Idream media
Idream media
ఈ నెల 28 వరకు నిర్వహించాలనుకున్న తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డ విషయం తెలిసిందే. సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యేలు, పోలీసు సిబ్బంది కరోనా బారిన పడుతుండడం.. విజృంభించే అవకాశాలు ఉన్నాయని భావించడంతో ఈ నెల 7న ప్రారంభమైన సమావేశాలు బుధవారంతో ముగిశాయి.
సమావేశాలు జరిగిన కాలంలో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య పలు అంశాలపై మాటల యుద్ధం జరిగింది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై అసెంబ్లీలో బుధవారం రసవత్తర చర్చ సాగింది. ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం చెబుతుందొకటి.. వాస్తవంగా జరుగుతోంది మరొకటి అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు ఎక్కడ నిర్మిస్తున్నారో చూపాలంటూ అసెంబ్లీలో బుధవారం సవాల్ విసిరారు. ఆ సవాల్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీకరించారు.
అధికార, ప్రతిపక్షం కలిసికట్టుగా..
అసెంబ్లీ లో జరిగిన చర్చ మేరకు సవాల్ ను స్వీకరించిన మంత్రి తలసాని ప్రభుత్వం నిర్మించిన, నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను భట్టి విక్రమార్కకు గురువారం చూపించారు. రేపు కూడా ఇళ్ల పరిశీలన ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నేతలు, అటు మంత్రి తలసాని చెప్పారు. ఇప్పటి వరకు వెయ్యికి పైగా ఇళ్లను పరిశీలించినట్లుగా సమాచారం. నాంపల్లిలోని కట్టెలమండి ప్రాంతంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఇక్కడ 120 ఇళ్ల నిర్మాణం పూర్తి అయింది. జియాగూడలో 800, గోడెకబర్‌లో 190 ఇళ్లు పూర్తి అయ్యాయి.
మొత్తం ఇప్పటి వరకు వెయ్యి ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. తర్వాత ఐమాక్స్ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తున్నారు. అనంతరం సీసీనగర్, కొల్లూరు, అంబేద్కర్ నగర్ ప్రాంతంలో కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. శుక్రవారం కూడా మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించనున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కలిసి పర్యటించడం గ్రేటర్ లో ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ లో లేవనెత్తిన అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించడం సంతోషించదగ్గ విషయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.