మహారాష్ట్ర లో ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం న్యాయస్థానానికి ఎక్కింది. ప్రభుత్వ ఏర్పాటులో తమకు తగినంత సమయం ఇవ్వలేదని శివసేన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ ఏర్పాటు కై గవర్నర్ బిజెపికి ఇచ్చినంత సమయం తమకు ఇవ్వలేదని పేర్కొంది. తమకు మరి కొంత సమయం ఇచ్చేలా గవర్నర్ కు ఆదేశాలు జారీ చేయాలంటూ పిటిషన్ లో కోరింది.
కాగా ఆదివారం తాము ప్రభుత్వ ఏర్పాటు చేయలేమని బిజెపి చెప్పడంతో గవర్నర్ శివసేనను ఆహ్వానించారు. సోమవారం రాత్రి 7:30 గంటలకు ప్రభుత్వ ఏర్పాటుకు సమయం ఇచ్చారు. ఆ లోపు నిర్ణయం తెలియజేయాలని గడువు విధించారు. అయితే శివసేన ప్రభుత్వ ఏర్పాటు లో విఫలమైంది. శివసేనకు మద్దతు ఇచ్చేందుకు ఎన్సీపీ సిద్ధమైనా.. కాంగ్రెస్ విముఖత వ్యక్తం చేయడంతో శివసేన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. తమకు మరి కొద్దీ సమయం ఇవ్వాలని శివసేన కోరినా.. గవర్నర్ తిరస్కరిస్తూ మంగళవారం ఎన్సీపీ ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 145 సీట్లు కావాలి. ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. బిజెపికి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్ కు 44 స్థానాలు వచ్చాయి. ఇతర పార్టీలు, స్వతంత్రులు 29 స్థానాల్లో గెలిచిన విషయం తెలిసిందే.