iDreamPost
android-app
ios-app

జేసీకి ఆ అర్హత ఉందా? టీ.కాంగ్రెస్‌ ఫైర్‌

జేసీకి ఆ అర్హత ఉందా?  టీ.కాంగ్రెస్‌ ఫైర్‌

తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్‌రెడ్డి తెలంగాణ సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలపై దుమార రేగుతోంది. తెలంగాణ పార్టీపై ఆయన వ్యాఖ్యలేందని కాంగ్రెస్‌ సీనియర్లు జేసీపై మండిపడుతున్నారు. స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారిన వ్యక్తికి అటువంటి మాటలు మాట్లాడే అర్హత లేదని చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఇచ్చి సోనియా తప్పు చేశారని, కాంగ్రెస్‌ పార్టీ కేసీఆర్‌ను ఓడించలేదంటూ జేసీ వ్యాఖ్యలు చేస్తున్నా అక్కడే ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అడ్డుకోలేదని, ఇది తప్పుడు సంకేతాలను ఇస్తోందంటూ పలువురు నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు.

జేసీ వ్యాఖ్యలు మీడియాలోనూ ప్రముఖంగా రావడంతో అధిష్ఠానం దీనిపై సీఎల్పీ నేత భట్టివిక్రమార్కను ఆరా తీసినట్లు తెలుస్తోంది. అయితే జేసీ వ్యాఖ్యలను అక్కడికక్కడే అడ్డుకున్నామని, తగిన సమాధానాలూ చెప్పామని, అది మీడియాలో ప్రముఖంగా రాలేదని భట్టి వివరణ ఇచ్చినట్లు సమాచారం. జేసీ వ్యాఖ్యలను తాము అడ్డుకున్న తీరును వివరిస్తూ బుధవారం భట్టివిక్రమార్క, పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. టీడీపీ నేత జేసీ మంగళవారం సీఎల్పీ కార్యాలయాన్ని సందర్శించినప్పుడు రాష్ట్ర విభజనలో సోనియాగాంధీ పాత్ర, కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్తు తదితర అంశాలపై వివాదాస్పద, బాధాకరమైన వ్యాఖ్యలు చేశారని, అయితే వెంటనే ఆ వ్యాఖ్యలను ఖండించామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

‘‘దశాబ్దాల పాటు కాంగ్రెస్‌ పార్టీ ద్వారా అనేక ఉన్నత పదవులు అనుభవించారు. మీ రాజకీయ స్వార్థం కోసం పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో టీడీపీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఇక్కడి ప్రజల దశాబ్దాల ఆకాంక్ష. ప్రజల మనోభావాలను గుర్తిస్తూ రాజకీయ ప్రయోజనాలను ఆశించకుండా సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటుకు సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని ఎలా తప్పు పడతారు?’’ అంటూ జేసీ దివాకర్‌రెడ్డిని మీడియా ముందే నిలదీశామన్నారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందనీ ధీమా వ్యక్తం చేశామన్నారు. ‘‘రాజకీయ అవకాశ విధానాలతో పార్టీ మారడం కారణంగా మీరు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోవడమే కాకుండా మీ వంటి రాజకీయ అవకాశవాదులకు ఆశ్రయమిచ్చిన పార్టీలు ప్రజాగ్రహానికి గురై భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని పేర్కొన్నామన్నారు. జేసీ వ్యాఖ్యలకు ప్రాధాన్యమిచ్చిన మీడియా ప్రతిగా తాము చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు.

జేసీ దివాకర్‌రెడ్డి తన రాజకీయాలు తెలంగాణలో కాదని, ఆంధ్రాలో చూసుకోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ అన్నారు. సాగర్‌ ఉప ఎన్నికలో జానారెడ్డి ఓడిపోతాడని చెప్పడానికి జేసీ ఎవరని ప్రశ్నించారు. జోస్యం చెప్పడం మానుకోవాలన్నారు. జేసీ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన కేసీఆర్‌ కోవర్టు అని అర్థమవుతోందన్నారు. జేసీ దమ్మున్న లీడరైతే ఆయన రాజకీయ బలాన్ని జగన్‌పై చూపించుకోవాలన్నారు.