iDreamPost
android-app
ios-app

కళా ఆధిపత్యానికి అచ్చెన్న ఎసరు పెడుతున్నారా..?

  • Published Apr 01, 2022 | 7:08 PM Updated Updated Apr 01, 2022 | 7:54 PM
కళా ఆధిపత్యానికి అచ్చెన్న ఎసరు పెడుతున్నారా..?

తెలుగుదేశం ఆవిర్భవించినప్పటి నుంచీ శ్రీకాకుళం జిల్లా ఆ పార్టీకి కంచుకోటగా ఉంది.కానీ గత ఎన్నికల్లో జగన్ వేవ్ ఆ పార్టీని తుడిచిపెట్టేసి.. కేవలం రెండు సీట్లకు పరిమితం చేసింది. ఈ పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాల్సిన నాయకులు ఆధిపత్యపోరుతో ఉన్న ఊపిరి కాస్త పోయేలా చేస్తున్నారు. దీనికి కారకులు కూడా చిన్నా చితకా నేతలు కాదు. ఒకరు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న అచ్చెన్నాయుడు కాగా మరొకరు ఆయనకు ముందు రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రస్తుతం పొలిట్బ్యూరో సభ్యుడిగా ఉన్న కిమిడి కళా వెంకటరావు. కళాతో మొదటి నుంచీ ఉన్న విభేదాల నేపథ్యంలో అచ్చెన్నాయుడు కళా వర్గాన్ని అణిచివేసేందుకు నిరంతరం పావులు కదుపుతున్నారు. ఆయనకు పట్టున్న ఎచ్చెర్ల, పాతపట్నం నియోజకవర్గాల్లో ఇప్పటికే వైరివర్గాన్ని ఎగదోస్తున్న అచ్చెన్నాయుడు.. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని పాలకొండ నియోజకవర్గంలోనూ మొదలుపెట్టారు. కళా వర్గానికి సమాంతరంగా అచ్చెన్న వర్గీయులు కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చే ఎన్నికల్లో తామే అభ్యర్థులమని ప్రచారం చేసుకుంటున్నారు.

ఎచ్చెర్లలో నేరుగా కళాకే సెగ

ఎచ్చెర్ల నియోజకవర్గానికి టీడీపీ ఇంఛార్జిగా స్వయంగా కళా వెంకటరావే వ్యవహరిస్తున్నారు. కానీ ఆయనకు వ్యతిరేకంగా తన వర్గానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడు, చౌదరి బాబ్జీలను అచ్చెన్న ఎగదోస్తున్నారు. బాబ్జీ అంత చురుగ్గా లేకపోయినా పొందూరు మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు కలిశెట్టి మాత్రం కళాతో ప్రమేయం లేకుండా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు కళా రెండుసార్లు ప్రకటించినా.. కలిశెట్టి మాత్రం టీడీపీ జెండా, కళా వ్యతిరేక అజెండాతో ముందుకు సాగుతున్నారు. తాజాగా రెండురోజుల క్రితం ‘మన ఎచ్చెర్ల-మన కలిశెట్టి’ పేరుతో ఇంటింటి ప్రచారం కూడా ప్రారంభించారు.

కళా వర్గానికి పట్టున్న మరో నియోజకవర్గం పాతపట్నంలో ఆయన వర్గానికి చెందిన నియోజకవర్గ ఇంఛార్జి కలమట వెంకటరమణ తో అచ్చెన్న ఆడుకుంటున్నారు. అచ్చెన్న మద్దతుతో పార్టీ జిల్లా నాయకుడు మామిడి గోవిందరావు పార్టీ జెండాతో సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైద్య సహాయం, ఇతరత్రా అవసరాలు ఉన్నవారికి, జాతరలు, ఇతర కార్యక్రమాలకు విరివిగా విరాళాలు ఇస్తూ 2024లో తానే అభ్యర్థినని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో బెంబేలెత్తిన కలమట నేరుగా అచ్చెన్న వద్దకే వెళ్లి ఇదేమిటని అడిగితే.. టికెట్ నీదే అని భరోసా ఇచ్చారు. కానీ గోవిందరావును కూడా మరోవైపు ప్రోత్సహిస్తున్నారు.

ఇప్పుడు పాలకొండలోనూ..

కళా వర్గాన్ని అణగదొక్కే కార్యక్రమాన్ని అచ్చెన్నాయుడు పాలకొండ నియోజకవర్గంలోనూ ప్రారంభించారు. గత రెండు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నిమ్మక జయకృష్ణ నియోజకవర్గ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. కళా కుటుంబానికి ఇక్కడ మంచి పట్టుంది. నిమ్మక కూడా కళా వెంకటరావు కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు పాలకొండలో జోక్యం చేసుకుని కళాకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా జయకృష్ణకు పోటీగా పడాల భూదేవిని తెరపైకి తెచ్చారు. సేంద్రీయ వ్యవసాయం, గిరిజన రైతులను ఏకం చేయడం ద్వారా ప్రసిద్ధురాలైన భూదేవి గత కొన్నాళ్లుగా అచ్చెన్నాయుడు ప్రోత్సాహంతో పాలకొండలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంఛార్జిగా ఉన్న నిమ్మక జయకృష్ణ ప్రమేయం లేకుండా, ఆయనకు పోటీగా పార్టీ కార్యక్రమాలు చేపడుతూ హడావుడి చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా సీతంపేట ఏజెన్సీలో ఐటీడీఏ సహాయంతో సమీకృత సేంద్రియ వ్యవసాయం, గ్రైన్ బ్యాంకుల ఏర్పాటు, సేంద్రియ ఉత్పత్తుల విక్రయశాలలు ఏర్పాటు చేసి 2020లో కేంద్రం నుంచి నారీ శక్తి అవార్డు పొందిన భూదేవి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అవ్వాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆమె ఆసక్తిని అచ్చెన్నాయుడు ఉపయోగించుకుని కళా వర్గాన్ని దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలతో టీడీపీ కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. కొందరు ఈ మూడు నియోజకవర్గాల పరిస్థితిని అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆయన దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు.