iDreamPost
iDreamPost
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా పాలకమండలి సభ్యుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో గతంలో టీటీడీ పాలకమండలికి ప్రాతినిధ్యం వహించిన కొందరు ముఖ్యులను ఆహ్వానితులుగా ప్రకటించింది.
సహజంగానే టీటీడీలో ఏం జరిగినా దానిని రాజకీయంగా రచ్చ చేసేందుకు యత్నిస్తున్న విపక్ష టీడీపీ ఇప్పుడు గగ్గోలు పెడుతోంది. చివరకు స్వామి వారి పూజకు ఉపయోగించిన పువ్వులను వృధా కాకుండా వాటితో అగరబత్తీల తయారీకి పూనుకోవడాన్ని కూడా తప్పుబడుతూ ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారంటే ఏ స్థాయిలో ఉన్నారో అర్థమవుతోంది. అయితే కోర్టు అందులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించడం విశేషం.
ఇక తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నేరుగా సీఎం జగన్ కి లేఖ రాశారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. జంబో టీమ్ తో పాలకమండలి నియామకం తప్పుబట్టారు. పైగా పాలకమండలిలో అర్హత లేనివారు, నేరస్తులు, పారిశ్రామికవేత్తలున్నారంటూ అభిప్రాయపడ్డారు. ఇక టీడీపీ ఇతర నేతలు, సోషల్ మీడియా విభాగం అయితే మరింత రెచ్చిపోతోంది. టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్య పెరగడాన్ని పచ్చ మీడియా కూడా పెద్ద తప్పిదం అన్నట్టుగా సూత్రీకరిస్తోంది.
Also Read : మాజీ ఎమ్మెల్యే వైఖరితోనే కాకినాడ మేయర్ అవిశ్వాసం?
వాస్తవానికి 1932లో టీటీడీ ఏర్పడినప్పుడు పాలకమండలి సభ్యులు ఏడుగురు. రానురాను పెరుగుతున్న అవసరాలు, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆ సంఖ్యను పెంచుతూ వస్తున్నారు. చంద్రబాబు హయంలో కూడా ఈసంఖ్యను పెంచారు. కానీ ఇప్పుడే తొలిసారిగా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నట్టుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ఇతర రాష్ట్రాల వారికీ, పారిశ్రామికవేత్తలకు బోర్డు సభ్యులుగా అవకాశం ఇవ్వడమే తప్పుగా చెప్పేందుకు వెనుకాడడం లేదు. కానీ వాస్తవానికి చంద్రబాబు హయంలో రిలయన్స్ ముఖేష్ అంబానీ భార్య నీతూ కుమారిని ఏకంగా రెండు సార్లు పాలకమండలిలో నియమించిన సంగతిని టీడీపీ శ్రేణులు, వంతపాడే మీడియా మరచిపోయినట్టుంది.
ఇక టీటీడీ నియామకాల్లో అర్హత లేకపోయినా నియమించి ఆ తర్వాత తప్పుని సరిదిద్దుకున్న ఘనత చంద్రబాబుదే. అప్పట్లో పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న వంగలపూడి అనితను టీటీడీ బోర్డులోకి తీసుకుని, ఆమె మత విశ్వాసాల మూలంగా మళ్లీ మార్పు చేసిన సంగతి మరచిపోతే ఎలా. చివరకు బోర్డు చైర్మన్ పదివిలో నియమించిన పుట్టా సుధాకర్ విషయంలోనూ అన్యమత వ్యవహారం చుట్టూ రచ్చ సాగిన సంగతి గుర్తు చేయాల్సిన పరిస్థితి రావడం విస్మయకరం. ఇక టీటీడీ బోర్డులో నేర చరిత్ర ఉన్న వారికి, అవినీతి ఆరోపణలున్న వారికి పెద్ద పీట వేసిన ఘతన చంద్రబాబుది. కానీ ఇప్పుడే ఆయన సచ్ఛీలుడన్నట్టుగా చెప్పుకోవడానికి నిస్సిగ్గుగా ప్రయత్నం చేయడమే ఆశ్చర్యకరంగా మారుతోంది.
వాస్తవానికి టీటీడీ పాలకమండలి సభ్యుల పెంపుదల వల్ల సామాన్య భక్తులకు గానీ, ఆలయంలో కార్యకలాపాలకు గానీ ఆటంకాలు ఉండవన్నది అందరికీ తెలుసు. అయితే జగన్ తీసుకున్న నిర్ణయం కాబట్టి దాని చుట్టూ వివాదం సృష్టించి దాని నుంచి రాజకీయ లబ్ది పొందాలనే ఓ కుయత్నంలో భాగంగానే చంద్రబాబు ఇలాంటి కుటిల ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి ప్రయత్నాలు ఏపీ ప్రజలు ఇప్పటికే అనేకమార్లు తిప్పికొట్టిన సంగతి గుర్తించుకుంటే మంచిదేమో.
Also Read : ఫైబర్ గ్రిడ్ కుంభకోణం.. ఏం జరగబోతోంది?