Idream media
Idream media
మూడోసారి కుర్చీ ఎక్కి హ్యాట్రిక్ సాధించాలనేది గులాబీ బాస్ కేసీఆర్ లక్ష్యం. రెండు సార్లు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై వచ్చే వ్యతిరేకతను తమవైపు తిప్పుకుని అధికారంలోకి రావడం కాషాయ పార్టీ బీజేపీ లక్ష్యం. టీఆర్‌ఎస్, బీజేపీ దొందూ దొందేనని ప్రచారం చేస్తూ, రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ రాజ్యం తేవాలనేది కాంగ్రెస్ లక్ష్యం. కొత్తగా పురుడుపోసుకున్న వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ కూడా రాజన్న రాజ్యం తేవడమే తమ లక్ష్యం అంటోంది.
మొత్తంమ్మీద అన్ని పార్టీల లక్ష్యం ఒక్కటే. అసెంబ్లీలో పాగా వేయడమే. అందుకోసం ఇప్పటి నుంచే కాలుదువ్వుకుంటున్నాయి.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి సుమారు రెండున్నర ఏళ్ల సమయం ఉంది. ఒకవేళ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటే కాస్త ముందుగా జరగొచ్చు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పార్టీలన్నీ వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఒక్కో పార్టీ, ఒక్కో పంథాను అనుసరిస్తూ రాష్ట్రంలో రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. అనుసరిస్తున్నప్పటికీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికలే అందరి లక్ష్యంగా కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే ఇప్పటి నుంచే పార్టీల కార్యక్రమాలు ఊపందుకోవటం, నాయకుల ప్రకటనల్లో వాడి పెరగడం ఆసక్తిగా మారింది.
రెండు సార్లు అధికారంలో ఉండడంతో సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుందనే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందే గుర్తించినట్లు ఉన్నారు. దీంతో విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ఇప్పటి నుంచే రంగంలోకి దిగారు. తనదైన శైలిలో రాజకీయాలు ప్రారంభించారు. అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా కృష్ణా నదీ జలాలను పక్క ప్రభుత్వం దోచుకెళ్తూ, అన్యాయం చేస్తోందంటూ తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలిస్తున్నారు. ఇది వరకటి స్థాయిలో చలోక్తులతో ప్రసంగాలు చేస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టి పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పథకాలు ఓవైపు.. గ్రామ సభలు, సహపంక్తి భోజనాలు మరోవైపు.. ఇలా భిన్న మార్గాలలో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తాజాగా తెలంగాణ దళిత బంధు పేరుతో కొత్త పథకం ప్రకటించి ఎస్సీ, ఎస్టీలను ఆకర్షిస్తున్నారు.
వరుస ఓటములతో కునారిల్లుతున్న కాంగ్రెస్‌లో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంతో కాస్త ఊపు కనిపిస్తోంది. రేవంత్‌రెడ్డి చీఫ్ కావటం ఆ పార్టీకి టానిక్‌గా పని చేస్తుందనే చర్చ జరుగుతోంది. మాట, చేతల్లో దూకుడు ప్రదర్శించే ఆయన, కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన నేతలను రాళ్లతో కొట్టి చంపండి అని ఇప్పటికే పిలుపునిచ్చారు. పార్టీలోని అసంతృప్తులను వ్యూహాత్మకంగా చల్లార్చటానికి, అందరివాడిగా గుర్తింపు పొందటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురి పాత కాపులను మళ్లీ రప్పించుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులు టీఆర్‌ఎస్, బీజేపీ విషయంలో దుందుడుకుగా ఉంటున్నారు. పెట్రో, డీజిల్ ధరల పెంపు, కోకాపేట భూముల విక్రయాలు.. ఇలా పలు అంశాలను ఎంచుకుని ఆందోళనలకు పిలుపునిస్తూ కాంగ్రెస్‌ను ఉరకలెతిస్తున్నారు.
ఇక బీజేపీ విషయానికి వస్తే.. దుబ్బాక లో రఘునందన్‌రావు గెలుపుతో ఆ పార్టీకి మంచి ఊపొచ్చింది. ఆ ఊపు కొనసాగిస్తూ గ్రేటర్ ఎన్నికలకు అతిరథ మహారథులను రప్పించి హోరెత్తించింది. సీట్లను కూడా బాగానే పెంచుకుంది. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల విజయాలతో అందివచ్చిన ఊపును పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో నిలబెట్టుకోలేకపోయిన బీజేపీ, హుజూరాబాద్ ఉప ఎన్నిక నాటికి పుంజుకోవటానికి ప్రయత్నిస్తోంది. దీనికి తోడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగస్టు 9 నుంచి పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్ర ముగింపు హుజూరాబాద్‌లో ఉండనుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పర్యటిస్తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి గట్టి పోటీ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.
తెలంగాణలో కొత్తగా పుట్టిన వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ కూడా సత్తా చాటేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేయడం లేదని ప్రకటించిన వైఎస్‌ఆర్‌టీపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో రంగంలోకి దిగేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల వివిధ జిల్లాల్లో పర్యటించి ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు. రాష్ట్ర నలుమూలలకు వెళ్లటానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఆమె కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇలా రాష్ట్రంలోని అన్ని పార్టీలూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అంతిమ లక్ష్యంగా తమ ప్రతి కదలికను ప్లాన్ చేసుకుంటున్నాయి.