iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ చేతుల్లో ఉన్న ఏకైక మునిసిపల్ కార్పోరేషన్ కాకినాడ. అది కూడా 2017లో చంద్రబాబు అధికారంలో ఉండగా జరిగిన ఎన్నికల్లో గెలిచిన మేయర్ పీఠం. ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో కేవలం తాడిపత్రి మునిసిపాలిటీ మినహా మొత్తం మునిసిపాలిటీలు, కార్పోరేషన్లు అన్నింటినీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మిగిలిన కాకినాడ ను కూడా టీడీపీ కోల్పోయే ప్రమాదం దాపురించింది. ఇప్పటికే 21 మంది టీడీపీ కార్పోరేటర్లు తిరుగుబాటు చేశారు. తమను స్వంతంత్ర్య కూటమిగా పరిగణించాలని కోరుతూ లేఖ రాశారు. దాంతో టీడీపీ బలం సగానికి పడిపోయింది.
వాస్తవానికి ప్రస్తుతం రెండో డిప్యూటీ మేయర్ పీఠానికి ఎన్నిక జరగాల్సి ఉంది. దానిని కైవసం చేసుకోవాలని టీడీపీ ఆశిస్తోంది. కానీ ఆపార్టీకి సొంత కార్పోరేటర్లు ఎదురుతిరగడంతో ఆశలపై నీళ్లు జల్లినట్టయ్యింది. 39 డివిజన్లు టీడీపీ, 3 బీజేపీ కలిసి గెలుచుకున్నాయి. ఇక ఇద్దరు ఇండిపెండెంట్లు, ఆరుగురు వైఎస్సార్సీపీ కార్పోరేటర్లు గడిచని ఎన్నికల్లో గెలిచారు. కానీ సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ మారిపోయింది. అనేక మంది టీడీపీ కార్పోరేటర్లు , బీజేపీ కార్పోరేటర్ సహా వైఎస్సార్సీపీకి జై కొట్టారు. వారంతా ఈసారి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపరిచే అభ్యర్థిని గెలిపించేందుకు సిద్ధమయ్యారు.
టీడీపీ మాత్రం తమ పార్టీ కార్పోరేటర్లకు విప్ జారీ చేసి కట్టడి చేయాలని యత్నించింది. అదే ఇప్పుడు బూమరాంగ్ అయ్యింది. విప్ జారీ చేసిన వెంటనే తాము టీడీపీ కాదని, స్వతంత్ర్య కూటమిగా గుర్తించాలని 21 మంది కార్పోరేటర్లు ముందుకొచ్చారు. దాంతో ఆపార్టీ బలం 17కి పడిపోయింది. అనివార్యంగా బీజేపీకి చెందిన ఒక కార్పోరేటర్ తో పాటు గా టీడీపీ నుంచి తిరుగుబాటు చేసిన వారితో కలిపి 22 మంది మద్ధతు వైఎస్సార్సీపీకి వచ్చింది. అదే సమయంలో వైఎస్సార్సీపీకి చెందిన కార్పోరేటర్ కంపర రమేష్ కొద్దికాలం క్రితం హత్యకు గురయ్యారు. దాంతో ఆపార్టీకి మద్ధతిస్తున్న వారితో కలిపి 27 మంది కార్పోరేటర్ల బలం కనిపిస్తోంది.
వాస్తవానికి ప్రస్తుతం డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతున్నప్పటికీ త్వరలోనే మేయర్ పీఠానికి అవిశ్వాసం పెట్టేందుకు అంతా సిద్ధమయ్యింది. అదే ఇప్పుడు టీడీపీ అసలు బెంగ. మేయర్ సీటు ని కాపాడుకోవాలని ప్రయత్నించింది. నిజానికి స్థానిక సంస్తల్లో ప్రజా ప్రతినిదులకు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి 4 ఏళ్ల పాలనా కాలం నిండాల్సి ఉంది. గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో ఈ సవరణతో చట్టం ఆమోదించారు. అంతకుముందు రెండున్నరేళ్లుగా ఉన్న సమయంలో అనేక చోట్ల తిరుగుబాట్లు జరిగేవి. పలితంగా స్థానిక సంస్థల్లో నిత్యం ఆధిపత్య పోరు కనిపించేది. దానిని 4 ఏళ్లకు పొడిగించడంతో చివరి ఏడాది అధికారం కోసం పెద్దగా ఎవరూ ఆసక్తి చూపని పరిస్థితి వచ్చింది. కానీ కాకినాడలో మాత్రం దానికి భిన్నంగా టీడీపీ మేయర్ పీఠానికి ఎసరు పెట్టేయడం అనివార్యంగా కనిపిస్తోంది.ఉన్న ఒక్కగానొక్క మేయర్ స్థానాన్ని కూడా ఆపార్టీ కోల్పోవడం ఖాయమనే వాదన వినిపిస్తోంది.
Also Read : ఆ మాజీ ఎమ్మెల్యే ఆఫీసుకెళ్లి కొడతాడంట …