సాధారణంగా ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటు పరం అవుతుంది అంటే విమర్శించే వాళ్ళు సైతం ఎయిర్ ఇండియా తిరిగి టాటా సంస్థల చేతుల్లోకి వెళుతోంది అంటే మాత్రం పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతున్నారు. దానికి కారణం టాటా క్రెడిబులిటి ఒకటి కాగా ఎయిర్ ఇండియా వారి సంస్థనే కావడం మరో కారణం. 60 వేల కోట్ల రూపాయలు అప్పుల్లో మునిగి పోయి కొట్టుమిట్టాడుతున్న ఎయిరిండియా సంస్థకు ఇప్పుడు టాటా కొత్త బాస్ అన్న మాట. 1932లో జె.ఆర్.డి.టాటా స్వయంగా ఈ సంస్థను ఏర్పాటు చేశారు. దేశంలో మొట్టమొదటి సివిల్ ఏవియేషన్ సంస్థగా ప్రారంభమైన ఈ సంస్థ తరఫున మొట్టమొదటి విమానాన్ని కూడా స్వయంగా కరాచీ నుంచి బొంబాయికి నడిపారు.
అప్పటికే ఆయన లైసెన్స్డ్ పైలెట్ కాగా ముందు సంస్థకు టాటా ఎయిర్ సర్వీస్ అనే పేరు పెట్టారు. తదనంతరం కాలక్రమేణా టాటా ఎయిర్ లైన్స్ గా దానికి పేరు స్థిర పడింది. అయితే ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన కొన్ని పరిణామాల కారణంగా ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారడం, ఆ తర్వాత ఎయిర్ ఇండియాగా మారి పోవడం జరిగింది. ప్రభుత్వానికి ఒక ఏవియేషన్ సంస్థ ఉండాలి అనే ఉద్దేశంతో 1948లో ఈ సంస్థలో 49 శాతం వాటాను అప్పటి భారత ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇక ఆ తర్వాత వద్దు మొర్రో అని కోరినా సరే వినకుండా అప్పటి ప్రధాని నెహ్రూ దీనిని జాతీయీకరణ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే 1977 వరకు జేఆర్‌డీ టాటానే ఛైర్మన్‌గా కొనసాగారు.
అలాగే ఎయిరిండియా పేరుతోనే నడుస్తూ వచ్చింది. తరువాత ఇండియన్ ఎయిర్ లైన్స్ అని మరో సంస్థను ఏర్పాటు చేయగా రెండిట్లోనూ భారీ నష్టాలు చవిచూడాల్సి రావడంతో రెండిటిని కలిపేశారు. ఇక అలా ప్రస్తుతం ఎయిరిండియా కొన్ని దశాబ్దాలుగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. 60 వేల కోట్ల రూపాయలు అప్పు తో ఉన్న ఈ సంస్థను ప్రైవేటుపరం చేయడానికి కేంద్రం సిద్ధమైంది. దీనికి సంబంధించి బిడ్డింగ్ నిర్వహించగా టాటా సంస్థ విజయవంతంగా బిడ్డింగ్లో తిరిగి తమ సంస్థను దక్కించుకుంది. ఈ సందర్భంగా టాటా ఎయిర్ ఇండియాకు తిరిగి స్వాగతం అంటూ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే జె.ఆర్.డి.టాటా విమానం నుంచి కిందకి దిగి తన ఫోటోను సైతం ఆయన షేర్ చేశారు.
Also Read : ఎయిర్ ఇండియా – ఎక్కడ మొదలైందో అక్కడకే చేరింది