iDreamPost
android-app
ios-app

అనకాపల్లి, నర్సీపట్నం – అయ్యన్నపాచిక పారేనా?

  • Published Jan 20, 2022 | 12:13 PM Updated Updated Jan 20, 2022 | 12:13 PM
అనకాపల్లి, నర్సీపట్నం – అయ్యన్నపాచిక పారేనా?

అసెంబ్లీ నియోజకవర్గాల మాదిరిగానే.. చాలా లోక్‌ సభ నియోజకవర్గాల్లోనూ టీడీపీ నాయకత్వ కొరత ఎదుర్కొంటోంది. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏవో తంటాలు పడి ఇంఛార్జిలను నియమిస్తున్నా.. పార్లమెంటు నియోజకవర్గాలకు సమర్థులైన నేతలు దొరకడం లేదు. గత ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత నాయకులు, క్యాడర్ చాలావరకు వలస పోవడం, పార్టీకి దూరంగా వ్యాపార వ్యవహారాల్లో మునిగిపోవడంతో ఇప్పటికీ పలు పార్లమెంటు నియోజకవర్గాలకు బాధ్యులను నియమించలేక టీడీపీ అధిష్టానం సతమతం అవుతోంది. అటువంటి వాటిలో అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం ఒకటి. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో విస్తరించి ఉండే పార్లమెంటు నియోజకవర్గాన్ని ఏకతాటిపై పెట్టే స్థాయి ఉన్న నేతలు దొరక్క గత ఎన్నికల నాటి నుంచి ఈ పదవి ఖాళీగానే ఉండిపోయింది. తాజాగా ఈ నియోజకవర్గంపై మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. తన కుమారుడిని నర్సీపట్నం నుంచి పోటీ చేయించి.. తాను అనకాపల్లి ఎంపీగా పోటీ చేసేందుకు ఆయన పావులు కడుపుతున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

గత అభ్యర్థి వైఎస్సార్సీపీ లోకి

గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆడారి ఆనంద్ కుమార్ వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ బీవీ సత్యవతి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఆయన వైఎస్సార్సీపీలో చేరిపోవడంతో టీడీపీకి దిక్కులేకుండా పోయింది. అప్పటినుంచి పార్లమెంట్ ఇంఛార్జి పదవి చేపట్టేందుకు తగిన నేత పార్టీలో లేకుండా పోయారు. దాంతో గత ఎన్నికల ముందు నుంచీ రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీమంత్రి కొణతాల రామకృష్ణను పార్టీలోకి ఆహ్వానించి పార్లమెంటు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించాలని ఒక దశలో పార్టీ అధినేత చంద్రబాబు భావించారని, ఆ మేరకు మంతనాలు జరిపించినట్లు కూడా కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. కానీ అవి ముందుకు సాగలేదు. ఈ తరుణంలో ఖాళీగా ఉన్న ఆ స్థానాన్ని భర్తీ చేస్తానంటూ అయ్యన్నపాత్రుడు అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారు. తన కుమారుడు విజయ్ ని ఎమ్మెల్యే చేయాలన్న లక్ష్యంతోనే ఆయన ఈ వ్యూహం పన్నినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాను ప్రాతినిథ్యం వహించిన నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాన్ని తనయుడికి అప్పగించి.. అనకాపల్లి ఎంపీగా తాను పోటీ చేయాలని భావిస్తున్నారు.

Also Read : లోకేష్ టీం మీద మహిళల ఆరోపణలు

వ్యూహం ఫలించేనా

వచ్చే ఎన్నికల్లో తనతోపాటు తన కుమారుడికి టికెట్ ఇప్పించుకునేందుకు అయ్యన్న వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అధిష్టానం దృష్టిలో పడి మార్కులు కొట్టేసేందుకే తరచూ ప్రెస్మీట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్సీపీలపై నోరుపారేసుకుంటున్నారు. జిల్లాలో తానొక్కడినే పార్టీ కోసం, అధినేత కోసం పోరాడుతున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. మరోవైపు నర్సీపట్నంలో పార్టీ కార్యక్రమాలను కుమారుడు విజయ్ ముందుండి చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇన్ని చేసినా తండ్రీకొడుకులు ఇద్దరికీ టికెట్లు ఇచ్చేందుకు అధినేత అంగీకరిస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి గత ఎన్నికల్లోనే తనకు బదులు కుమారుడు విజయ్ కి నర్సీపట్నం టికెట్ ఇవ్వాలని అయ్యన్న కోరారు. కానీ చంద్రబాబు అంగీకరించలేదు. దాంతో అయ్యన్నే పోటీ చేసి ఓడిపోయారు. అలాంటిది వచ్చే ఎన్నికల్లో ఇద్దరికీ అవకాశం ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ అవకాశం ఇచ్చినా గెలవడం కష్టమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. విజయ్ పై నియోజకవర్గంలో సదభిప్రాయం లేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తండ్రి మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని విజయ్ చెలరేగిపోయాడు.

లేటరైట్ పేరుతో అక్రమ మైనింగ్, కలప దందాలు సాగించాడు. సెటిల్మెంట్లు, వసూళ్లతో ప్రజలను ఇబ్బంది పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు రాజకీయంగా దశాబ్దాలుగా అండగా ఉన్న సోదరుడు సన్యాసిపాత్రుడి(జమీల్)ని కొడుకు కోసం అయ్యన్న దూరం పెట్టారన్న వాదన ఉంది. అందుకే సన్యాసిపాత్రుడు దంపతులు వైఎస్సార్సీపీ లో చేరిపోయారు. వీటన్నింటి వల్ల నర్సీపట్నంలో తండ్రీకొడుకులు ఇప్పటికీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ నెగ్గుకురావడం అంత ఈజీ కాదు. గత ఎన్నికల్లో అనకాపల్లి పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పటికీ ఆ నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన నాయకత్వం లేదు. ఈ పరిస్థితుల్లో అయ్యన్న పాచిక పారడం కష్టమేనంటున్నారు.

Also Read : ఉద్యోగులపై ప్రేమ ఒలకబోస్తున్న యనమల