iDreamPost
iDreamPost
లాక్ డౌన్ అయ్యాక బాక్సాఫీస్ లెక్కలన్నీ ఓటిటికి మారిపోయాయి. ఎన్ని వసూళ్లు వచ్చాయని చెప్పుకోవడం గత ముచ్చట. ఎన్ని కోట్ల మంది సెర్చ్ చేశారు, యాప్ లో ఎన్ని వ్యూస్ వచ్చాయనేది ఇప్పటి కొలమానం. ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు వాటి లెక్కలు బయటికి చెప్పుకోవు. యుట్యూబ్ లాగా ఎందరు చూశారనే స్పష్టత సాక్ష్యాత్తు నిర్మాత అడిగినా చెప్పరు. అంత గోప్యతను మైంటైన్ చేస్తారు. అయితే గూగుల్ లో ఆయా సినిమాలు ఎంతమేరకు ట్రెండింగ్ అయ్యాయనే దాని బట్టి వీటి ఫలితాల మీద ఒక అవగాహనకు రావొచ్చు. తాజాగా గూగుల్ ఆ వివరాలు విడుదల చేసింది. ఇండియాలో అత్యథికులు చూసిన సినిమాల లిస్టుని విడుదల చేసింది.
అందులో రెండో స్థానంలో నిలిచింది సూర్య ఆకాశం నీ హద్దురా. అమెజాన్ ప్రైమ్లో గత నెల డైరెక్ట్ గా రిలీజైన సూరారై పోట్రు(ఒరిజినల్ తమిళ టైటిల్)గురించి నెటిజెన్లు బాగా వెతికారట. దీనికి సంబంధించిన రివ్యూలు, రిపోర్ట్స్, సెలెబ్రిటీ ఒపీనియన్స్ తదితరాలు సౌత్ లోనే కాక నార్త్ ఆడియన్స్ కూడా ఎక్కువగా సెర్చ్ చేశారు. అయితే ఫస్ట్ ప్లేస్ మాత్రం సుశాంత్ సింగ్ నటించిన ఆఖరి సినిమా దిల్ బేచారా దక్కించుకుంది. ఈ ఏడాది అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్న ఈ యంగ్ హీరో పట్ల సింపతీ, సదరు సినిమా బ్యాక్ డ్రాప్ వల్ల డిస్నీ హాట్ స్టార్ బంపర్ ఛాన్స్ కొట్టేసింది. ఫస్ట్ డే రికార్డులు కూడా దీని పేరు మీదే ఉన్నాయి.
ఆ తర్వాత తానాజీ, శకుంతలా దేవి, గుంజన్ సక్సేనా, లక్ష్మి, సడక్ 2 లు మిగిలిన స్థానాల్లో నిలిచాయి. ఇందులో దారుణమైన డిజాస్టర్లు కూడా ఉన్నాయి. ఓటిటిలో చూసేవి కాబట్టి ఇందులో అధిక శాతం ఆ మాత్రం స్పందన తెచ్చుకున్నాయి కానీ థియేటర్ అయ్యుంటే పరిస్థితి వేరుగా ఉండేది. మొత్తానికి కరోనా వైరస్ ప్రభావం పరిశ్రమ ఈ విధంగా పడటం ఎవరూ ఊహించనిది. ఇప్పటికైతే తెరుచుకున్నాయి కానీ చెప్పుకోదగ్గ క్రేజీ సినిమాలు ఏవీ ఇంకా విడుదల కాలేదు. గూగుల్ ట్రెండ్స్ లో మన వి, నిశ్శబ్దం, మిస్ ఇండియా లు లేకపోవడం గమనార్హం. కనీసం దీనికైనా నోచుకోలేకపోయాయి.