iDreamPost
android-app
ios-app

జగన్ అలా – జనం ఇలా.. మీకు కలవరమేలా బాబూ?

  • Published Oct 17, 2020 | 2:16 AM Updated Updated Oct 17, 2020 | 2:16 AM
జగన్ అలా – జనం ఇలా.. మీకు కలవరమేలా బాబూ?

ఏపీ రాజకీయాలు ఇప్పుడు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నాయి. ఈ విషయంలో సీఎం జగన్ వ్యూహాత్మకంగా సాగుతున్నారు. కేవలం పది రోజుల వ్యవధిలో ఆయన రెండు సార్లు హస్తిన వెళుతున్న సమయంలో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేగింది. అయినప్పటికీ దానిని ఎన్డీయేలో చేరిక కోసం చేస్తున్న ప్రయత్నాలుగా చెప్పుకుని సంతృప్తి పడ్డారు. చివరకు జగన్ అంటే గిట్టని నేతల తీరు చూస్తుంటే వారే ఏదో ఊహించుకుంటారు. దానిని తమ పత్రికల్లో రాసుకుంటారు. ఆ తర్వాత హమ్మయ్య ఏదీ జరగలేదనుకుంటారు. మళ్లీ అసలు విషయం వెలుగులోకి రాగానే గగ్గోలు పెడుతుంటారు. ఇదంతా జగన్ విషయంలో చాలాకాలంగా సాగుతున్నదే అయినప్పటికీ ఆయన అధికారం స్వీకరించిన తర్వాత హద్దులు మీరుతున్నదనే చెప్పవచ్చు.

సుప్రీంకోర్ట్ జస్టిస్ ఎన్వీ రమణ, కొందరు న్యాయమూర్తుల వైఖరిని జగన్ చట్టబద్ధంగానే తప్పుబట్టారు. దానికి ఉన్న మార్గాలకు అనుగుణంగా సుప్రీంకోర్ట్ చీఫ్‌ జస్టిస్ ని ఆశ్రయించారు. ఇక ఈ విషయంపై మీడియాలో సాగుతున్న రాద్ధాంతాన్ని నిలువరించడం కోసమేనంటూ ఏపీ ప్రజల తరుపున తాను చేస్తున్న ప్రయత్నాలను వెల్లడించారు. దానికోసం అజయ్ కల్లం నిర్వహించిన మీడియా సమావేశం చివరకు హైకోర్ట్ గాగ్ ఆర్డర్లను ఉపేక్షించినట్టుగా ఏపీ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించే వరకూ వచ్చింది. ప్రభుత్వ న్యాయవాదులు సంబంధం లేదని చెప్పినా ఆయన అంగీకరించలేదని కోర్టులో జరిగిన వాదనల సారాంశం.

వాస్తవానికి కేవలం ప్రభుత్వం తరుపున మీడియా సమావేశం తప్ప ఇప్పటి వరకూ పాలకపక్షం సంయమనం పాటిస్తోంది. న్యాయస్థానాల వ్యవహారంలో నిబంధనలు పాటిస్తోంది. ఎటువంటి విమర్శలు, వ్యాఖ్యానాలు చేయకుండా విషయం సుప్రీంకోర్ట్ సీజే పరిధిలో ఉంది కాబట్టి వేచి చూస్తోంది. కానీ ప్రతిపక్షం, ప్రధానంగా టీడీపీ నేతలు చిందులు వేస్తున్నారనే చెప్పవచ్చు. మొదటి రెండు రోజుల పాటు ఏం జరుగుతుందో అంతుబట్టని చంద్రబాబు మల్లగుల్లాలు పడ్డారు. ఇక ఇప్పుడు కూడా ఎటు మళ్లుతుందో తెలియని పరిస్థితులో ఉన్న బాబు బ్యాచ్ ఎదురుదాడి యత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రతీ రోజూ టీడీపీ నేతలు పేపర్ ప్రకటనలు, ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారు. జగన్ లేఖ మీద నానా రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. సుప్రీంకోర్ట్ సేజీ పరిధిలో ఉన్న విషయంలో వేచి చూడాలనే ఆలోచన కూడా లేకుండా, జగన్ గీత దాటేశారంటూ రోజుకో బార్ అసోసియేషన్ తో ప్రకటనలు, ప్రత్యేక ఇంటర్వ్యూలంటూ ప్రచారాలు చేస్తున్నారు. అన్నీ చేసి విచారణ చేయాలనే మాట మాత్రం రావడం లేదు. ఆరోపణల నిగ్గు తేల్చాలని మాత్రం అడగలేకపోతున్నారు.

అధికారపార్టీ ఆలోచనతో ఆచరణాత్మకంగా సాగుతుండగా ప్రతిపక్ష నేతలు మాత్రం పూటకో చోట నుంచి ఖండనలు, చివరకు జగన్ ని సీఎం పదవి నుంచి తొలగించాలనే పిటీషన్ల వరకూ వెళ్లిన తీరుని ప్రజలంతా గ్రహిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో పలువురు స్పందించారు. తమ అభిప్రాయాలు వెల్లడించారు. కోర్టులనయినప్పటికీ నిబంధనలకు అనుగుణంగా విచారణ చేస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుందని ఆశిస్తున్నారు. సుప్రీంకోర్ట్ రిటైర్డ్ జడ్జిలతో దర్యాప్తు అవసరమంటూ ప్రశాంత్ భూషణ్ వంటి వారు చేసిన సూచనలు హర్షిస్తున్నారు. దానికి అనుగుణంగా చర్యలుండాలని కోరుతున్నారు.

జగన్, జనం కూడా అత్యున్నత న్యాయస్థానం స్పందన కోసం ఎదురుచూస్తుండగా టీడీపీ మాత్రం ఈ పరిస్థితిని తట్టుకోలేకపోతున్నట్టు కనిపిస్తోంది. జగన్ మీద ఆరోపణలున్నాయి కాబట్టి ఆయన ఫిర్యాదు వెనుక ఉద్దేశాలు ఆపాదిస్తున్న టీడీపీ తాను మాత్రం శుద్ధపూసనని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. జగన్ కన్నా ముందు నుంచే చంద్రబాబు అవినీతిపై కోర్టుల్లో కేసులు నానుతున్న విషయాన్ని దాచిపెట్టే యత్నం చేస్తోంది. మొన్నటి వారం కూడా సీబీఐ కేసుల్లో ఇరుక్కున్న రఘురామరాజుతో విమర్శలు చేస్తోంది. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన కబ్జారాయుడిగా పేరొందిన సబ్బం హరికి దిగ్గజ విశ్లేషకుడిని ముసుగు వేసి ముందుకు తెస్తోంది. ఇలా గురివిందలను తలపించే రీతిలో జగన్ మీద వ్యతిరేకతను వ్యవస్థలను మరింత దిగజార్చే యత్నంలో టీడీపీ ఉందన్నది చాటుతోంది. ఇన్నాళ్లుగా తమ ప్రయోజనాలకు అనుగుణంగా సాగిన వ్యవస్థలో పరిణామాలను మింగుడుపడని నేతల తీరు ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నది వారికి అంతుబట్టినట్టుగా లేదు. ఇలాంటి వ్యవహారాల్లో వీలయినంత వేగంగా సుప్రీంకోర్ట్ స్పందిస్తే రాజకీయ దుమారం కూడా చల్లారుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.