తమిళనాడులో కరోనా కేసులు ఉదృతంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 48,019 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. ప్రజలపైనే కాకుండా ప్రజా ప్రతినిధులు అధికారులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలే కరోనా బారినపడి డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే తాజాగా కరోనా వైరస్‌తో తమిళనాడు సీఎం పిఏ మృతి చెందారు.
వివరాల్లోకి వెళితే తమిళనాడు సీఎం పళని స్వామి పిఏ దామోదరం ఈరోజు కరోనాతో మృతి చెందినట్లు తమిళనాడు రాష్ట్ర అధికారులు వెల్లడించారు. దామోదరంసీఎం వద్ద సీనియర్ ప్రయివేట్ సెక్రటరీగా పని చేస్తున్నారు. ఆయన ముందుగా ఒమందురర్ ఎస్టేట్‌లోని ప్రభుత్వ హాస్పిటల్‌లో చేేరారు. అనంతరం రాజీవ్ గాంధీ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో ప్రయివేట్ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు..
ఇప్పటికే కరోనా ఉధృతి అధికంగా ఉన్న చెన్నై మెట్రో పాలిటన్ నగర పరిధిలోకి వచ్చే నాలుగు జిల్లాల్లో జూన్ 19 నుంచి 30 వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో ఈ లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ నాలుగు జిల్లాల్లో పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదేశించారు.
కరోనా కారణంగా మృతి చెందిన ముఖ్యమంత్రి పళనిస్వామి పిఏ దామోదరం కుటుంబానికి డిఎంకె నేత స్టాలిన్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా తమిళనాడులో48,019 కరోనా కేసులు నిర్దారణ కాగా 20,709 ఆక్టీవ్ కేసులు ఉన్నాయి. 26,782 మంది వ్యాధి నుండి కోలుకోగా,528 మంది మరణించారు.