iDreamPost
android-app
ios-app

పీవీ వారసత్వ పునరుజ్జీవం

  • Published Mar 21, 2021 | 5:46 AM Updated Updated Mar 21, 2021 | 5:46 AM
పీవీ వారసత్వ పునరుజ్జీవం

భారత రాజకీయాల్లో ప్రత్యేక ముద్రవేసుకున్న పాములపర్తి వెంకట నరసింహారావు గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరుగున పడిపోయిన ఆయన వారసత్వం సురభి వాణి రూపంలో మళ్లీ పునరుజ్జీవం పొందింది. తెలంగాణలో జరిగిన పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో టీఆరెస్ అభ్యర్థి గా ఎన్నిక కావడంతో పీవీ వారసత్వం మళ్లీ వెలుగులోకి వచ్చింది.

రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో ధృవతార పీవీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కరీంనగర్ జిల్లా వంగరకు చెందిన పీవీ నరసింహారావు కాంగ్రెస్ వాదిగా అంచెలంచెలుగా ఎదిగారు. బహుభాషాకోవిదుడు, రచయిత అయిన ఆయన రాజకీయ నిష్ణాతుడిగాను పేరు ప్రఖ్యాతులు పొందారు. ఎన్నో సంక్షోభ సమయాల్లో చాకచక్యంగా వ్యవహరించి దీక్షాధక్షుడిగా మన్ననలు పొందారు.

1971 నుంచి 1973 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన.. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో ప్రవేశించారు. అఖిలభారత కాంగ్రెస్ లో పలు కీలక పదవులు చేపట్టారు. 1975లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఇందిర, రాజీవ్ మంత్రివర్గాల్లో కీలక భూమిక పోషించారు. విదేశీ వ్యవజారాలు, హోమ్, రక్షణ, మానవవనరులు తదితర శాఖల మంత్రిగా పనిచేసిన పీవీ 1991లో రాజకీయాల నుంచి విరమిస్తున్నట్లు ప్రకటించారు.

ఆనాటి ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. అయితే ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఎల్టీటీఈ తీవ్రవాదుల చేతిలో హతం కావడంతో.. కాంగ్రెస్ లో రాజకీయ శూన్యత ఏర్పడింది. దాంతో పార్టీ అగ్రనేతల విజ్ఞప్తి మేరకు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి భారత ప్రధాని పదవిని అధిష్టించారు. కుంగి కృశించిపోయిన దేశ ఆర్థిక రంగానికి నూతన జవసత్వాలు కల్పించారు. ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిని చేసి ఆర్థిక సరళీకరణ విధానాలకు శ్రీకారం చుట్టారు. 1996 వరకు ఐదేళ్లు ప్రధానిగా చేసిన ఆయన దేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగేలా చేశారు. 1996 లో రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్న పీవీ.. 2004లో ఈ లోకానికే శాశ్వత వీడ్కోలు పలికారు.

వారసులు సైతం గతించే..

పీవీ వారసులుగా ఇద్దరు కుమారులు ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో కొన్నేళ్ళు కొనసాగారు. పీవీకి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. వారిలో పెద్దవాడైన పీవీ రంగారావు ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా చేశారు. వరంగల్ జిల్లా హన్మకొండ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 1992-94 మధ్య కోట్ల విజయభాస్కర రెడ్డి కేబినేట్ లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచారు. అజన్మ భ్రహ్మచారి అయిన రంగారావు వారసత్వంగా తనకు సంక్రమించిన ఆస్తులను విద్యాసంస్థలకు దానం చేసి.. ఓ అపార్ట్మెంట్ లో అద్దెకు ఉంటూ 2013లో మరణించారు.

ఆయన సోదరుడు, పీవీ మరో తనయుడు పీవీ రాజేశ్వర రావు కొన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. 1996లో ఆయన సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి లోకసభ సభ్యుడైన ఆయన ఆతర్వాత రాజకీయాల నుంచి నిష్క్రమించారు. 2016లో మృతి చెందారు. అక్కడితో పీవీ వారసులెవరూ రాజకీయాల్లోకి రాకపోవడంతో.. ఆ కుటుంబం వారసత్వం ముగిసింది

శత జయంతి వేళ మళ్ళీ తెరపైకి..

తెరమరుగైపోయిందనుకున్న పీవీ లేగాసి అనూహ్యంగా వెలుగులోకి వచ్చింది. పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న తరుణంలో టీఆరెస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పీవీ కుమార్తె సురభి వాణిని రాజకీయ తెరపైకి తీసుకొచ్చారు. ఈ నెల 14న జరిగిన హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఆమెను తెరాస అభ్యర్థి గా నిలబెట్టి గెలిపించడం ద్వారా పీవీ రాజకీయ వారసత్వాన్ని మళ్లీ వెలుగులోకి తెచ్చారు. 1952లో జన్మించిన వాణి సీబీత్రకారిణిగా, విద్యావేత్తగా, సామాజిక కార్యకర్తగా, పలు సంస్థల వ్యవస్థాపకురాలిగా సూపరిచితులు. మూడు దశాబ్దాలుగా సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ, శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్న ఆమె స్వామి రామనందతీర్థ స్మారక కమిటీ ప్రధాన కార్యదర్శిగానూ వ్యవహరిస్తున్నారు.