ప్రస్తుతం మన సమాజం మొత్తాన్ని ఒక జబ్బు పట్టి పీడిస్తోంది. అందుకే అన్ని రకాలుగా ఆలోచించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సోషల్ మీడియా జనాలతో సహా, సెలబ్రిటీలు అందరికీ కూడా లైం లైట్‌లో ఉండాలి, గుర్తింపు తెచ్చుకోవాలి అన్న తాపత్రయం పెరిగిపోతోంది. ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇప్పుడు కేవలం రాజకీయ స్వార్థం, ఆర్థిక ప్రయోజనాల కోసమే పనిచేస్తూ ఉంది అన్నది నిజం. ఈ నేపథ్యంలో నుంచి చూస్తే మాత్రం కొంతమంది జెన్యూన్‌గా హత్యాచారం ఘటనను ఖండిస్తూ, మహిళలకు సపోర్ట్‌గా నిలుస్తున్నారా? లేకపోతే ఘటనను క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారా అన్న అనుమానం వస్తోంది.
‘పడుకున్నదాన్ని రేప్ చేస్తే కిక్కేముంది…..పరుగెత్తించి పరుగెత్తించి రేప్ చేస్తేనే మజా’ అని సినిమా నటుడిగా జల్సా డైలాగులు చెప్పిన ఒక ప్రముఖ నటుడు ….అత్యాచారం చేసిన వాళ్ళకు రెండు బెత్తం దెబ్బలు చాలు అని నాయకుడిగా సెలవిచ్చారు. ఆ ఒక్క స్టేట్మెంట్‌తో అన్ని వైపుల నుంచీ వ్యతిరేకత తెచ్చుకున్నాడు ఆ నటుడు . ఇక ఎన్‌కౌంటర్ జరిగిన వెంటనే తన బెత్తం దెబ్బల మాటలతో వచ్చిన వ్యతిరేకతను తగ్గించుకోవడానికి అన్నట్టు అత్యాచారాలు చేసేవాళ్ళను ఏదేదో చేయాలి, కఠినంగా శిక్షించాలి అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఇక ఒక అగ్ర నటుడు కూడా మహిళలను ఇబ్బందిపెట్టేవాళ్ళను ఏదేదో చేసేయాలి అని ఆవేశంగా స్పందించారు. మరి ఇదే అగ్ర నటుడు ఆ మధ్య ‘కడుపు చేసేయడమే’ అని బహిరంగ సభలో కొట్టిన డైలాగుల గురించి ఏం మాట్లాడుకోవాలి? అన్నింటికీ మించి ఆ సీనియర్ నటుడితో యాక్ట్ చేసిన హీరోయిన్స్, ఈ హీరోగారి గురించి చెప్పిన మాటలను విశ్లేషించి చూస్తే, ఈయనగారికి మహిళలపైన ఏం రెస్పెక్ట్ ఉన్నట్టు అని అనిపించదా? జనాలు మర్చిపోవడానికి రెడీగా ఉన్న మరో హీరో కూడా ఆవేశపూరితంగా చాలానే స్పందించారు. అయితే ఆయనగారి సినిమాల్లో ఎన్నిసార్లు మహిళలను అదీ, ఇదీ, ఒసేయ్ అని మాట్లాడారో లెక్క తీస్తే ఆయన కూడా సిగ్గుపడాలేమో.
సినిమా ప్రభావం బయట ప్రజలపై కూడా ఉంటుంది. కాబట్టి అది నటన అని ఇది జీవితం అని చెప్పే కల్లబొల్లి మాటలు కట్టిపెట్టి సినిమాల్లో కూడా ఆడవాళ్లను గౌరవించే విధంగా తమ పాత్ర చిత్రణ ఉంటే ఆయా నటులు చెప్పిన మాటల్లో అర్ధం ఉంటుందని ప్రజల మనసులోని అభిప్రాయం.
ఇక బూతు మీడియాగా పేరు పడ్డ ఒక మీడియా సంస్థ కూడా దిశకు సంబంధించిన న్యూస్‌లలో సంచలనం, ట్విస్ట్ అంటూ ప్రతి రోజూ అవే వార్తలు వండి వారుస్తూ గట్టిగానే క్యాష్
చేసుకుంటూ ఉండడంపై మీడియా మిత్రులు కూడా జర్నలిజం మరీ ఇంత దిగజారుతోందా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఒక పార్టీ అధినేత నుంచీ ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీకి మద్దతు ఉండే జనాలందరూ కూడా మహిళలను ఉద్ధరించడానికే ఉన్నారు అనే ప్రజెంటేషన్స్ అయితే చెప్పనవసరం లేదు.
రాజకీయ, సినిమా వార్తలను స్వార్థంతో ప్రజెంట్ చేసినా కనీసం ఇలాంటి విషయాల్లో అయినా నిష్పాక్షకంగా లేకపోతే ఇంకెందుకు? ఇప్పుడు ఈ హత్యాచారం ఘటనపై స్పందిస్తున్న హీరోలు, మీడియా సంస్థలు రేపటి నుంచీ సెక్సువల్ థాట్స్‌ని ప్రేరేపించే కంటెంట్‌ని క్యాష్ చేసుకోవడం మానేస్తారా? మనిషిలో వికారాలను పెంచే విజువల్స్, ఫొటోలు చూపించకుండా ఉంటారా? అబ్బే…..అలా ఎలా కుదురుతుంది? అది అదే…..ఇది ఇదే అంటారా? అక్కడే మరి ఆలోచనాపరులందరూ కూడా ఒక ప్రశ్నను లేవనెత్తుతున్నారు. ఇంతకీ వీళ్ళు దిశకు సపోర్ట్‌గా నిలబడుతున్నారా? లేకపోతే ఇష్యూని క్యాష్ చేసుకుంటున్నారా? అని. సమాధానం కోసం ఉంటే మీ మనస్సాక్షినే అడగండి.
హెచ్చరిక: ఇదే ఆవేశంలో ఆ చెల్లప్పాయ్ బాబాయ్ కూడా మహిళలు, గౌరవం, ఉరిశిక్ష అంటూ మాట్లాడతాడేమో అని మాత్రం భయంగా ఉంది……దేవుడా?