iDreamPost
iDreamPost
రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజలు ఉద్యమబాట పట్టి రోడ్లపైకి వస్తున్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఊహాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ గోరంట్ల మంగళవారం రాజమహేంద్రవరంలో సైకిల్ తొక్కుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 22 రాష్ట్రాలు ఇప్పటికే పెట్రోల్, డీజీల్‌లపై వ్యాట్ తగ్గించాయన్నారు. పెట్రోల్, డీజీల్ ధరలు పెంచటం వల్ల ప్రజలంతా వాహనాలు పక్కన పెట్టి సైకిల్ వైపు చూస్తున్నారని మరో వింత వ్యాఖ్య చేశారు. పెట్రోల్, డీజీల్ ధరలు పెంచటం వల్ల వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమవుతున్నాయని ఆవేదనవ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను ఇష్టానుసారం పెంచుకుంటూ పోయి లీటర్ పెట్రోల్ రూ.115కు తీసుకెళ్లినప్పడు ఉద్యమ బాట పట్టని ప్రజలు తెలుగుదేశం మంగళవారం గంటసేపు చేసిన ఆందోళనతో రోడ్లెక్కేశారా? మీరు సైకిల్ తొక్కినంత మాత్రాన జనం అందరూ సైకిల్ తొక్కేయడానికి సిద్ధపడిపోతున్నారనుకోవడం భ్రమ కాక మరేమిటి! మొన్నటి ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి కొన్ని రాష్ట్రాలో ఎదురుదెబ్బ తగిలే వరకు దేశ వ్యాప్తంగా పెట్రో ధరలు తగ్గించాలని ఎవరెన్ని ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు కదా.. అప్పుడు అందరూ ఆందోళన చేస్తుంటే ఇళ్లకే పరిమితమైన టీడీపీ నాయకులు ఇప్పుడు రోడ్డెక్కేస్తే ఉద్యమం మొదలవడం, ఊపందుకోవడం కూడా జరిగిపోయిందా! మీరు, మీ పార్టీ ఇలా వాస్తవానికి దూరంగా ఊహాల్లో విహరించడమే కాక జనాన్ని కూడా నమ్మించాలని చూడడం ఏమిటి!
వ్యవస్థలను ఎవరు చిన్నాభిన్నం చేశారు..
పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమైన పెట్రో ధరల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మీ పార్టీ ఆందోళనకు పిలుపు ఇవ్వడమే రాజకీయమని జనం గుర్తించలేదనుకుంటున్నారా? పెట్రో ధరలు పెరగడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కపట వైఖరిని వివరిస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విస్పష్టమైన ప్రకటన చేసింది . మన రాష్ట్రమనే కాక దేశ వ్యాప్తంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ విషయంలో అనుసరిస్తున్న వైఖరిని తప్పుబడుతున్నారు. ఇబ్బడి ముబ్బడిగా ధరలు పెంచేసి త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరుగునున్న కీలకమైన ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే బీజేపీ ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున తగ్గించిందన్న సంగతి అందరికీ అర్థమైపోయింది.
Also Read : Liquor, Petrol – మద్యం, పెట్రోలు… రెండూ ఒకటేనా సోము…?
మీకూ ఈ విషయం తెలిసినా ఉద్యమం అంటూ రాజకీయం చేయడం దిగజారుడుతనం కాక మరేమిటి? పెట్రో ధరల మంటలో చలికాచుకోవాలని మీ పార్టీ చేస్తున్న చిల్లర రాజకీయం తెలుసుకోలేనంత అమాయకులు ఎవరూ రాష్ట్రంలో లేరు. అందుకే పచ్చ చొక్కా వేసుకొని మీరు సైకిల్ తొక్కినా, పెట్రోల్ బంకుల ముందు మీ పార్టీ శ్రేణులు నిర్ణీత సమయం ప్రకారం డ్రామాలాడినా జనం స్పందించలేదు. దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రజలు ఉద్యమబాట పట్టి రోడ్లపైకి వస్తున్నారని ప్రకటన చేయడం ఎవరిని నమ్మించడానికి. జనం ఇళ్లలో కూర్చున్నా మీడియా సాక్షిగా మీ విన్యాసాలు ఎప్పటికప్పుడు గమనించడం లేదనుకోవడం మీ భ్రమ.
పెట్రోల్, డీజీల్ ధరలు పెంచటం వల్ల వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమవుతున్నాయని చెబుతున్న మీరు ఈ అంశాన్ని ఇన్నాళ్లుగా ధరలు పెరుగుతున్నా ఎందుకు గుర్తించలేదు. మీరు చేసిన విమర్శ ప్రకారం వ్యవస్థలు చిన్నాభిన్నం కావడానికి గతంలో మీ పార్టీ అధికారంలో ఉండగా పెంచిన సెస్, కేంద్ర ప్రభుత్వం పెంచిన సెస్ కారణం. ఎందుకంటే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధించిన సెస్ కేవలం లీటర్‌కు ఒక రూపాయే.
మీ మాట వినాలా? మీ బాస్ బాబు మాట వినాలా?
మీ నాయకుడు చంద్రబాబునాయుడు లీటర్ పెట్రోల్‌కు రూ.16, డీజిల్‌కు రూ.17 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలని డిమాండ్ చేస్తుంటే మీరు రూ.15 చొప్పున తగ్గించాలని డిమాండ్ చేశారేమిటి? క్రమశిక్షణ కలిగిన పార్టీలో అత్యంత క్రమశిక్షణ కలిగిన సీనియర్ నాయకుడైన మీరు చేసిన డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోవాలా? బాబుగారిదా? దేశంలో 22 రాష్ట్రాలు ఇప్పటికే పెట్రోల్, డీజీల్‌లపై వ్యాట్ తగ్గించాయని మీరంటారు. మీ బాస్ ఏమో 23 రాష్ట్రాలు అంటారు. ఏదీ కరెక్ట్? వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పత్రికల్లో ప్రకటనల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని బాధపడుతున్న మీరు అందుకు కారణం మీ పార్టీ, మీ అనుంగు మీడియా అనే సంగతి మరచిపోయారా? రాష్ట్ర ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేపట్టినా అది రాష్ట్ర వినాశనానికే అన్నట్టు మీ పార్టీ నాయకులు, మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికే ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించాల్సి వస్తోందని గ్రహించండి. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీ గోబెల్స్ ప్రచారం ఆపేస్తే ప్రభుత్వం ప్రకటనలిచ్చుకొనే అవసరమే ఉండదు.