iDreamPost
android-app
ios-app

Tdp ,butchaiah – అవగాహన లేకుండా విమర్శలేల బుచ్చయ్య..?

  • Published Nov 25, 2021 | 12:44 PM Updated Updated Nov 25, 2021 | 12:44 PM
Tdp ,butchaiah – అవగాహన లేకుండా విమర్శలేల బుచ్చయ్య..?

రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కనీస అవగాహన లేకుండా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు చేయడం విచిత్రంగా ఉంది. గురువారం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంపై ఇష్టానుసారం ఆరోపణలు చేసేశారు. అమ్మఒడి పథకం ద్వారా రూ.15,000 నేరుగా తల్లి బ్యాంక్ అకౌంట్‌లోనే పడతాయని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు అందులో రూ.1,000 మినహాయింపు చేసుకుని 14,000 వేస్తోందని అన్నారు. కుటుంబంలో ఒక్క పిల్లాడికే డబ్బులు ఇస్తున్నారని విమర్శించారు. కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వం నుంచి చెల్లించడం లేదన్నారు.


తల్లిదండ్రుల సమ్మతితోనే మినహాయింపు..

అ‍మ్మ ఒడి పథకంలో మినహాయిస్తున్న ఆ రూ.1,000 పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణకు అన్న సంగతి సీనియర్‌ రాజకీయ నాయకుడు అయిన ఎమ్మెల్యే బుచ్చయ్యకు తెలియకపోవడం విడ్డూరం. దీనికి సంబంధించి ప్రభుత్వం గతేడాది దీనిపై విస్తృతంగా ప్రచారం చేసింది కూడా. తల్లిదండ్రుల సమ్మతితోనే ఆ డబ్బును మినహాయిస్తోంది. పాఠశాలలో పరిశుభ్రత కోసం, తమ పిల్లల ఆరోగ్యం కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తల్లిదండ్రులు కూడా స్వాగతించారు.

వెయ్యి రూపాయలు మినహాయించుకోమని తమ సమ్మతి తెలిపారు. ఇవేమీ తెలుసుకోకుండా ఆ సొమ్ము ఏదో పక్కదారి పట్టినట్టు గగ్గోలు పెట్టడం బుచ్చయ్యకు తగునా? అమ్మ ఒడి పథకం అమలుకు సంబంధించిన విధి విధానాల్లోనే కుటుంబంలో ఒకరికే ఇది వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలవుతోంది. ఈ విషయం కూడా తెలియకుండా ఇప్పుడు ప్రభుత్వం ఏదో అన్యాయం చేస్తున్నట్టు బుచ్చయ్య చౌదరి మాట్లాడుతున్నారు. అంటే ఈ పథకం అమలుపై ఆయనకు అవగాహన లేదని అర్థం అవుతోంది.అలాగే కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వం నుంచి చెల్లించడం లేదనడం కూడా ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనం.

ఫీజు  రీయింబర్స్‌మెంట్ సొమ్ము తల్లుల బ్యాంకు ఖాతాలకే నాలుగు విడతలుగా ప్రభుత్వం జమ చేస్తోంది. ఇది కూడా ప్రభుత్వం తీసుకున్న విధాన పర నిర్ణయం. దీనివల్ల తల్లిదండ్రులు తమ పిల్లలు చదివే కాలేజీలకు వెళ్లి అక్కడ వసతులు, సౌకర్యాలపై అవగాహన పెంచుకుంటారని, అవసరమైతే కాలేజీల యాజమాన్యాలను ప్రశ్నించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయించింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాదిరిగా కాకుండా పూర్తి మొత్తంలో ఫీజు  రీయింబర్స్‌మెంట్ సొమ్మును ప్రభుత్వం జమ చేస్తోంది.

Also Read : Jr Ntr – మాట్లాడినా తప్పే, మాట్లాడకున్నా తప్పే.. జూనియర్ ని కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్ర ప్రభుత్వం పెంచిందా?

రాష్ట్రంలో 6 లక్షల ఆటోలు ఉంటే 1.80లక్ష 80వేల మందికి మాత్రమే రూ.10,000 చొప్పున వేశారని బుచ్చయ్యచౌదరి ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి నెలకు రూ.4 వేలు ఆటో డ్రైవర‌్ల దగ్గర అదనంగా వసూలు చేసుకుంటున్నారని విమర్శించారు. పోలీసుల చలానాల రూపంలో మరికొంత వసూలు చేస్తున్నారన్నారు. వాహన మిత్ర పథకం కింద దరఖాస్తు చేసుకున్నవారందరికీ ప్రభుత్వం రూ.10,000 చొప్పున ఏటా నేరుగా వారి ఖాతాల్లో వేస్తోంది. దరఖాస్తు చేసినా డబ్బు జమ కాకపోతే లోపం ఎక్కడ జరిగిందో గుర్తించి, సరి చేసి మరీ డబ్బు చెల్లిస్తోంది. రాష్ట్రంలో అర్హులైన వారికే పథకం వర్తిస్తుంది కాని మొత్తం వాహనాలు ఉన్న అందరికీ వర్తించదు కదా? పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్ర ప్రభుత్వం పెంచడమేమిటి? వాటి ధరలపై నియంత్రణ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని తెలియనంత అమాయకుడా బుచ్చయ్య అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పోలీసులు చలనా రూపంలో వసూలు చేస్తున్నారని బాధ పడిపోవడం ఏమిటి? నిబంధనలకు విరుద్ధంగా నడిచే వాహనాలకే చలానాలు రాస్తారు తప్ప రోడ్డుపై నడిచే ప్రతి వాహనానికి రాయరు కదా. అదేదో అన్యాయమన్నట్టు మాట్లాడడమేమిటో ఆయనకే తెలియాలి.

కేసులకు భయపడమని ఎవరు చెప్పారు?

కార్యకర్తలు కేసులకు భయపడవద్దని, కోర్టుల్లోనే తేల్చుకుంటామని బుచ్చయ్య అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అధికారులను ముఖ్యంగా పోలీసులను దుర్భాషలాడుతుంటే శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు కేసులు పెట్టరా? పార్టీ అధినేత చంద్రబాబు నుంచి కార్యకర్తల వరకు రెచ్చగొట్టే ధోరణిలో, అనాగరిక భాషలో మాట్లాడుతుంటే బాధితులు చేసిన ఫిర్యాదు మేరకే పోలీసులు కేసులు పెడుతున్నారన్న సంగతి బుచ్చయ్యకు తెలియదా? కేసులకు భయపడబోమని పదే పదే చెప్పడం ఎందుకు? అసలు కేసులకు భయపడమని మీకు ఎవరు చెప్పారు. మీరు నోటిని అదుపులో పెట్టుకుంటే కేసులు రాసే పని పోలీసులకు ఉండదు అని వైఎస్సార్‌ సీపీ నాయకులు అనేదానికి ఏమని సమాధానం చెబుతారు. ఏదోవిధంగా ప్రభుత్వంపై బురద జల్లాలనే ఉద్దేశం కాకపోతే బుచ్చయ్య చౌదరి చేసిన ఆరోపణలకు ఏమైనా విలువ ఉందా అన్న ప్రశ్నలు సామాన్యుల నుంచే వినిపిస్తున్నాయి. ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలి గాని ఈ బురద జల్లుడు తగునా బుచ్చయ్య?

Also Read : Chandrababu- పాలన వదిలి పొలిటికల్‌ స్టంట్లు చేయాలంటారా బాబూ..?