iDreamPost
android-app
ios-app

మహారాష్ట్ర – సుప్రీం చెప్పిన సత్యాలు

  • Published Nov 27, 2019 | 1:43 AM Updated Updated Nov 27, 2019 | 1:43 AM
మహారాష్ట్ర – సుప్రీం చెప్పిన సత్యాలు

రాజ్యాంగం ప్రతి వ్యవస్థకు నిర్దిష్ట విధివిధానాలను ఏర్పరిచింది.కొన్ని వ్యవస్థలకు విచక్షణ అధికారాన్ని ఇచ్చింది. కానీ విచక్షణ అంటే ఎవరి ఇష్టం వచ్చిన నిర్ణయాలు వాళ్ళు తీసుకోవటం కాదు. నిర్దేశించిన నియమాల ప్రకారం సమంజసమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశం మాత్రమే రాజ్యాంగం ఇచ్చింది.

గవర్నర్ వ్యవస్థ కానీ స్పీకర్ వ్యవస్థ కాని కోర్టులు కలగచేసుకోవటానికి అవకాశం లేనివి కాదు. ప్రభుత్వ బల పరీక్షకు గవర్నర్ తనకు తోచినన్ని రోజులు గడవు ఇవ్వటం కుదరదు. “రాజకీయ బేరసారాలకు అడ్డుకట్ట వేసేందుకు, అనిశ్చితికి తెర దించేందుకు, ప్రజాస్వామ్యం సజావుగా సాగి సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తి మెజారిటీ తేల్చేందుకు తక్షణం బలపరీక్ష జరగడం అవసరం, అనివార్యమని’’ అని మహారాష్ట్ర కేసును విచారించిన సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్‌ రమణ వాఖ్యానించారు.

రాష్ట్రపతి పాలన విధింపుకు సంబంధించి కూడా కోర్టు కీలకమైన అభిప్రాయం వ్యక్తం చేసింది. “ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయిందన్న అనుమానం వచ్చినప్పుడు ప్రభుత్వానికి సభలో బలపరీక్షకు గవర్నర్ అవకాశం ఇవ్వాలి. బల పరీక్షకు అవకాశం ఇవ్వకుండా రాష్ట్రపతి పాలన విధించటం రాజ్యాంగ విరుద్ధం” అని కోర్టు వ్యాఖ్యానించింది. ఫడణవీస్ రాజీనామా తరువాత గవర్నర్ శివసేన-కాంగ్రెస్-NCP కూటమికి అవకాశం ఇవ్వకుండా రాష్ట్రపతి పాలనకు సిపార్సు చేస్తారా?అన్న ప్రశ్నకు కోర్టు చేసిన ఈ వ్యాఖ్య సమాధానం చెప్పినట్లయింది. మూడు పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వమని కోరిన తరువాత గవర్నర్ తప్పకుండా వారికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలి.

గతంలో గవర్నర్,స్పీకర్ నిర్ణయాల వ్యవస్థ మీద కోర్టులు కలగచేసుకున్నాయి.ఎవరి నిర్ణయాలైనా రాజ్యాంగ బద్దంగా ఉండాలి,రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలి.