మిషన్ బిల్డ్ ఏపీ ప్రాజెక్టు మీద హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. నిరర్ధక ఆస్తులు భూములను బహిరంగ వేలం వేసి, వచ్చిన నిధులతో రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేయాలన్న ప్రభుత్వ తలంపు మీద గతంలో టిడిపి కు చెందిన కొందరు వ్యక్తులు వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ రాకేష్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. భూములు అమ్మే అధికారం మీకు ఎక్కడిది..? భూములు అమ్మాల్సిన పరిస్థితి ఏమిటి..? రాష్ట్రం ఏమైనా దివాలా తీసిందా..? రాష్ట్రంలో రాజ్యంగ సంస్థలు కుప్పకులాయని ప్రకటిస్తాం. పరిపాలనను కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తాం.. అంటూ జస్టిస్ రాకేష్‌కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు నిలిపివేయాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు ఉద్దేశాన్ని, మొత్తం చేయబోతున్న పారదర్శక విధానాన్ని సుప్రీంకోర్టుకు నివేదించింది. దీంతో హైకోర్టు తీర్పుపై ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులను నిలిపివేయాలంటూ స్టే విధించింది.
అన్నింటిపై స్టే!
హై కోర్టు గతంలో ఇచ్చిన అన్ని అంశాల మీద ప్రభుత్వం సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వంపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన రాకేష్‌కుమార్.. ఈ పిటిషన్లను విచారిస్తే.. తమకు న్యాయం జరగదని మిషన్ బిల్డ్ ఏపీ కార్పొరేషన్ రెక్యూజ్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ నుంచి రాకేష్‌కుమార్ తప్పుకోవాలని అభ్యర్థించింది. ఆయితే నాడు దీనిని హైకోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వెలువడించింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించారని పిటిషన్ వేసిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రిక్యూజల్ పిటిషన్పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై పూర్తి వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే ధర్మాసనం ప్రభుత్వ వాదనలతో ఏకీభవించి… హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలని ఆదేశించింది.
ఇది రెండోసారి!
హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు లేదా తీర్పుల విషయంలో ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, అక్కడ హైకోర్టు తీర్పుపై స్టే విధించడం ఇది రెండోసారి. గతంలోనూ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రాకేష్ కుమార్ ఉన్న సమయంలో రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి నివేదించగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే వచ్చింది. ఇప్పుడు మరోసారి మిషన్ ఏపీ బిల్డ్ పథకం మీద హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సుప్రీం ఆదేశాలతో నిలిచిపోయి నట్లు అయ్యాయి.