iDreamPost
iDreamPost
అమరావతిలో రాజధాని భూసేకరణ పేరిట పేద బడుగు వర్గాలకి చెందిన భూముల విషయంలో అనేక అక్రమాలకు పాల్పడిన తాహసిల్దార్ సుధీర్ బాబు పై క్రిమినల్ కేసు దాఖలైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి సీఐడి అధికార బృందం చేస్తున్న దర్యాప్తుకు ఆటంకం కలిగేలా ఏపీ హై కోర్టు స్టే విధించడంపై తాజాగా సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గడచిన ప్రభుత్వంలో రాజధాని పేరిట అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డినట్టు ఇప్పటికే పలువురు అధికారులు తెలుగుదేశం నాయకులు అరెస్టు అవడంతో బహిర్గతం అయింది.
రాజధాని ప్రాంతానికి చెందిన కొందరు బడుగు రైతుల భూములను టీడీపీ పెద్దలు, వారి సన్నిహితులు అక్రమంగా తీసుకున్నారని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర పేద వర్గాలు ఫిర్యాదులు చేశాయి. అయితే ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించగా రంగంలోకి దిగిన సీఐడి బృందం విచారణ చేపట్టింది. ఈ విచారణలో తుళ్లూరు మాజీ తాహసిల్దార్ సుధీర్ బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారితో కుమ్మక్కై రెవెన్యూ రికార్డులను ఇష్టానుసారం తారుమారు చేయడం, భూమిని ల్యాండ్‌పూలింగ్ కింద సీఆర్‌డీఏకు ఇవ్వడం చేశారని విచారణాధికారుల పరిశీలనలో వెల్లడైంది.
ఇదిలా ఉంటే తమపై నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని కోరుతూ నిందితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, నిందితుల అభ్యర్ధన మేరకు కేసు దర్యాప్తుపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. దీంతో భూ ఆక్రమణ కేసులో దర్యాప్తుకు భంగం కలిగేలా హైకోర్టు స్టే విధించడం పై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేను రద్దు చేయాలని సుప్రీం తలుపు తట్టింది.
ఏపి ప్రభుత్వం అభ్యర్ధన మేరకు కేసును స్వీకరించిన సుప్రీం ధర్మాసనం మాజీ తాహసిల్దార్ సుధీర్ బాబుపై దాఖలైన క్రిమినల్ కేసు దర్యాప్తుకు సబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. భూములను ఆక్రమించిన ఎమ్మార్వోపై విచారణ జరపకుండా స్టే ఇవ్వడం సరైనది కాదని సుప్రీం అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ కొన్ని కీలక వాఖ్యలు చేసింది. హైకోర్టు ఈ తరహా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదంటూ, ఈ అంశంలో కేసు ఏమిటి అని హైకోర్టు వాఖ్యలు ఎలా చేస్తుందని, దర్యాప్తుపై స్టేలు విధించద్దు అని అనేక సార్లు చెబుతూనే వస్తున్నాం అని, చట్టం తన పని తాను చేసుకునేలా అవకాశం ఉండాలని సుప్రీం కోర్టు వాఖ్యానిస్తూ కేసును వారంలోగా తేల్చాల్సిందిగా హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.