iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్‌లో డైవర్షన్ రాజకీయాలు నడుస్తున్నాయని మాజీమంత్రి దేవినేని ఉమా చేసిన విమర్శను వైఎస్సార్ సీపీ నేతలు తప్పుపడుతున్నారు. శుక్రవారం ఉమా మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల ఆందోళన, గుడివాడ క్యాసినో వ్యవహారంపై ప్రజల దృష్టిని మళ్లించడానికే జిల్లాల విభజన అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. గుడివాడ క్యాసినోలో సీఎం జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్‌కి వాటాలున్నాయని తీవ్రస్థాయిలో విమర్శించారు. సీఎం అండతోనే బూతుల మంత్రి ప్రతిపక్షాలపై ఎదురు దాడి చేస్తున్నారని అన్నారు.
అందులో టీడీపీకి పేటెంట్ ఉంది కదా..
డైవర్షన్ రాజకీయాలు నడపడంలో తెలుగుదేశం పార్టీకి పేటెంట్ ఉందన్న సంగతి దేవినేని ఉమా మరచిపోయారా? అని అధికార పార్టీ నాయకులు దుయ్యబడుతున్నారు. ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశం పార్టీని, ముఖ్యమంత్రి పీఠాన్ని, పార్టీ ఫండ్‌ను లాక్కోవడానికి ఆయన సతీమణి లక్ష్మీపార్వతిని బూచిగా చూపి, డైవర్షన్ రాజకీయం చేసి లబ్ధి పొందింది చంద్రబాబు అండ్ కో కాదా అని ప్రశ్నిస్తున్నారు.
వైస్రాయ్ ఎపిసోడ్‌తో తనపై ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ముందుపెట్టి, డైవర్షన్ రాజకీయం నడిపి చివరకు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును, బావమరిది హరికృష్ణను పార్టీ నుంచే బయటకు తరమలేదా? అని ప్రశ్నిస్తున్నారు. తన ప్రజాసంకల్ప పాదయాత్రతో జనంలో ఆదరణ పొందిన నాటి ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం చేయించి, కోడికత్తి కేసు అంటూ పచ్చ మీడియా సాయంతో డైవర్షన్ రాజకీయాలు చేసింది టీడీపీ కాదా? అమరావతి రాజధాని పేరిట పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీసిన చంద్రబాబు అందులో తన అవినీతిని కప్పి పుచ్చుకోవడానికి గ్రాఫిక్స్‌తో డైవర్షన్ రాజకీయాలు చేయలేదా అని అడుగుతున్నారు.
చరిత్రలో ఎన్నడూ లేని తరహాలో వివిధ పథకాలతో దాదాపు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందిస్తూ ప్రజల ఆదరణ పొందుతున్న సీఎం జగన్‌ను బదనాం చేయడానికి రోజూ మీరు చేసేవి డైవర్షన్ పాలిటిక్స్ కాదా? ఆలయాల్లో విగ్రహాలపై దాడి, అంతర్వేది రథం దగ్ధం, డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రచారం, అసెంబ్లీ మీద అలిగి బయటకు వచ్చేయడం, మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్వడం వంటివి ఏ తరహా రాజకీయాలు అంటారో టీడీపీ నేతలే చెప్పాలని వైఎస్సార్ సీపీ నాయకులు అడుగుతున్నారు. అనునిత్యం సీఎం జగన్‌ను, డీజీపీ సవాంగ్‌ను వ్యక్తిగతంగా దూషిస్తూ, వారిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ జనంలో పబ్లిసిటీ పొందాలని యత్నించడం తప్పుదోవ పట్టించే రాజకీయం కాక మరేమిటి అని ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు జిల్లాల సంఖ్యను పెంచడాన్ని మాట నిలబెట్టుకోవడం అంటారు కాని డైవర్షన్ రాజకీయం అనరు అన్న సంగతి దేవినేని ఉమ గమనించాలని వైఎస్సార్ సీపీ నేతలు సూచిస్తున్నారు.