Idream media
Idream media
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తాన్‌కులానికి చెందిన తండ్రీ కొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31) పోలీసు కస్టడీలో ఒకరి తరువాత ఒకరు మరణించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సెల్‌ఫోన్ షాపు నిర్వహిస్తున్న వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్న కారణాలు, రిమాండ్‌కు తరలించే క్రమంలో వ్యవహరించిన విధానంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దాష్టీకానికి అమాయకులు బలయ్యారంటూ అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అంతకుమందు జయరాజ్, బెనిక్స్‌లను కోవిల్ పట్టి సబ్ జైలులో పరీక్షించిన వైద్యులు ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు ఆగ్రహ జ్వాలలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో.. అనుమతించిన సమయానికి మించి మొబైల్ షాపు తెరిచే ఉంచారన్న కారణంతో జయరాజ్, బెనిక్స్‌ను గత శుక్రవారం (జూన్ 19) పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం వారిని కోవిల్ పట్టి మెజిస్ట్రేట్ ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.
ఈ క్రమంలో జూన్ 22 (సోమవారం) ఉదయం సబ్ జైలు వద్ద తండ్రీ కొడుకులను వైద్యులు పరీక్షించారు. అయితే, తమ దగ్గరికి వచ్చే ముందే తండ్రీకొడుకులిద్దరి వెన్ను భాగాలపై తీవ్ర గాయాలు ఉన్నాయని, వారి ముఖాలు కూడా పాలిపోయి ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ ఇద్దరూ తమ సెల్ నుంచి డాక్టర్ రూం వద్దకు నడిచే వచ్చారని చెప్పారు.
ఆ సమయంలో ఫినిక్స్ మోకాలు ఒకటి బాగా ఉబ్బిపోయిందని చెప్పారు. జయరాజ్, బెనిక్స్‌లను కస్టడీలోకి తీసుకునే ముందు సత్తాన్‌కులం ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదికను పరిశీలించగా… అందులో కూడా వారి ఒంటిపై గాయాలు ఉన్నట్టు తేలిందని పేర్కొన్నారు.
ఒకరు బిపి, మరొకరు షుగర్ పేషెంట్
ఇక జయరాజ్ డయాబెటిస్‌తో, బెనిక్స్ హైపర్‌టెన్షన్‌తో బాధ పడుతున్నారని వారికి కొన్ని యాంటీ బయోటిక్స్ వాడాల్సిందిగా పోలీసులకు సూచించారు. అంతేకాదు జయరాజ్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనను సమీపంలో ఉన్న జనరల్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లాలని అధికారులకు చెప్పారు. వారిద్దరి గాయాలకు డ్రెస్సింగ్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ అదే రోజు రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో బెనిక్స్ ఆరోగ్యం క్షీణించిందని జైలు నుంచి సదరు డాక్టర్‌కు ఫోన్ కాల్ వచ్చింది.
బెనిక్స్ ఒళ్లంతా చెమటతో తడిసిపోయిందని.. దడగా ఉందని చెబుతున్నాడని ఓ అధికారి డాక్టర్‌కు వివరించారు. దాంతో అతడిని ఆటోరిక్షాలో ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కాసేపటికే బెనిక్స్ మరణించాడనే వార్త జైలు అధికారులకు అందింది. ఇక అదే సమయంలో జయరాజ్ ఆరోగ్యం కూడా క్షీణించడం, విపరీతమైన జ్వరం రావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని భావించారు. ఈ క్రమంలో జూన్ 23 (మంగళవారం) ఐదున్నర గంటల సమయంలో శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడిన జయరాజ్ కూడా మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
అయితే చనిపోవడానికి ముందు, అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ బెనిక్స్ తనంతట తానే నడిచి వచ్చాడని అధికారులు చెప్పడం గమనార్హం. కాగా కస్టోడియల్ డెత్‌పై తీవ్రంగా స్పందించిన మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ఈ ఘటనపై మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది.
‘’జార్జ్ ఫ్లాయిడ్స్ ఆఫ్ ఇండియా’’
తమిళనాడులో తండ్రి కొడుకుల లాకప్ డెత్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు హింసించడంతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తానుకులం ప్రాంతానికి చెందిన జయరాజ్(59), ఆయన కొడుకు బెనిక్స్(31) మరణించినట్టు ఆరోపణలు వచ్చాయి. వీరి మరణానికి కారకులైన దోషులను చట్టప్రకారం శిక్షించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. సోషల్ మీడియాలోనూ #JusticeForJayarajandBennicks హ్యష్‌టాగ్‌తో ప్రముఖులు, నెటిజనులు న్యాయం కోసం నినదిస్తున్నారు.
‘’జయరాజ్, బెనిక్స్ మరణవార్త విని హతశురాలిని అయ్యాను. చాలా కోపం వచ్చింది. ఇలాంటి క్రూరత్వానికి ఎవరూ పాల్పడరాదు. దోషులు తప్పించుకోకుండా చూడాలి. మాకు వాస్తవాలు కావాలి. ఇద్దరిని కోల్పోయిన మృతుల కుటుంబ సభ్యుల బాధను ఊహించడానికి కూడా సాహసించలేకపోతున్నాను. వారికి న్యాయం జరిగే వరకు మనమంతా సమైక్యంగా #JusticeForJayarajandBennicks హ్యష్‌టాగ్‌తో గళం వినిపిద్దాం” అని ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా ట్వీట్ చేశారు.
గుజరాత్‌కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని ఈ సంఘటనను అమెరికాలో ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యతో పోల్చారు. ‘’ప్రియమైన బాలీవుడ్ ప్రముఖులారా, తమిళనాడులో ఏం జరిగిందో మీరు విన్నారా లేదా మీ ఇన్‌స్టాగ్రామ్ యాక్టివిజం ఇతర దేశాలకు మాత్రమే విస్తరించిందా? జార్జ్ ఫ్లాయిడ్స్ ఆఫ్ ఇండియా చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఇటువంటి పోలీసు హింస, లైంగిక వేధింపుల కథ హృదయ విదారకం’’ అంటూ మేవాని ట్వీట్ చేశారు.
తమిళనాడు లాకప్ డెత్‌పై ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధవన్ కూడా ట్విటర్‌లో స్పందించాడు. ‘’తమిళనాడులో జయరాజ్, బెనిక్స్ పై చేసిన దారుణం గురించి విని భయపడ్డాను. మృతుల కుటుంబానికి న్యాయం జరిగేలా మనమంతా బలంగా గళం విన్పించాల’’ని ధవన్ ట్విటర్‌లో పేర్కొన్నాడు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, ఈ అమానవీయ చర్యకు పాల్పడిన వారిని శిక్షించి.. బాధితులకు న్యాయం చేయాలని తమిళ హీరో జయం రవి ట్విటర్‌లో డిమాండ్ చేశారు.
అనుమతించిన సమయానికి మించి తమ మొబైల్ దుకాణాన్ని తెరిచివుంచారన్న కారణంతో పి జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్‌ను గత శుక్రవారం (జూన్ 19) పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల తరువాత ఆసుపత్రిలో వారిద్దరూ మరణించారు. సాత్తానుకులం పోలీస్‌స్టేషన్‌లో పోలీసు సిబ్బంది తీవ్రంగా కొట్టడం వల్లే జయరాజ్, అతడి కొడుకు చనిపోయారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.
కాగా, తాము అడిగిన సెల్‌ఫోన్లను ఇవ్వలేదన్న అక్కసుతోనే జయరాజ్, బెనిక్స్‌లపై పోలీసులు దాష్టీకాన్ని ప్రదర్శించినట్టు వెలుగులోకి వచ్చింది. తండ్రి కొడుకుల లాకప్‌డెత్‌కు నిరసగా జూన్ 26 (శుక్రవారం)న రాష్ట్ర వ్యాప్తంగా వర్తకులు దుకాణాల బంద్ పాటించారు. జయరాజ్, బెనిక్స్‌లను కొట్టి చంపిన పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. లాకప్‌డెత్‌ను తీవ్రంగా పరిగణించిన మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ఈ ఘటనపై మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది.
తాము ఆడిన సెల్‌ఫోన్లను ఇవ్వలేదన్న ఆగ్రహంతో కక్ష కట్టి జయరాజ్, ఫినిక్స్‌లపై పోలీసులు దాష్టీకాన్ని ప్రదర్శించినట్టు వెలుగులోకి వచ్చింది. ప్రత్యక్ష సాక్షులు జూన్ 25 (గురువారం) మీడియా ముందుకు వచ్చిన ఐదు రోజుల క్రితం ఏమి జరిగిందో వివరించారు. ఇక, పోస్టుమార్టం అనంతరం మృతదేహాల్ని కుటుంబీకులకు అప్పగించారు.
తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తానుకులంకు చెందిన తండ్రి కుమారులు జయరాజ్, ఫినిక్స్ పోలీస్ కస్టడీలో ఒకరి తర్వాత మరొకరు మరణించడం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను వర్తక లోకం తీవ్రంగా పరిగణించింది. తూత్తుకుడి, తిరునల్వేలి జిల్లాల్లో నిరసనలు జూన్ 25 (గురువారం) కూడా నిరసనలు కొనసాగాయి.
పోలీసుల మీద హత్య కేసు నమోదు చేసే వరకు మృతదేహాన్ని తీసుకునే ప్రసక్తే లేదని జయరాజ్ కుటుంబం స్పష్టం చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు నియమించ బడ్డ మెజిస్ట్రేట్ ఆ కుటుంబంతో జూన్ 25 (గురువారం) ఉదయం మాట్లాడారు. తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆ కుటుంబానికి భరోసా ఇస్తూ, మృతదేహానికి అంత్యక్రియల ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో కుటుంబీకులు మృత దేహాలకు అంత్యక్రియలు జరిపేందుకు చర్యలు చేపట్టారు.
సాత్తాన్ కులం వివాదం నేపథ్యంలో అన్ని జిల్లాల ఎస్పీలు, ఐజి, డిఐజిలకు డిజిపి త్రిపాఠి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఏదేని కీలక కేసులు ఇకమీద పోలీసుల స్టేషన్లలో విచారించేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. డిఎస్పీ లేదా, డిఐజి కార్యాలయాల్లో విచారణల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఆలస్యంగా స్పందించిన సిఎం
సబ్ జైల్లో జ్యుడీషియల్ కస్టడిలో ఉన్న తండ్రి కుమారుల మరణం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. మదురై ధర్మాసనం సుమోటోగా కేసు నమోదు చేసింది. మద్రాసు హైకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక నగరాల్లో వర్తకులు నిరసనలకు దిగారు. దుకాణాలన్నీ మూసి వేశారు. సెల్ సర్వీసు సెంటర్లు మూతపడ్డాయి. బాధిత కుటుంబానికి రూ. 2 కోట్లు నష్ట పరిహారం ప్రకటించాలని వర్తక లోకం డిమాండ్ చేసింది. తన తండ్రి, సోదరుడిని హతమార్చిన పోలీసులపై హత్య కేసు నమోదుచేసి కఠినంగా శిక్షించే వరకు మృత దేహాలను తీసుకునే ప్రసక్తే లేదని జయరాజ్ కుమార్తెలు స్పష్టం చేశారు.
వణిగర్ సంఘం పేరవై నేతృత్వంలోని అన్ని దుకాణాలు తూత్తుకుడి, తిరునల్వేలి, మైలాడుతురై, మదురై, కడలూరు, తిరుచెందూరుల్లో నిరసనల్ని హోరెత్తించాయి. యజమానాలు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ దుకాణాల ఎదుట నిరసన చేపట్టారు.
ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయగా, మరో పదిహేను మందిని బదిలీ చేశారు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం కేసును సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనను తీవ్రంగానే కోర్టు పరిగణిస్తోంది. లాకప్ డెత్‌లకు ముగింపు లేదా ..? అని న్యాయమూర్తులు ప్రకాష్, పుగలేంది నేతృత్వంలోని బెంచ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. గంటల వ్యవధిలోనే డిజిపి, తూత్తుకుడి ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
అయితే సిఎం పళని స్వామితో కరోనా నివారణ చర్యలపై డిజిపి కాన్ఫరెన్స్‌లో ఉండడంతో కుదరలేదు. దీంతో ఆయన తరపున డిఐజి విచారణకు హాజరు అయ్యారు. తాము చేపట్టిన చర్యలను కోర్టు ముందు ఉంచారు. విధి విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ పిటిషన్ 26వ తేదికి వాయిదా వేశారు. అలాగే మృత దేహాలకు పోస్టుమార్టం పూర్తిగా వీడియో చిత్రీకరణ జరగాలని, విచారణను కోర్టు పర్యవేక్షిస్తుందని ఆదేశించారు.
ఆ ఇద్దరిని రిమాండ్‌కు తరలించిన కోవిల్పట్టి మేజిస్ట్రేట్ ఈ వివాదంలో ఇరుక్కున్నట్టుగా పరిస్థితి మారింది. చెన్నైకు చెందిన న్యాయవాది సూర్య ప్రకాశం మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు సుందరేష్, కృష్ణకుమార్ బెంచ్ ముందు హాజరయ్యారు. తండ్రి కుమారులను రిమాండ్‌కు తరలించే ముందు ఎందుకు వైద్య పరీక్షలకు న్యాయమూర్తి ఆదేశించలేదని ప్రశ్నించారు. దీంతో పిటిషన్ దాఖలు చేయాలని, విచారిస్తామని న్యాయమూర్తులు సూచించారు. కోవిల్ పట్టి మేజ్రిస్టేట్ భాగస్వామ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఇద్దరి మృతదేహాలను తిరునల్వేలి జిల్లా పాళయం కోటై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మధ్యాహ్నం పోస్టుమార్టం జరిగింది. అయితే మృతదేహాలను తీసుకునేందుకు కుటుంబీకులు నిరాకరించారు. జయరాజ్ సతీమని సెల్వరాణి , ముగ్గురు కుమార్తెలు కన్నీటి పర్యంతంతో మీడియా ముందుకు వచ్చారు. పోలీసులపై హత్య కేసు నమోదు చేసే వరకు మృతదేహాలను తీసుకునే ప్రసక్తే లేదని తేల్చారు. మరోవైపు తూత్తుకుడి ఘటన రాష్ట్రవాప్తంగా కలకలం రేగుతుంటే సిఎం పళని స్వామి మౌనంగా ఉండడం శోచనీయమని ఎంపి కనిమొళి ట్విట్టర్‌లో విమర్శించారు. అలాగే హత్య కేసు నమోదు చేయాలని డిజిపి జెకె త్రిపాఠికి కనిమొళి ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై ఎట్టకేలకు సిఎం పళనిస్వామి స్పందించారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తండ్రి కుమారుల మరణానికి సంతాపం తెలిపారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని..రూ. 20 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. సిఎం ఆదేశించడంతో జయరాజ్, ఫినిక్స్ కుటుంబానికి మృతదేహాలను అప్పగించేందుకు తూత్తుకుడి, తిరునల్వేలి జిల్లా అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఈ ఘటనను సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్రంగా ఖండించారు. ఘటనకు సంబందమున్న పోలీసులపై ఐపిసి 302 కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అలాగే కనీసం రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.