iDreamPost
android-app
ios-app

YSR Vahana Mitra – పన్నుల భారం తీరింది.. బతుకు బండికి భరోసా దొరికింది..

  • Published Oct 15, 2021 | 5:19 AM Updated Updated Oct 15, 2021 | 5:19 AM
YSR Vahana Mitra – పన్నుల భారం తీరింది.. బతుకు బండికి భరోసా దొరికింది..

బతుకు బండి లాగడానికి ఇబ్బంది పడుతున్న డ్రైవరులకు భరోసా ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ వాహన మిత్ర అనే పథకాన్ని అమలు చేస్తోంది. సొంత వాహనం కలిగిన ఆటో, టాక్షీ, మ్యాక్షీ, క్యాబ్ డ్రైవర్లకు ఇన్సూరెన్స్, ఫిట్ నెస్ సర్టిఫికెట్, మరమ్మతులు, ఇతర అవసరాల నిమిత్తం ఏటా రూ.పది వేల ఆర్థిక సాయం అందజేస్తోంది. ఇటీవలే మూడో ఏడాది సహాయాన్ని డ్రైవర్లకు అందజేసింది.

ఇచ్చిన మాటకు కట్టుబడి..

వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్రలో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను గమనించి వారికి ఏటా రూ. పదివేలు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి రాష్ట్రంలోని డ్రైవర్లు అందరికీ సాయం అందజేస్తున్నారు.

లభ్దిదారుల ఎంపిక ఇలా..

గ్రామ, వార్డు సచివాలయాల్లో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి అయ్యే వరకు వలంటీర్లు సహకరిస్తారు. అత్యంత పారదర్శకంగా దరఖాస్తులను వార్డు వలంటీర్ల ద్వారా పరిశీలన చేయించి అర్హులను ఎంపిక చేస్తారు. అర్హుల జాబితాను గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. అర్హతలు ఉండి కూడా జాబితాలో పేరు లేనివారు తగిన అధారాలతో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే సత్వరం పరిశీలించి పరిష్కరిస్తున్నారు. లబ్ధిదారులకు ఏమైనా సందేహాలు ఉంటే 9154294326 నంబరుకు కాల్ చేస్తే సంయుక్త రవాణా కమిషనర్ ఆధ్వర్యంలోని టాస్క్ ఫోర్స్ అధికారులు సమస్య పరిష్కరిస్తారు. ఈ పథకానికి సంబంధించి సలహాలు, సూచనలు ఉంటే టోల్ ఫ్రీ నంబరు 1902కు తెలియజేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.

Also Read : తరతరాల సమస్య.. శాశ్వత పరిష్కారం.. జగన్‌ చారిత్రాత్మక అడుగు

ఇప్పటి వరకు రూ.759 కోట్ల సాయం..

ఈ పథకం కింద రాష్ట్రంలోని 2,48,468 మంది డ్రైవర్లకు రూ. 759 కోట్ల సాయం ప్రభుత్వం అందజేసింది. ఏటా కొత్తగా వాహనాలు కొనేవారు, యాజమాన్య హక్కులు బదలాయింపు పొందినవారు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో లబ్ధిదారుల జాబితా పెరుగుతోంది.

బడుగు,బలహీనవర్గాలకు మేలు..

ఈ పథకం కింద లబ్ది పొందినవారు ఎక్కువగా బడుగు, బలహీన వర్గాలకు చెందినవారే కావడం గమనార్హం. కేటగిరి వారీగా 59,692 మంది ఎస్.సి.లు, 9,910 మంది ఎస్.టి.లు, 1,39,484 మంది బి.సి.లు, మైనార్టీలు లబ్ధి పొందారు. 39,382మంది ఈబీసీలకు కూడా లబ్ధి చేకూరింది. మొత్తం లబ్ధిదారుల్లో 84 శాతం మంది ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనార్టీలే కావడం గమనార్హం.

డ్రైవర్ల కృతజ్ఞతలు..

దేశంలో ఎక్కడాలేని విధంగా సొంత వాహనం కలిగిన డ్రైవర్లకు ప్రభుత్వం ఏటా రూ. పదివేలు సాయం చేయడంపై ఆ వర్గాల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ సొమ్ము తమకు ఎంతో ఉపయోగ పడిందని, ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఆదుకుందని డ్రైవర్లు అంటున్నారు. ఇచ్చిన మాట ప్రకారం తమకు సాయం అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నారు.

Also Read : YSR Bima Scheme – జగన్ ముందు చూపునకు నిదర్శనం ఈ నిర్ణయం