iDreamPost
iDreamPost
చంద్రబాబు సహజధోరణికి భిన్నంగా వ్యవహరించారు. ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడిన అమరావతి కోసం చివరకు తన భార్యను కూడా రంగంలోకి తెచ్చిన టీడీపీ అధినేత ఇప్పుడు మాత్రం ఏం చేయాలో పాలుపోని స్థితిలో చిక్కుకున్నారు. మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక కారణాలు పసిగట్టలేక ప్రతిపక్షం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఎటు నుంచి ఎక్కడికి దారితీస్తుందోననే సందిగ్ధంలో కనిపిస్తోంది.
మామూలుగా అయితే అమరావతికి సంబందించిన ఇంత పెద్ద అప్ డేట్ వచ్చినప్పుడు చంద్రబాబు ఉన్నపళంగా రియాక్ట్ అవుతారు. వీలయితే మీడియా ముందుకొచ్చి పెద్ద ఉపన్యాసమే ఇస్తారు.. కానీ ఈసారి దానికి విరుద్ధంగా ఉంది ఆయన తీరు. చివరకు అనుకూల పత్రికల్లో కూడా నేరుగా చంద్రబాబు స్పందించలేకపోయిన అంశాన్ని ప్రస్తావించాల్సి వచ్చింది. అంతర్గత సమావేశంలో ఆయన ఇలా అన్నారని మాత్రమే ఈనాడు రాసే పరిస్థితి దాపురించింది. దానికి అధికార పార్టీ అనూహ్య ఎత్తుగడలే కారణంగా చెప్పవచ్చు.
నిజానికి ఈ రెండు చట్టాల విషయంలో ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేస్తుందనే అంచనా విపక్షంలో ఎన్నడూ లేదు. ఒక అడుగు వేసి, మళ్లీ రెండడుగులు ముందుకేస్తుందనే భావన కూడా కలగలేదు. అంత వేగంగా జగన్ పావులు కదపడం టీడీపీ నేతలు తలలు పట్టుకునేలా చేస్తోంది సహజంగా పాలకపక్షంలో జరుగుతున్న విషయాలు ఏదో మేరకు పసిగట్టవచ్చు గానీ, ప్రస్తుతం జగన్ హయాంలో అలాంటి అవకాశం కనిపించడం లేదు. మూడు రాజధానుల ప్రకటన విషయంలో గానీ, ఇప్పుడు చట్టాలు వెనక్కి తీసుకోవడంలో గానీ ఎవరికీ ఉప్పందిన దాఖలాలే లేవు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అమరావతి విషయంలో టీడీపీ సూటిగా స్పందించలేకపోవడానికి అనేక కారణాలున్నట్టు తెలుస్తోంది.
అమరావతి కోసం ఎంతో బలంగా వాదించిన చంద్రబాబుని ఇప్పుడు కేవలం ఆ ఒక్క ప్రాంతానికే పరిమితం చేసే ఎత్తుగడగా దీనిని టీడీపీ అంచనా వేస్తోంది. అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్రలో టీడీపీ ఇరకాటంలో పడే ప్రమాదం కనిపిస్తోంది. దాంతో వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్న జగన్ ని ఎదుర్కోవాలంటే ఆచితూచి వ్యవహరించాల్సిందేననే అభిప్రాయం టీడీపీ నేతల్లో వినిపిస్తోంది. చంద్రబాబు అంత సైలెంట్ గా ఉండడానికి అసలు కారణం అదేనని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు టీడీపీ అధినేత ఎక్కడ నోరు తెరిచి తమ పరువు తీస్తారోననే బెంగలో ఉండగా, బాబు మీద ఆ ఒత్తిడి పనిచేసినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే కష్టంగా ఉన్న పార్టీని మరింత ఇరకాటంలో నెట్టేసే రీతిలో వ్యవహరించకూడదని టీడీపీ భావిస్తోంది.
అదే సమయంలో అమరావతి కోసం చంద్రబాబు బలంగా తన స్వరం వినిపించకపోతే రెంటికీ చెడ్డ రేవడిలా మారుతుంది. టీడీపీ అంచనా ప్రకారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోలుకున్నామని భావిస్తున్న దశలో అమరావతి మీద ఊగిసలాట కుదరదని ఓ వర్గం చెబుతోంది. ఇది టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితికి నెట్టింది. మొత్తంగా తొలిసారిగా చంద్రబాబు ఓ కీలక పరిణామం మీద బహిరంగంగా వ్యాఖ్యానించలేని స్థితికి టీడీపీని పాలక పక్షం నెట్టేసినట్టు చెప్పవచ్చు.