iDreamPost
iDreamPost
టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు రంగం సిద్ధమవుతోంది. నవంబర్ నుంచి పక్కా ప్లానింగ్ తో షెడ్యూల్స్ ఫిక్స్ చేశారట. ఇందులోనే అలియా భట్ తో పాటు ఒలీవియా మోరిస్ కూడా పాల్గొనబోతున్నట్టు తెలిసింది. అయితే ఎక్కడ చేస్తారనే సమాచారం ప్రస్తుతానికి లేదు. ఇప్పట్లో రాష్ట్రం దాటి బయటికి వెళ్ళడానికి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. అందుకే హైదరాబాద్ తో పాటు ఇక్కడి లొకేషన్లలో తీసేందుకు సాధ్యమైనవన్నీ పూర్తి చేసి అవసరాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేస్తారు. ఒక్కసారి మొదలుపెట్టాక నాన్ స్టాప్ గా కొనసాగించేలా అన్ని సమకూర్చుకున్నట్టుగా టాక్.
రాజమౌళి ప్రస్తుతం కుటుంబంతో కలిసి కర్ణాటక టూర్ లో ఉన్నారు. అది అయ్యాక పనులను వేగవంతం చేయబోతున్నారు. 2021 సంక్రాంతికి వచ్చే అవకాశం లేదని తేలిపోయింది కాబట్టి కనీసం వేసవికైనా రావాలని అభిమానులు కోరుతున్నారు. కానీ ప్రాక్టికల్ గా అది ఎంత మేరకు సాధ్యమవుతుందన్నది అనుమానమే. కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోయి వ్యాక్సిన్ అందరికి అందుబాటులోకి వచ్చి థియేటర్లు ఫుల్ కెపాసిటీతో నడుస్తున్నప్పుడే ఆర్ఆర్ఆర్ లాంటివి కమర్షియల్ సేఫ్ అవుతాయి. అందుకే వచ్చే సంవత్సరం దసరా లేదా దీపావళి లేదూ ఈ గొడవంతా ఎందుకు అనుకుంటే ఏకంగా 2022 సంక్రాంతికి వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఎలాగూ ఓవర్సీస్ లోనూ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. బయ్యర్లు ఇంతకు ముందులా పెట్టుబడులు పెట్టేందుకు భయపడుతున్నారు.
టెనెట్ లాంటి హై ఎక్స్ పెక్టెడ్ మూవీనే అమెరికాలో ముక్కుతూ మూలుగుతూ కలెక్టన్లు తెచ్చుకుంటోంది. వార్నర్ బ్రదర్స్ ఎప్పుడో పూర్తయిన సినిమాలను సైతం మళ్ళీ మళ్ళీ రీ షెడ్యూల్ చేస్తున్నారు. ఇలాంటప్పుడు మన సినిమాలను అంత ఈజీగా మునుపటి లాగా మార్కెటింగ్ చేసుకోలేం. అందుకే ఆర్ఆర్ఆర్ విడుదల విషయంలో ఇకపై ఎలాంటి రిలీజ్ ప్రకటనలు ఉండకపోవచ్చు. ఎలాగూ విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ టైం అవసరం పడుతోంది కాబట్టి జక్కన్న స్లో అండ్ స్టడీ సూత్రాన్ని పాటించబోతున్నాడు. కాకపోతే రామ్ చరణ్,. జూనియర్ ఎన్టీఆర్ లను ఏప్రిల్ కంతా విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తారక్ వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో జాయిన్ అవుతాడు. ఆచార్య క్యామియో కాకుండా చరణ్ ఒప్పుకున్న కొత్త ప్రాజెక్ట్ ఏదీ లేదు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఆర్ఆర్ఆర్ కు సాయి మాధవ్ బుర్రా సంభాషణలు సమకూరుస్తున్నారు