Idream media
Idream media
తలసాని శ్రీనివాస్ యాదవ్.. తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు. గ్రేటర్ మంత్రిగా రాజధాని రాజకీయాలలో కేటీఆర్ తర్వాత ప్రముఖ పాత్ర ఆయనదే. కరోనా విజృంభణ కాలంలోనూ ప్రజలకు అందుబాటులూ ఉంటూ.. లాక్ డౌన్ సమయంలో కూడా ప్రభుత్వం కొనసాగిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించేవారు. ఎక్కడికెళ్లినా అందరి దృష్టీ ఆయనపైనే ఉండేది. ప్రస్తుతం కూడా అంతే. అందుకు కారణం మంత్రి అని కాదు.. మరో అంశం ఉంది. అదేమిటంటే…!
కరోనా మహమ్మారి దేశాన్ని ఇంకా వీడలేదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా రోజుకు 1500కు పైగా కరోనా కేసులు ఇప్పటికీ నమోదు అవుతూనే ఉన్నాయి. అన్ లాక్ దశల్లో భాగంగా సాధారణ కార్యకలాపాలు అందుబాటులోకి వస్తున్నా.. భౌతికదూరం, మాస్క్ తప్పనిసరి అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. వ్యాక్సిన్ వచ్చే వరకూ అవే శ్రీరామ రక్ష అని ప్రధాన మంత్రి నుంచి ముఖ్యమంత్రుల వరకూ అందరూ చెబుతున్నారు. మహమ్మారి బారిన పడకుండా చాలా మంది స్వీయ రక్షణ చర్యలు పాటిస్తున్నారు కూడా. అయినప్పటికీ చాలా మంది ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. వారిలో అత్యధిక మంది కోలుకున్నారు కూడా దురదృష్టవ శాత్తూ ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారు, వయసు పైబడిన వారు మృత్యువాత పడ్డారు. తాజాగా తెలంగాణ తొలి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా కరోనా బారిన పడి తదనంతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో మృతి చెందారు. ఆయన మృతితో ప్రజాప్రతినిధులు మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రజా కార్యక్రమాల కోసం బయట తిరుగుతున్నప్పటికీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ రెండు రోజుల క్రితం ముషీరాబాద్ ఎమ్మెల్యే కరోనా లక్షణాల అనుమానంతో ఆస్పత్రిలో చేరారు.
తలసాని రూటే సెపరేటు..
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికి వచ్చి మాస్క్ పెట్టుకున్న దాఖలాలు అస్సలు లేవు. ఈ ఏడు నెలల కాలంలో ఒకటి, రెండు సార్లు తప్ప ఆయన మాస్క్ ధరించలేదు. ఇప్పుడు వరద బాధితులకు సహాయం పంపిణీ కొనసాగుతోంది. వందలాది మందికి రూ.10 వేలు అందిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో తలసాని తిరుగుతూ స్వయంగా సహాయం అందిస్తున్నారు. రోజూ వందలాది మందిని కలుస్తున్నారు. అయినప్పటికీ ఆయన మాస్క్ ధరించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల చాలెంజ్ భాగంగా కాంగ్రెస్ నాయకులు, తలసాని కలిసి తిరిగారు. అందరూ నేతలు మాస్క్ లు, కొందరైతే గ్లౌజులు కూడా ధరించి తిరిగారు. తలసాని మాత్రం మాస్క్ కూడా ధరించ లేదు. కరోనా ఉధృతంగా దాడి చేస్తున్న సమయంలో కూడా ఆ మంత్రి మాస్క్ ధరించలేదు. దీనిపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఒకానొక సందర్భంలో తలసాని దీనిపై స్పందిస్తూ కరోనా భయపడేంత వ్యాధి కాదని, ఒకవేళ తనకు కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చేరి చికిత్స పొందుతానని పేర్కొంటూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలందుతున్నాయన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఏదైనప్పటికీ మాస్క్ ధరించని విషయంలో అమెరికాలో ట్రంప్ ఎలా చర్చనీయాంశం అయ్యారో.. తెలంగాణలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై అలా చర్చ జరుగుతోంది.