iDreamPost
android-app
ios-app

Tdp – కింద పడినా మాదే పైచేయి.. మున్సిపల్ ఫలితాలపై టీడీపీ వింత వాదనలు

  • Published Nov 24, 2021 | 1:56 PM Updated Updated Mar 11, 2022 | 10:33 PM
Tdp – కింద పడినా మాదే పైచేయి.. మున్సిపల్ ఫలితాలపై టీడీపీ వింత వాదనలు

చదివేస్తే ఉన్న మతి పోయిందన్నట్లు తయారైంది టీడీపీ నేతల పరిస్థితి. అధికారం కోల్పోయినప్పటి నుంచి వారు విచక్షణ కోల్పోతున్నారు. ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియని రీతిలో అడ్డగోలు వాదనలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ చేతిలో కోలుకోలేని విధంగా చిత్తు చిత్తుగా ఓడిపోతున్నా.. ఒక్కో ఓటమికి ఒక్కో సాకు వెతుక్కుంటున్నారు.. ఒక్కో నాయకుడు ఒక్కో రీతిలో సొంత భాష్యాలు చెప్పుకుంటున్నారు తప్ప.. ఓటమిని అంగీకరించేందుకు గానీ.. దాన్నుంచి గుణపాఠాలు నేర్చుకునేందుకు గానీ ప్రయత్నించడంలేదు. తాజాగా మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కూడా అదే రీతిలో వితండవాదం వినిపించారు. కుప్పం, నెల్లూరు, జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి ఓడిందని ఆయన సరికొత్త వాదన వినిపించారు.

అక్రమాలు జరిగితే ఊరుకునేవారా?

నెల్లూరు, కుప్పం, జగ్గయ్యపేట మున్సిపాలిటీలను వైఎస్సార్సీపీ ప్రలోభాలు, పోలింగ్ అక్రమాలతో గెలిచిందని దేవినేని ఆరోపించారు. కౌన్సిలర్లకు కోటి చొప్పున ఎర వేశారన్నారు. కానీ ఆ మూడు చోట్ల ఫలితాలు పరిశీలిస్తే ఎవరైనా సరే టీడీపీ ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం ఉందో ఇట్టే అర్థం అవుతుంది. నెల్లూరు కార్పొరేషన్ లో 54 డివిజన్లు ఉంటే మొత్తం అన్నింటిలోనూ వైఎస్సార్సీపీయే గెలిచింది. అది కూడా మంచి మెజారిటీలతో కావడం గమనార్హం. కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులకు గాను 19 వార్డుల్లో వైఎస్సార్సీపీ, 6 వార్డుల్లో టీడీపీ గెలిచాయి.

Also Read : Chandrababu- చివరి అస్త్రాన్ని ప్రయోగించడం మొదలు పెట్టిన చంద్రబాబు

జగ్గయ్యపేటలో 31 వార్డులకు గాను వైఎస్సార్సీపీ 18, టీడీపీ 13 వార్డుల్లో నెగ్గాయి. నెల్లూరులో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయగా.. మిగతా రెండు చోట్లా రెండు పార్టీలు చేజిక్కించుకున్న వార్డుల సంఖ్యలో చాలా తేడా ఉంది. అలాంటప్పుడు టీడీపీ కౌన్సిలర్లకో, కార్పొరేటర్లకో రూ.కోటి చొప్పున సమర్పించి ప్రలోభపెట్టాల్సిన అగత్యం ఎందుకుంటుంది. అలాగే రిగ్గింగ్, అక్రమాలతో గెలిచారన్న వాదన కూడా అలాంటిదే. పోలింగ్ నిరాఘాటంగా జరిగింది. ఎక్కడా రీపోలింగ్ కూడా అవసరం లేకపోయింది. ఎక్కడైనా అక్రమాలు జరిగి ఉంటే టీడీపీ ఏజెంట్లు ఫిర్యాదు చేయకుండా ఉండరు. రీపోలింగ్ కు డిమాండ్ చేయకుండా ఉండేవారు కాదు. కానీ అలాంటివి ఆ మూడు చోట్ల ఎక్కడా జరగలేదు. ఇంతవరకు ఫిర్యాదులు కూడా నమోదు కాలేదు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తీరు మొదటి నుంచీ ఇలాగే ఉంది. పార్టీ గుర్తులు లేకుండా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం వరకు వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలిచారు. కానీ టీడీపీ మద్దతుదారులే ఎక్కువగా గెలిచారని సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు బొంకారు. ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 90 శాతం కైవసం చేసుకోవడంతో నోరుమెదపలేక పోయారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించి బహిష్కరణ నాటకం ఆడారు. వాయిదా పడిన మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు జరిగితే చంద్రబాబు నియోజకవర్గ కేంద్రంలోనే చేతులెత్తేసిన టీడీపీ నేతలు ఓటమిపై తలో రకంగా వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కుప్పంలో వైఎస్సార్సీపీ గెలుపును తాము లెక్కలోకి తీసుకోవడం లేదన్నారు. అదో చిన్న మున్సిపాలిటీ అంటూ తీసిపారేసినట్లు మాట్లాడితే ఇప్పుడు దేవినేని ఉమ మాత్రం అక్కడ తమ పార్టీ గెలిచి ఓడిందని వ్యాఖ్యానించడం విశేషం. తాము గెలిస్తేనే గెలుపు.. ఇతరులది గెలుపు కాదన్నట్లు టీడీపీ నేతలు వ్యాఖ్యానించడం విస్మయం కలిగిస్తోంది.

Also Read ; Kondapalli – ముగిసిన కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక.