iDreamPost
iDreamPost
తన మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాలు తప్ప రాష్ట్ర వ్యవహారాలు పట్టించుకోకుండా రెండున్నరేళ్లుగా మౌనంగా ఉన్న విజయనగరం రాజావారు.. కేంద్ర మాజీమంత్రి పూసపాటి అశోక్ గజపతి ఎట్టకేలకు రాష్ట్ర రాజకీయాలపై స్పందించారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనను రాజఖడ్గంతో ఖండించారు. దాంతోపాటు ఆయన చేసిన మరికొన్ని వ్యాఖ్యలు ఆయన గౌరవాన్ని, స్థాయిని తగ్గించేలా ఉన్నాయి. అశోక్ నిర్మొహమాటంగా ఉంటారని, పార్టీలకు అతీతంగా ఆలోచిస్తారన్న భావన ఉంది. కానీ దానికి విరుద్ధంగా తాజా పరిణామాలపై వ్యాఖ్యలు చేశారు. బూతులు తిడితే ఎవరికైనా బీపీ వస్తుందని సీఎం జగన్ అన్న మాటలను పెట్టుకుని.. బీపీ వస్తే ఆస్పత్రికి వెళ్లాలిగానీ.. పార్టీల కార్యాలయాలపైకి కాదని అన్నారు. మంత్రులు వాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉందని కూడా వ్యాఖ్యానించారు. ఇన్ని మాటలు చెప్పిన ఆయన తమ పార్టీ వారి తీరును ఎందుకు ప్రస్తావించలేదు. మాన్సాస్ ట్రస్ట్ వివాదాల్లో ఆ సూత్రాలు ఎందుకు పాటించలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతరులకు ఒకలా.. తమవరకు వస్తే ఇంకోలా వ్యవహరించడమేనా మీ రాజనీతి అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
మీ బాధ అయితే ఒకటి.. ఇతరులదైతే ఇంకొకటా..
అనరాని మాటలు అంటుంటే.. మహిళలను ఉద్దేశించి కూడా బూతులు తిడుతుంటే ఎవరికైనా కోపం వస్తుందన్న అర్థం వచ్చేలా బీపీ పదాన్ని వాడిన సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ గా బీపీ వస్తే ఆస్పత్రి వెళ్లాలని మాజీమంత్రి అశోక్ సూచించారు. కానీ తన కుటుంబానికి చెందిన మాన్సాస్ వివాదంలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపణలు, విమర్శలు చేసినప్పుడు ఇదే అశోక గజపతిరాజు ఎలా స్పందించారో అందరికీ తెలిసిందే. విజయసాయి వ్యాఖ్యలతో తన మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటోందని వాపోయారు. కోర్టుల్లో కేసులు వేశారు. తీర్పు రాకముందే మాన్సాస్ కార్యాలయానికి, సింహాచలానికి వెళ్లి హాల్ చల్ చేశారు. విజయసాయి వ్యాఖ్యలు, ఇతర పరిణామాలు ఆరోగ్యంపై ప్రభావం చూపినప్పుడు ఆస్పత్రికి వెళ్లకుండా ఇంకేవేవి చేశారేందుకన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టీడీపీ కార్యాలయంపై దాడిని తప్పు పడుతున్న అశోక అంతకుముందే తమ పార్టీ నేత సీఎం తల్లినే దూషించిన విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు. మంత్రుల భాషను ఆక్షేపిస్తున్న అశోక్ టీడీపీ నేతల బూతు భాషను మాత్రం ఆస్వాదిస్తున్నట్లు ఉంది ఆయన మాటల తీరు.
సమన్యాయం వర్తించదా
రాజవంశానికి చెందిన అశోక్ గజపతిరాజుకు రాజనీతి, న్యాయ పరిపాలన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇరువైపులా వాదనలు విని, ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాత న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు మాట్లాడాలి. నాటి రాచరికంలో అయినా నేటి ప్రజాస్వామ్యంలో అయినా ఇదే సహజ న్యాయసూత్రం. రాజరికం నుంచి ప్రజాస్వామ్యంపై మక్కువతో రాజకీయ వ్యవస్థలోకి వచ్చిన అశోక్ ఈ సహజ న్యాయసూత్రాన్ని ఎందుకు పట్టించుకోవడంలేదో అర్థం కావడంలేదు. మంత్రుల భాషను ప్రశ్నిస్తున్న అశోక్ తమ పార్టీ నేతలు ఏకంగా బూతులే మాట్లాడినా ప్రశ్నించడం లేదు. అది తప్పు అని కనీసం చెప్పే చొరవ కూడా తీసుకోవడం లేదు. పార్టీ కార్యాలయంపై దాడులకు రావడం తప్పంటున్నవారు.. ఈ మధ్యే టీడీపీ నేత బుద్దా వెంకన్న బ్యాచ్ ఏకంగా సీఎం క్యాంప్ కార్యాలయంపైకే వెళ్లినప్పుడు ప్రశ్నించలేకపోవడం చూస్తే తాము చేస్తే ఒప్పు..ఇతరులు చేస్తే తప్పు అన్న అన్యాయ సూత్రం అమలు చేస్తున్నట్లుంది.
Also Read : BJP – JanaSena – దాడులు తప్పయితే.. దూషించిన వారు ఉన్నతులా?!