరులతో కలసి మంగళవారం రాత్రి బాధితుల్ని కిడ్నాప్ చేయించారు. ఈ క్రమంలో చిలుకూరులో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లో నిర్బంధించి సెటిల్‌మెంట్ చేసుకో వాలని బెదిరిస్తూ కర్రలతో వారిపై దాడి చేశారు. ఆపై ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు చేయించు కున్నారు. ఈ కిడ్నాపులకు సంబంధించిన వార్త మీడియాలో రావడంతో తీవ్ర కలకలం రేగిందని, పోలీసుల వేట ముమ్మరం కావడంతో అఖిలప్రియ తదితరులు అప్రమత్తమయ్యారు. ఆమె సూచన మేరకు ప్రవీణ్, సునీల్, నవీన్‌లను మెహిదీపట్నం సన్‌సిటీ సమీపంలోని కాళీమాత దేవాలయం వద్ద వదిలి వెళ్లారు. అఖిలప్రియ రాజకీయంగా పలుకు బడి ఉన్న నేత కావడంతో సాక్ష్యాలు తారుమారు చేయడంతోపాటు సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ పోలీసులు కోర్టుకు నివేదిం చారు. దర్యాప్తునకు కూడా ఆటంకం కలిగించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
సోమవారానికి వాయిదా
అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై సికింద్రాబాద్ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌ను సోమవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్యం దృష్ట్యా బెయిల్ కోరుతూ అఖిలప్రియ తరుపున ఆమె న్యాయవాది పిటిషన్ వేశారు.కాగా, బెయిల్ మంజూరు చేయవద్దంటూ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు.ఇదిలావుంటే, గురువారం ఉదయం అఖిల ప్రియకు జైల్ లో ఫిట్స్ రవడంతో వైద్యులు చికిత్స అందజేశారు. ఈ కేసులో మరో నిందితుడుగా ఉన్న అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ఇంకా పరారిలోనే ఉన్నాడు. భార్గవ్ రామ్ ఆచూకీ కోసం 15 పోలీసులు బృందాలు గాలిస్తున్నాయి.