Idream media
Idream media
దేశ రాజకీయాల్లోనే చరిత్ర సృష్టించిన పార్టీ.. మహనీయుడు ఎన్టీఆర్ ఉన్నంత కాలం తెలుగువాడి ఆత్మ గౌరవానికి ప్రతీకగా వెలుగొందిన పార్టీ.. అంతటి ప్రాచుర్యం పొందిన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడెందుకీ దుస్థితి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూడా 15 ఏళ్ల పాటు తెలుగుదేశం పాలన సాగింది. అలాంటి పార్టీ పరిస్థితి 15 నెలల కాలంలోనే ఇంతలా దిగజారడానికి కారణాలేంటి..? చివరకు పార్టీలోనే ఉండాలని ద్వితీయ శ్రేణి నాయకులను, కేడర్ ను బతిమలాడుకోవాల్సి వస్తోందంటే ఏపీలో తెలుగుదేశం దుస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనికి గల కారణాలను పరిశీలిస్తే ఇటీవల కాలంలో పార్టీ తీసుకున్న లైన్.. చంద్రబాబు లోపభూయిష్ట నిర్ణయాలు టీడీపీ ప్రతిష్ఠ దెబ్బతీశాయని చెప్పక తప్పదు.
నియోజకవర్గాల్లో విచిత్ర పరిస్థితి
ఏపీలోని కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పరిస్థితి చాలా దారుణంగా మారింది. పార్టీ పేరు చెప్పుకోవాలంటేనే చాలా మంది నేతలు ఆలోచిస్తున్నారనడంలో సందేహం లేదు. ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ దుస్థితి ఉంది. విశాఖకు వ్యతిరేకంగా చంద్రబాబు పోరాటం చేస్తుండడంతో స్థానిక టీడీపీ నేతలు బయట తిరగలేకపోతున్నారు. ఇప్పటికే విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. వారి స్థానంలో ఎదగాలని ప్రయత్నిస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులకు విచిత్ర అనుభవాలు ఎదురవుతున్నాయి. కార్యకర్తలు, చోటా, మోటా నాయకులు వారితో కలిసి వచ్చేందుకు ఆలోచిస్తున్నారు. జగన్ సంక్షేమ పాలన ధాటికి ఈ ప్రాంతంలో 10, 15 ఏళ్ల పాటు టీడీపీ కి కాలం చెల్లినట్లే నని వారు భావిస్తున్నారు. దీంతో తెలుగుదేశం నేతల వెంట తిరిగేందుకు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో బాబ్బాబు టీడీపీ లోనే ఉండండయ్యా.. అని ఆయా నేతలు బతిమలాడుకోవాల్సి వస్తోంది.
ఏపీ అంతటా కూడా..
ఉత్తరాంధ్రలో పరిస్థితి అలా ఉంటే.. ఇటీవల తెలుగుదేశం చేస్తున్న కాషాయికరణ జపం కూడా ఏపీలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రభావం చూపుతోంది. ప్రధానంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని రెచ్చగొట్టేలా చంద్రబాబు మత రాజకీయాలు ఉన్నాయన్న భావన కొందరిలో వ్యక్తమవుతోంది. ఎన్నడూ లేని విధంగా టీడీపీ ఇటువంటి లైన్ ఎంచుకోవడాన్ని పార్టీలోని చాలా మంది కార్యకర్తలు, నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో వారంతా తెలుగుదేశం కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అమరావతి పరిసర ప్రాంతాలకు చెందిన జిల్లాలలోని కొన్ని నియోజకవర్గాల్లో మినహా తెలుగుదేశం అన్ని చోట్లా పట్టుకోల్పోతోంది. ఈ పరిణామాలన్నీ గమనించి పసుపు చైతన్యం పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించిన పార్టీ అధినేత చంద్రబాబు ద్వితీయ శ్రేణి నాయకులను, కార్యకర్తలను కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలితానిస్తున్నట్లు కనిపించడం లేదు. మరి ఈ నేపథ్యంలో ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సిందే.