చాలాకాలంగా నలుగుతూ వచ్చిన మణికొండ భూముల వ్యవహారం మీద సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. హైదరాబాద్ లోని మణికొండ పరిధిలోని 1654.32 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుందని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. విషయం ఏమిటంటే మణికొండ పరిధిలోని ఒక ఇల్లు, భూమి కలిపి 5,506 చదరపు గజాలు తమకు చెందినవి అంటూ ఉమ్మడి ఏపీ వక్ఫ్‌బోర్డు 1989, ఫిబ్రవరి 9న నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత దాన్ని సవరిస్తూ మణికొండ పరిధిలోని 1654.32 ఎకరాల భూమి కూడా తమకే చెందుతుందని 2006, మార్చి 13వ తేదీన మరో సవరణ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా ల్యాంకో హిల్స్ సహా పలు సంస్థలు, ప్రైవేటు వ్యక్తులకు భూములు కేటాయించింది.
అయితే ఏపీ వక్ఫ్‌బోర్డు సవరించిన నోటిఫికేషన్ ఆధారంగా ఆ భూములన్నింటినీ వక్ఫ్‌బోర్డుకు అప్పగించాలంటూ మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ తదితరులు హైకోర్టు, ఏపీ వక్ఫ్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఆ సమయంలో ఉమ్మడి ఏపీ హైకోర్టు ఈ కేసు విచారించి వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఐఐసీ, ల్యాంకో హిల్స్, సహా భూములు పొందిన ఇతర సంస్థలు సుప్రీంకోర్టులో 2012లో పలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఆ అన్ని పిటిషన్ల మీద సుప్రీంకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ రామసుబ్రమణియన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం 156 పేజీల తీర్పును సోమవారం నాడు వెలువరించింది.
2012లో హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెడుతున్నామని, వక్ఫ్‌బోర్డు జారీచేసిన రెండు సవరణ నోటిఫికేషన్‌లను రద్దు చేస్తున్నామని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో తెలంగాణ ప్రభుత్వం సహా ఉమ్మడి ఏపీ హయాంలో అప్పటి ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా భూములు కేటాయించిన ల్యాంకో హిల్స్, జనచైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ, ఐఎస్‌బీ సహా పలు సంస్థలకు, వ్యక్తులకు ఊరట లభించినట్లే. మణికొండ భూములు రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతాయని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తంచేశారు.