iDreamPost
android-app
ios-app

తమన్నాకు కాదు.. మాకే ఐదు కోట్ల నష్టం!

  • Published Oct 27, 2021 | 12:31 PM Updated Updated Oct 27, 2021 | 12:31 PM
తమన్నాకు కాదు.. మాకే ఐదు కోట్ల నష్టం!

ఈ మధ్య కాలంలో హీరో హీరోయిన్లు కూడా బుల్లితెరలో కనిపించడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు.. సినిమాలకు తలదన్నే రీతిలో రెమ్యూనరేషన్ రావడంతో పాటుగా సినిమాలతో పోలిస్తే చాలా తక్కువ కాల్షీట్లు ఇవ్వాల్సి రావడంతో టీవీ షోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే సినిమాల్లో అవకాశాలు తగ్గిన మిల్కీ బ్యూటీ తమన్నా ఇన్నోవేటివ్ ఫిలిం అకాడమీ అనే ఒక సంస్థతో కలిసి మాస్టర్ చెఫ్ తెలుగు అనే ప్రోగ్రామ్ చేస్తోంది.. కొన్నాళ్ల క్రితం వరకు అంతా బాగానే ఉంది కానీ అనూహ్యంగా తమన్నా ప్లేస్ లో యాంకర్ అనసూయ ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. దీంతో తమన్నాకు డేట్లు ఖాళీ లేక అనసూయను రప్పించారు ఏమో అనే ప్రచారం జరిగినా అనూహ్యంగా అనసూయ ఎంట్రీ తర్వాత తమన్నా సదరు సంస్థకు లీగల్ నోటీసులు జారీ చేసింది.

దీంతో అసలు ఏం జరుగుతోంది అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఇన్నోవేటివ్ ఫిలిం అకాడమీ సంస్థకు తమన్నా తరపున న్యాయవాది లీగల్ నోటీసులు జారీ చేస్తూ ప్రోగ్రాం చేయడం కోసం తమన్నా ఎన్నో కమిట్మెంట్ లను పక్కనపెట్టి ప్రోగ్రామ్ కోసం పని చేస్తే కనీసం వాళ్ళు స్పందించకుండా వేరే హోస్ట్ తో ప్రోగ్రాం ప్లాన్ చేశారని పేర్కొన్నారు. అంతేకాక తమన్నాకు ఇవ్వాల్సిన డబ్బు కూడా పూర్తిగా చెల్లించకుండా కమ్యూనికేషన్ కట్ చేశారని పేర్కొన్నారు. ఈ విషయం మీద తాజాగా స్పందించిన ఇన్నోవేటివ్ ఫిలిం అకాడమీ తమన్నాకు తాము పూర్తిగా చెల్లించక పోయిన మాట వాస్తవమే కానీ ఆమె కారణంగా మేము 5 కోట్ల రూపాయలు నష్టపోయామని పేర్కొంది. తమన్నా మాతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వ్యవహరించలేదు కాబట్టి తాము బెంగళూరు సివిల్ కోర్టులో దావా వేస్తున్నామని కూడా ప్రకటించింది. ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ సంస్థ చెబుతున్న దాని ప్రకారం తమన్నా ఇన్నోవేటివ్ ఫిలిం అకాడమీతో 18 రోజుల పాటు షూటింగ్లో పాల్గొంటారని అగ్రిమెంట్ చేసుకుందట. దానికిగాను తమన్నాకు రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఇన్నోవేటివ్ ఫిలిం అకాడమీ సిద్ధమైంది.

కానీ తమన్నా 16 రోజుల షూటింగ్ కు హాజరైంది కానీ మరో రెండు రోజుల షూటింగ్ మాత్రం పాల్గొనలేదు. ఆ రెండు రోజుల షూటింగ్ విషయం గురించి మాట్లాడితే తమన్నా నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదట. అందుకే అనుకున్న దాని ప్రకారం 16 రోజులకు గాను తాము కోటి రూపాయల 55 లక్షలు చెల్లించామని, ఆమె ఒక వేళ మరో రెండు రోజుల షూటింగ్ కూడా చేసి ఉంటే తప్పకుండా మిగతా యాభై లక్షల రూపాయలు కూడా చెల్లించే వాళ్ళమని సంస్థ పేర్కొంది. ఆమె ఆ రెండు రోజుల షూటింగ్ గురించి మాట్లాడకపోవడమే కాక రెండవ సీజన్ అడ్వాన్స్ కూడా ఇవ్వాలి అని అడిగిందట. అసలు రెండో సీజన్ మేము తమన్నాతో చేయాలని అనుకోవడం లేదు కానీ ఆమె అలా అడగడం షాకింగ్ అనిపించిందని చెప్పుకొచ్చారు.

ఆమె వస్తుంది అనుకుని రెండు రోజుల పాటు 300 మంది పైగా ఉన్న క్రూ సభ్యులందరినీ సమావేశపరచడంతో తమకు ఐదు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని సంస్థ చెబుతోంది. మరి ఈ విషయం మీద తమన్నా ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. తెలుగులో కుకరీ షోలకు మంచి వ్యూయర్ షిప్ ఉండేది కానీ తర్వాత తర్వాత రొటీన్ అయిపోవడంతో షోలకు బాగా రెస్పాన్స్ తగ్గిపోయింది. ఈ షో అలరిస్తుంది అనుకున్నారు కానీ వర్కౌట్ కాలేదు, అందుకే బహుశా సెకండ్ సీజన్ కు ఏదో ఒక యాంకర్ ను పెట్టి లాగించేయాలని భావిస్తూ ఉండవచ్చు.

ALSO READ – కోర్టుకెళ్లిన మాస్టర్ చెఫ్ వ్యవహారం