iDreamPost
iDreamPost
రాజకీయంగా చైతన్యవంతమైన శ్రీకాకుళం జిల్లా శాసన వ్యవస్థను నడిపించే ఇద్దరు సభాపతులను రాష్ట్రానికి అందించిన ఘనతను సొంతం చేసుకుంది. జిల్లాకు ఇంతటి అరుదైన అవకాశం కాంగ్రెసేతర ప్రభుత్వాల ద్వారానే రావడం విశేషం. జిల్లా నుంచి తొలిసారి స్పీకర్ అయిన ఘనత తంగి సత్యనారాయణది కాగా.. ఆ పదవి చేపట్టిన రెండో నేత ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం. పక్క పక్క నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించిన వీరిద్దరూ రాజ్యాంగ పదవిలో భిన్న వైఖరులతో తమదైన ముద్ర వేశారు.
రాజకీయ సంక్షోభంలో పాత్రధారి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల దశ, దిశను మార్చిన ఎన్టీఆర్ పార్టీ తెలుగుదేశం నుంచి 1983లో శ్రీకాకుళం ఎమ్మెల్యేగా ఎన్నికైన తంగి సత్యనారాయణను అసెంబ్లీ స్పీకర్ పదవికి ఎంపిక చేయడం ద్వారా ఎన్టీఆర్ ఆయనకు, శ్రీకాకుళం జిల్లాకు ఎనలేని గౌరవం కల్పించారు.
శ్రీకాకుళం రూరల్ మండలం కిల్లిపాలెం గ్రామానికి చెందిన తంగి “గార” సమితి మొదటి అధ్యక్షుడిగా 1959లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1967లో శ్రీకాకుళం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందిన ఆయన 1972లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయారు.
గౌతు లచ్చన్న, ఎన్ జీ రంగాల సహచరుడిగా ఉన్న ఆయన 1983లో స్పీకర్ పదవి చేపట్టి ఒక్కసారిగా ఉన్నత స్థానానికి ఎదిగారు. అయితే 1984లో కాంగ్రెస్ తో కలిసి నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్ ను దించేసిన ఘటనలో తంగి సత్యనారాయణ నాదెండ్ల పక్షం వహించడం.. ఆయన పేరుప్రతిష్టలను మంటగలిపింది. నాదెండ్ల మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా చేరినా అది నెలరోజుల ముచ్చటగా ముగిసిపోయింది. ఆనాటి నుంచి ఆయన రాజకీయ ప్రభ మసకబారింది. 1986లో తిరిగి టీడీపీలోకి.. 2008లో కాంగ్రెస్లోకి వెళ్లినా మళ్లీ పుంజుకోలేకపోయారు.
సమర్థతకు ప్రతిరూపం సీతారాం
జిల్లా నుంచి స్పీకర్ అయిన రెండో నేతగా గుర్తింపు పొందిన తమ్మినేని సీతారాం అపార అనుభవశాలి. ఆమదాలవలస మండలం తొగరాం గ్రామానికి చెందిన ఆయన 1983 నుంచి ఐదుసార్లు ఆమదాలవలస ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత టీడీపీ ప్రభుత్వాల్లో తొమ్మిదేళ్లు మంత్రిగా పని చేసి సుమారు 18 శాఖలు నిర్వహించి సమర్ధుడైన నేతగా పేరొందారు. ఐదేళ్లు ప్రభుత్వ విప్ గా వ్యవహరించి శాసనసభా వ్యవహారాలపై మంచి పట్టు సాధించారు. ఆ అనుభవంతోనే ఇప్పుడు స్పీకర్ గా రాణించగలుగుతున్నారు.
చంద్రబాబు మంత్రి వర్గంలో మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్న సీతారాం నాడు నక్సల్స్ తో చర్చలకు ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో కీలక పాత్ర పోషించారు.చంద్రబాబు అన్ని జిల్లాలలో వర్గాలను ప్రోత్సహించినట్లే శ్రీకాకుళంలో ఎర్రం నాయుడు వర్గానికి మద్దతు ఇచ్చి టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తమ్మినేని సీతారాం ను ఇబ్బంది పెట్టాడు. 2008 ప్రజారాజ్యం ఆవిర్భావంతో జిలా అధ్యక్షుడిగా ఉండి ఎన్నికల్లో ఎర్రం నాయుడికి వ్యతిరేకంగా పనిచేయలేను,అలా అని మనసు చంపుకొని ఎర్రం నాయుడి గెలుపు కోసం పనిచేయలేను అని ప్రకటించి టీడీపీని వీడి ప్రజారాజ్యంలో చేరారు.
2008లో ప్రజారాజ్యంలో చేరిన ఆయన 2009 ఎన్నికల్లో ఓటమి,ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అవటానికి మొగ్గుచూపటంతో టీడీపీలోకి తిరిగివచ్చారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇవ్వడాన్ని వ్యతిరేకించి 2013లో టీడీపీ నుంచి బయటకొచ్చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా దీక్ష చేసిన జగన్ కు సంఘీభావం తెలపడంతోపాటు వైఎస్సార్సీపీలో చేరారు.
2019 ఎన్నికల్లో గెలిచి మళ్లీ అసెంబ్లీలోకి అడుగుపెట్టడమే కాకుండా.. ఆయన అనుభవాన్ని గుర్తించి జగన్ ఇచ్చిన అవకాశంతో సభాపతి పీఠాన్ని అలంకరించారు. అప్పటి నుంచి సభను బాగా నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. మంచి వాగ్ధాటి కలిగిన ఆయన.. తన అనుభవం, మాటల చతురతతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన పలు సందర్భాల్లో సభ అడుపుతప్పకుండా కంట్రోల్ చేయగలుగుతున్నారు. రెండేళ్లుగా ఎటువంటి మచ్చ లేకుండా సభా నిర్వహణతో పాటు.. తన నియోజకవర్గ వ్యవహారాలను చక్కబెడుతూ చురుకైన నేతగా తనకున్న పేరును సార్థకం చేసుకుంటున్నారు.