iDreamPost
android-app
ios-app

సీఎం జగన్‌ కొత్త పథకం ప్రారంభించినప్పుడు వారి తీరు అంతే..!

సీఎం జగన్‌ కొత్త పథకం ప్రారంభించినప్పుడు వారి తీరు అంతే..!

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సరికొత్త పోకడ మొదలైంది. ఓ క్రమ పద్ధతిలో, ముందస్తుగా సిద్ధం చేసిన వ్యూహంతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా బురద జల్లుతోంది. గడిచిన ఆరు నెలలుగా తెలుగుదేశం పార్టీ, ఓ వర్గం మీడియా వ్యవహరిస్తున్న తీరు గమనిస్తే వారి లక్ష్యం ఏమిటో అర్థం అవుతోంది. వైసీపీ ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెట్టిన రోజు, ఆ తర్వాత రోజున తెలుగుదేశం అనుకూల మీడియా ఆ పథకం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కథనాలు ప్రచురిస్తోంది, ప్రచారం చేస్తోంది. ఆ కథనాలను పట్టుకుని టీడీపీ నేతలు మళ్లీ మీడియా సమావేశాలు, ట్విట్టర్‌లలో పోస్టులు చేస్తూ ముందుగా అనుకున్న వ్యూహాన్ని పక్కగా అమలు చేస్తున్నారు.

విశ్వసనీయతే పునాదిగా చేసుకుని పాలన సాగిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. చేయగలిగిన హామీలనే ఇచ్చిన సీఎం జగన్‌.. కేవలం రెండు పేజీలతో తన పార్టీ మేనిఫెస్టోను ప్రజల ముందు ఉంచారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలోనే అందులోని దాదాపు 90 శాతం హామీలను అమలు చేశారు. తాజాగా శుక్రవారం జగన్‌ ఇచ్చిన హామీల్లో అత్యంత ముఖ్యమైన, భారీ హామీని అమలు చేశారు. వైఎస్సార్‌ ఆసరా పేరుతో 2019 ఏప్రిల్‌ 11 నాటికి ఉన్న డ్వాక్రా సంఘాల రుణాల మొత్తాన్ని తిరిగి వారికే నాలుగు వాయిదాల్లో ఇచ్చే పథకాన్ని ప్రారంభించారు. మొదటి విడతగా దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాల ఖాతాల్లో జమ చేశారు. ఆ మొత్తం వారు నచ్చిన విధంగా ఖర్చు పెట్టుకోవచ్చు. ఇలా నాలుగు దఫాలుగా 27 వేల కోట్ల రూపాయలు ఇవ్వనున్నారు.

జగన్‌ ఇలా.. ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ వస్తుండడంతో టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియాలో కలవరం మొదలైంది. ఇచ్చిన హామీలన్నింటినీ వంద శాతం సంతృప్త స్థాయిలో సీఎం జగన్‌ అమలు చేస్తున్నారు. ఏదైనా పథకం అమలు చేసిన తర్వాత కూడా అర్హులు ఉంటే.. మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు నెల రోజుల సమయం ఇస్తూ చిట్టచివరి అర్హుడుకు కూడా పథకాలు పార్టీలకు అతీతంగా, స్థానిక నాయకుల దయాదాక్షిణ్యాలు అవసరం లేకుండా వాలంటీర్ల ద్వారా అందిస్తున్నారు.

2014లో ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ఏ హామీని కూడా అమలు చేయలేకపోయారు. కానీ సీఎం జగన్‌ తన పార్టీ మేనిఫెస్టోను బైబిల్, భగవద్గీత, ఖురాన్‌లతో పోలుస్తూ.. ప్రతి హమీని అమలు చేస్తున్నారు. దీన్ని ఆపడం టీడీపీ, దాని అనుకూల మీడియా వల్ల కాదు. అందుకే జగన్‌ చేస్తున్న పనులు, అమలు చేస్తున్న హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు పనిగట్టుకుని కథనాలు వండివారుస్తోంది. వాటిని పట్టుకుని టీడీపీ నాయకులు నానా యాగీ చేస్తున్నారు.

వైఎస్సార్‌ ఆసరా ప్రారంభమైన శుక్రవారం నాడు ఆంధ్రజ్యోతి పత్రిక.. ఆ పథకంపై విషం కక్కింది. పసుపు కుంకుమ.. వైఎస్సార్‌ ఆసరా రెండూ ఒకటేనంటూ రాసుకొచ్చింది. పైగా దీని వల్ల డ్వాక్రా సంఘాలకు నష్టమంటూ చెప్పుకొచ్చింది. దాన్ని పట్టుకుని టీడీపీ మహిళా నేతలు అనిత, పీతల సుజాతలు ఆరు లక్షల మంది డ్వాక్రా మహిళలలు నష్టపోయారంటూ ప్రకటనలు విడుదల చేశారు.

పథకం అమలైన మరుసటి రోజు.. అంటే ఈ రోజు శనివారం.. ఆంధ్రజ్యోతి పత్రిక ‘‘అరాచకానికి అడుగు దూరం’’ అంటూ బ్యానర్‌ కథనం ప్రచురించింది. ఏపీ ఒకప్పటి యూపీ, బిహార్‌ మాదిరిగా మారిందంటూ రాసుకొచ్చింది. ఈ కథనంలోని మాటలను పట్టుకుని టీడీపీ నేతలు ప్రకటనలు చేయడం ప్రారంభించారు. మాజీ మంత్రి దేవినేని ఉమా.. అరాచకానికి అడుగు దూరం అంటూ ట్విట్టర్‌లో పోస్టు పెట్టడం జగన్‌ సర్కార్‌పై టీడీపీ, దాని అనుకూల మీడియా చేస్తున్న కుట్రలకు తార్కాణంగా నిలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ కుట్రలు పతాకస్థాయికి చేరినా ఆశ్చర్యం లేదు.