తాలిబన్ దురాక్రమణ పరిపూర్ణమయ్యింది. ఆఫ్ఘన్ పూర్తిగా వారి కబంధ హస్తాల్లో చిక్కుకుంది. చివరి వరకు వారిని ప్రతిఘటించి ముప్పుతిప్పలు పెట్టిన పంజ్ షీర్ సింహాలు.. ప్రత్యర్థుల ముప్పేట దాడికి తట్టుకోలేక చివరికి తలవంచాయి. మూడు నాలుగు రోజులుగా పంజ్ షీర్ ప్రావిన్స్ లో జరిగిన భీకర యుద్ధం ముగిసింది. తాలిబన్లు ఆ ప్రావిన్స్ గవర్నర్ కార్యాలయంపై తమ అధికారిక పతాకమైన తెల్ల జెండా ఎగురవేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించడంతో తాలిబన్ల ఆధిపత్యం ధృవపడింది. ఈ విషయంలో పాకిస్థాన్ సైన్యం, అల్ ఖైదా దళాలు తాలిబన్లకు సహకరించడంతో ఇంత కాలం దుర్భేద్యంగా ఉన్న పంజ్ షీర్ కోట తొలిసారి తాలిబన్ వశమైంది.
డ్రోన్లతో పాక్ బాంబుల వర్షం
కాబూల్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత తమకు కొరకరాని కొయ్యగా మారిన పంజ్ షీర్ వైపు తాలిబన్లు దండయాత్ర మొదలు పెట్టారు. అయితే వారు తమ సరిహద్దుల్లోకి రాకుండా పంజ్ షీర్ నేత అహ్మద్ మసూద్ ఆధ్వర్యంలోని ఉత్తర కూటమి దళాలు మార్గం మధ్యలోనే ఎక్కడికక్కడ ప్రతిఘటిస్తూ వచ్చాయి. వందలాది తాలిబన్లను హతమార్చాయి. పంజ్ షీర్ ను ఆక్రమించే విషయంలో అల్ ఖైదా తోడు దొరకడంతో తాలిబన్లు మరింత విజృంభించారు. అయినప్పటికీ ఆదివారం వరకు పంజ్ షీర్ వీరులదే పైచేయిగా ఉంది. 600 మంది తాలిబన్లను హతమార్చడంతోపాటు వెయ్యిమందిని బందీలుగా పట్టుకున్నారు. అయితే అంతవరకు తెరవెనుక మద్దతు ఇస్తూ వచ్చిన పాకిస్థాన్ నేరుగా రంగంలోకి దిగి ప్రత్యేక బలగాలతో దాడులు చేసింది. వాయుసేన డ్రోన్లతో పంజ్ షీర్ లోయపై బాంబుల వర్షం కురిపించింది. బాంబుల దాడుల్లో ప్రతిఘటన దళాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
చర్చల ప్రతిపాదన తిరస్కృతి
తాలిబన్, అల్ ఖైదా, పాక్ కలిసి ముప్పేట దాడికి దిగడంతో వారిని ఎంతో కాలం ప్రతిఘటించడం సాధ్యం కాదని భావించిన ప్రతిఘటన దళాల నాయకుడు అహ్మద్ మసూద్ శాంతి చర్చల ప్రస్తావన తీసుకొచ్చారు. ఆఫ్ఘన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ కూడా అదే సంకేతాలు పంపారు. అయితే తాలిబన్లు నిరాకరించి దాడుల ఉద్ధృతి పెంచారు. దానికితోడు పాక్ బాంబుల వర్షం కురిపించడంతో పంజ్ షీర్ తాలిబన్ల వశమైంది. ఈ దాడుల్లో అహ్మద్ మసూద్ సన్నిహితుడు, జర్నలిస్టుల సమాఖ్యకు చెందిన ఫహీం దస్తీ మరణించాడు. మరో నాయకుడు అబ్దుల్ వదూద్ జోర్ కూడా హతమయ్యాడు. పంజ్ షీర్ నేత అహ్మద్ మసూద్ ఆచూకీ లభించలేదు. ఆయన పరారీలో ఉండవచ్చని అంటున్నారు.
Also Read : పంజ్ ‘షేర్’ పంజా దెబ్బకు పిట్టల్లా రాలిన తాలిబన్లు..?