iDreamPost
android-app
ios-app

ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించే అధికారం రాష్ట్రాలదేనంటున్న సుప్రిం.. తర్వాత పరిణామాలేంటి..?

ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించే అధికారం రాష్ట్రాలదేనంటున్న సుప్రిం.. తర్వాత పరిణామాలేంటి..?

ఎస్సీ, ఎస్టీలు ఒకే సమూహజాతి కిందకురారని వివిధ నివేదికలు చెబుతున్నాయి. రిజర్వేషన్‌ ఫలాలు అందుకోలేని అట్టడుగువర్గాల ఆకాంక్షలు ఇప్పటికీ కలగానే ఉన్నాయి. అదే సమయంలో వివిధ కులాలు ఎక్కడ ఉన్నవి అక్కడే ఉన్నాయి. వాళ్లు అసమానంగానే ఉన్నారు. అలాంటి వాళ్లు జీవితాంతం వెనుకబడే ఉండాలా..?

వెనుకబడిన వారికి పైకి తీసుసుకురావాలన్న లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపై రాజ్యంగపరమైన ఆంక్షలేమీ లేవు. కొన్ని వర్గాలకు ప్రాధాన్యమిచ్చీ రిజర్వుడు సీట్లలో కొంత శాతాన్ని వారికి కేటాయించడాన్ని రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పలేం..

ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదంటూ 2005లో ఈవీ చిన్నయ్య వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీరుపై తాజాగా సుప్రిం కోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది. 2005లో ఇచ్చిన తీర్పుపై దాఖలైన పిటిషన్లపై 2014లో ముగ్గురు సభ్యుల ధర్మాసనం సదరు తీర్పును పునఃసమీక్షించాలంటూ ఇచ్చిన తీర్పును ప్రస్తుతం ముగుర్గురు సభ్యుల ధర్మాసనం సమర్థించడంతో ఎస్సీ వర్గీకరణలో కీలక ముందడుగు పడింది.

2005లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమీక్షించే అధికారం అంతకన్నా ఎక్కువ సభ్యులు న్యాయమూర్తులుగా ఉన్న ధర్మాసనానికే ఉంటుంది కాబట్టి.. ఈ వ్యవహారాన్ని ఏడుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది సభ్యులున్న ధర్మాసనానికి బదిలీ చేయాలంటూ జస్టిస్‌ అరుణ్‌మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సుప్రిం చీఫ్‌ జస్టిస్‌కు విజ్ఞప్తి చేయడంతో 25 ఏళ్లకు పైగా సాగుతున్న ఎస్సీ వర్గీకరణ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ రిజర్వేషన్ల వల్ల ఆ సామాజికవర్గంలోని మాలలకే ఎక్కువ లబ్ధి జరగుతోందని, మాదిగలు నష్టపోతున్నారనే కారణంతో.. ప్రభుత్వం ఇస్తున్న 15 శాతం రిజర్వేషన్లను చెరిసగం పంచాలంటూ డిమాండ్లు వచ్చాయి. ఎస్సీ వర్గీకరణ చేయాలని మాదిగలు, చేయడానికి ఒప్పుకోబోమని మాలలు పోటాపోటీగా ఉద్యమాలు చేశారు. మాదిగల తరఫున మందకృష్ణ మాదిగ ఉద్యమ నాయకుడుగా పోరాటం చేస్తున్నారు. ఇందు కోసం 1994లో మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎంఆర్‌పీఎస్‌)ను స్థాపించి ఉద్యమం చేస్తున్నారు. మాల సామాజికవర్గంలో పలువురు నేతలు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపారు.

ఈ సమస్యకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజ«శేఖరెడ్డి 2005లో పరిష్కారం చూపారు. ఎస్సీ వర్గీకరణ చేశారు. అయితే రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ట్రాలకు లేదంటూ వైఎస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈవీ చిన్నయ్య అనే వ్యక్తి సుప్రింలో సవాల్‌ చేశారు. సుప్రింలో ఈవీ చిన్నయ్యకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఏపీలో మాదిరిగానే పంజాబ్‌ తదితర రాష్ట్రాలలోనూ ఇదే సమస్య ఉంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు సుప్రిం తీర్పుపై పునఃసమీక్ష కోరుతూ పిటిషన్లు దాఖలు చేయగా.. 2014లో పూర్వ తీర్పును సమీక్షించాలంటూ ధర్మాసనం ఆదేశాలు వెలువరించింది. సదరు తీర్పును తాజాగా జస్టిస్‌ మిశ్రా ధర్మాసనం కూడా సమర్థించడంతో ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న వారికి గొప్ప ఊరట లభించినట్లైంది.

అయితే ఈ వ్యవహారం ఏడుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది న్యాయమూర్తులున్న ధర్మాసనానికి బదిలీ కావడం, ఆ తర్వాత అక్కడ వాదోపవాదాలు జరిగే ప్రక్రియ ఎంత కాలంలో ముగుస్తుందనేదానిపై ఎస్సీ వర్గీకరణ ఆధారపడి ఉంటుంది. ఎస్సీ వర్గీకరణ జరిగితే ఇతర వర్గాల్లోని రిజర్వేషన్లను కూడా వర్గీకరించాలనే డిమాండ్లు ఊపందుకునే అవకాశం కూడా ఉంది. అఖండ భారత దేశంలో బిన్న జాతులు, కులాలకు కొదవే లేదు. ఒక కులంలో అనేక ఉప కులాలు ఉండడం ఏపీతో సహా ఇతర రాష్ట్రాలలోనూ ఉంది. ఆయా ఉప కులాలలో కొన్ని విద్యా, ఆర్థికంగా అభివృద్ధి చెందగా.. మరికొన్ని సాటి ఉపకులాల కన్నా వెనుకబడి ఉన్న విషయం సుస్పష్టం.