iDreamPost
android-app
ios-app

రాళ్లు, చెప్పుల రాజకీయం..!

  • Published Jul 04, 2021 | 3:29 PM Updated Updated Jul 04, 2021 | 3:29 PM
రాళ్లు, చెప్పుల రాజకీయం..!

తెలంగాణలో ప్రస్తుతం రాళ్లు, చెప్పుల రాజకీయం నడుస్తోంది. గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరిన నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని రేవంత్ రెడ్డి అంటే.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్.. రూ.25 కోట్లు ఇచ్చి పీసీసీ ప‌ద‌విని ద‌క్కించుకున్నాడని, ఆయనకే చెప్పు దెబ్బలు ఖాయ‌మ‌ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాళ్లతో కొట్టాల్సి వస్తే ముందు రేవంత్ నే కొట్టాలన్నారు. మిగతా నేతలు కూడా రేవంత్ పై మండిపడుతున్నారు.

అగ్గిరాజేసిన రేవంత్ వ్యాఖ్యలు

దూకుడు రేవంత్ స్వభావం. ఈ స్వభావం వల్లే ఓటుకు నోటు కేసులు అడ్డంగా బుక్కయ్యారు. వీడియో, ఆడియో టేపులతో సహా దొరికిపోయారు. ఇప్పుడు పీసీసీ చీఫ్ కాగానే.. ఫిరాయింపులపై ఫైర్ అవుతున్నారు. కానీ మూడున్నరేళ్ల కిందట ఆయన కూడా ఫిరాయించిన విషయం మరిచిపోయినట్లు ఉన్నారు. అప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని రేవంత్ రెడ్డి.. ఇప్పుడేమో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ పార్టీని వదిలి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాలు రద్దయ్యేంత వరకు పోరాడతామని చెబుతున్నారు. రేవంత్ గతంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఎన్నికలకు వెళ్లి.. ఇప్పుడు డిమాండ్ చేస్తే అది నిజాయితీ అవుతుంది. తాను పదవిలో కొనసాగి.. పక్క వాళ్లను మాత్రం రాళ్లతో కొట్టాలి.. అంటే ఊరుకుంటారా? అందుకే ఒకటికి నాలుగు మాటలు ఎక్కువే అంటున్నారు టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.

Also Read : రేవంత్ వచ్చాక.. సీనియర్లు తప్పుకున్నారా? తప్పించారా?

వాళ్ల మాటలకు సమాధానముందా?

రేవంత్ మాటలకు టీఆర్ఎస్ లీడర్లు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. ఎమ్మెల్యేను కొనబోయి దొరికిన దొంగవి.. సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని బ్లాక్ మెయిలర్ గా ఎదిగిన నేతవు అంటూ మండిపడుతున్నారు. ‘‘రాజ‌స్థాన్‌లో బీఎస్పీ ఎమ్మెల్యేల‌ను చేర్చుకున్న కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్‌ను కూడా రాళ్లతో కొడుతావా? 2014లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను కాంగ్రెస్ నేత దిగ్విజ‌య్ సింగ్ ఆహ్వానించారు. మరి ఆయ‌న‌ను కూడా రాళ్లతో కొడుతావా?” అని నిలదీస్తున్నారు. తాము రాజ్యాంగంలోని ప‌దో షెడ్యూల్ ప్రకార‌మే టీఆర్ఎస్ఎల్పీలో విలీనం అయ్యామ‌ని సుధీర్ రెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి తదితరులు చెబుతున్నారు. మరి దీనిపై ఏమి చెబుతారు? చేతనైతే చట్టపరంగా తేల్చుకోవాలని కానీ.. రాళ్లతో కొట్టండి.. చంపండి.. అని పిలుపునివ్వడం దేనికి సంకేతం. సరే ఇదంతా వదిలేద్దాం.. 2014లో వైఎస్సార్‌‌సీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుంటే ఎందుకు మాట్లాడలేదు? అలా చేరిన వాళ్లను, చేర్చుకున్న అధినేతను రాళ్లతో కొట్టమని ఎందుకు

పిలుపునివ్వలేదు. ఇదేం రాజకీయం?

ఈ రెండు పార్టీలు కొట్లాడుతుంటే మధ్యలో బీజేపీ ఖుషీ అవుతోంది. పైగా మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ ను చూసి నేర్చుకోవాలని ఆ పార్టీ లీడర్లు అంటున్నారు. రేవంత్, ఫిరాయించిన ఎమ్మెల్యేలు గొడవపడటం చూస్తే.. ‘ఒక దొంగ.. ఇంకో దొంగను దొంగ’ అని పిలిచినట్లు ఉందని ఎద్దేవా చేస్తున్నారు. ఇక్కడి దాకా బాగానే ఉంది కానీ.. కర్ణాటక, పశ్చిమబెంగాల్‌, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించే చేర్చుకున్నారా? అనే ప్రశ్నలు బీజేపీ వైపు దూసుకొస్తున్నాయి మరి!!

Also Read : కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ ఛార్జ్ పీసీసీ కోసం 25 కోట్లు తీసుకున్నాడంట ..!