iDreamPost
android-app
ios-app

త‌మిళ‌నాట ఊపందుకుంటున్న రెండో రాజ‌ధాని నినాదం

త‌మిళ‌నాట ఊపందుకుంటున్న రెండో రాజ‌ధాని నినాదం

తమిళనాడులో రెండో రాజ‌ధాని అంశం ఇప్ప‌టిది కాదు. ఎప్ప‌టి నుంచో దీనిపై చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది. అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీ రామచంద్రన్ హ‌యాంలోనే ఈ ప్ర‌తిపాద‌న వ‌చ్చిన‌ట్లు ప్ర‌చారంలో ఉంది. అప్ప‌ట్లో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి దీన్ని అడ్డుకున్నారు. నాటి నుంచీ రాజ‌ధాని అంశం తెర‌పైకి వ‌స్తూ.. మ‌ళ్లీ మ‌రుగున ప‌డుతూ ఉంటోంది. ఇప్పుడు గత కొంత కాలంగా రెండో రాజ‌ధానిపై సీఎంపై ఒత్తిడి పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం రెవెన్యూ మంత్రి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ పెరుగుతున్న జ‌నాభాకు అనుగుణంగా చెన్నై విస్తరణను గురించి ప్రస్తావించారు. నగరం చుట్టూ పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతోంద‌ని, న‌గ‌రం పెరుగుతోంద‌ని తెలిపారు. తాజాగా మ‌రో మంత్రి వెల్లమండి నటరాజన్ కూడా ఆ నినాదం అందుకున్నారు. ఈ నేప‌థ్యంలో రెండో రాజ‌ధాని అంశాన్ని మ‌ళ్లీ తెర‌పైకి తెచ్చారు. అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ ఇప్పుడీ అంశం హాట్ టాపిక్ గా మారింది.

మంత్రుల్లో భిన్నాభిప్రాయాలు

రెండో రాజ‌ధాని అంశం తెర‌పైకి రావ‌డంతో పాటు అదెక్క‌డ ఉంటుంద‌నే దానిపై కూడా త‌మిళ‌నాడులో చ‌ర్చ జ‌రుగుతోంది. దీనిపై మంత్రుల మ‌ధ్య భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌ధురై అయితే అన్ని జిల్లాలకూ సమాన దూరంగా ఉంటుంద‌ని మంత్రి ఉద‌య్ కుమార్ చెబుతున్నారు. రెండో రాజ‌ధానిగా మధురై త‌ప్ప మ‌రో న‌గ‌రానికి అవ‌కాశం లేద‌ని ఆయ‌న అంటున్నారు. తిరుచ్చిని రెండో రాజధానిగా ప్రకటించాలని మ‌రో మంత్రి వెల్లమండి నటరాజన్ కొత్త నినాదం అందుకున్నారు. మదురై కన్నా, తిరుచ్చి అన్నింటికీ మిన్న అని ఆయ‌న అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి కాంగ్రెస్‌ ఎంపీ తిరునావుక్కరసర్‌ మద్దతు ఇవ్వడం గమనార్హం.

ఆ రెండు న‌గ‌రాల‌పైనే…

త‌మిళ‌నాడు సీఎం దృష్టికి రెండో రాజ‌ధాని ప్ర‌క‌ట‌న‌ల‌తో పాటు మంత్రులు త‌మ అభిప్రాయాల‌ను తీసుకెళ్తున్నారు. రెవెన్యూ మంత్రి ఆర్‌బీ ఉదయకుమార్ మ‌ధురై రాజ‌ధానిగా బాగుంటుంద‌ని సీఎం కు తెలిపారు. ఎంజీఆర్ హయాంలో ప్రపంచ తమిళ మహా సభలు మధురైలోనే జరిగాయని, దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూడా ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలను మధురైలోనే ప్రకటించారని ఆ న‌గ‌రంపై వారికి కూడా ప్ర‌త్యేక అభిమానం ఉంద‌నే విష‌యాన్ని తీసుకెళ్తున్నారు. ఈ దిశగా ముఖ్యమంత్రి పళని స్వామి చర్యలు చేపట్టాలని ఉదయ్ కుమార్ కోరారు. ఉదయకుమార్ కు మ‌రో సెల్లూరు కె రాజు మద్దతు ప్రకటించారు. చెన్నై తర్వాత రెండో రాజధాని అంటే తిరుచ్చికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి వెల్లమండి నటరాజన్ కూడా త‌న వాద‌న‌ను బ‌లంగా వినిపిస్తున్నారు. ఎంజీఆర్‌ గతంలో తిరుచ్చిని రెండో రాజధానిగా ప్రకటించాలన్న నిర్ణయానికి వచ్చేశారని, అయితే, పరిస్థితుల ప్రభావంతో అది అమలుకు నోచుకోలేదన్నారు.