Idream media
Idream media
సాధారణంగా ప్రతిపక్షం అంటే ప్రభుత్వంపై పోరాటం.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమాలు చేపడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. కానీ తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నేతలు నిత్యం సొంత కయ్యాలు, పదవుల పందేరంలో ముందు వరుసలో ఉంటున్నారు. టీపీసీసీ చీఫ్ ఎంపిక ఏళ్ల తరబడి కొనసాగుతున్న తంతు తెలిసిందే. అధిష్ఠానం ఎన్నో సర్వేలు, ఎందరో అభిప్రాయాల సేకరణ అనంతరం ఒకరి పేరు తెరపైకి తెచ్చేలోగా పార్టీలో లొల్లి మొదలవుతోంది. నో.. నో.. ఆయన తప్ప ఎవరైనా ఓకే అంటూ కొందరు నిరసన గళం మొదలుపెడుతున్నారు. ఫలితంగా ప్రక్రియ మొదటికి వస్తోంది. టీ పీసీసీ చీఫ్ పోస్ట్ కోసమే కాదు.. మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవిపై కూడా అలాగే రచ్చ జరిగింది. చివరకు టీపీసీసీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీత రావును అధిష్ఠానం ఫైనల్ చేసింది.
తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకం జటిలంగా మారినట్టే.. మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పై కూడా అలాగే లొల్లి కొనసాగింది. నాయకుల మధ్య కయ్యాలు ఓ రేంజ్‌లో సాగాయి. రెండేళ్ల క్రితమే ప్రస్తుత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి మహిళా కాంగ్రెస్ కమిటీ అచేతన స్థితిలో ఉంది. కార్యక్రమాలు లేవు. కార్యకర్తలు కూడా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. కొన్నాళ్ల క్రితం నిత్యావసరాల ధరలపై ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తే.. తమకు సమాచారం ఇవ్వలేదని మహిళా కాంగ్రెస్ నాయకులు రచ్చ రచ్చ చేశారు. గాంధీభవన్ ముందు నేతల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. దీంతో పరిస్థితిని మార్చేందుకు వెంటనే మహిళా కాంగ్రెస్ కొత్త కమిటీ ప్రక్రియను అధిష్ఠానం మొదలు పెట్టింది.
పీసీసీ అధికార ప్రతినిధులు సునీతారావు, భవానీరెడ్డి, ఇందిరారావు, గండ్ర సుజాత పేర్లను మహిళా కాంగ్రెస్ పదవి నియామకం కోసం జాతీయ మహిళా అధ్యక్షురాలు సుశ్మిత పరిశీలించారు. వీరితో ఆమె రెండు, మూడు రోజులుగా ఇంటర్వ్యూ చేశారు. చివరకు టీపీసీసీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీత రావును నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏఐసీసీ. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రక్షాళనలో భాగంగా నూతన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి ఎంపికపై కూడా కసరత్తు చేసి చివరికి సునీత రావును ఎపింక చేసింది కేంద్ర నాయకత్వం. సునీతారావు ఎన్ఎస్ యూఐ తొపాటు యూత్ కాంగ్రెస్‌లో పనిచేసి.. ప్రస్తుతం అడ్వకేట్‌గా ఉన్న సునీతారావును ఫైనల్ చేశారు. నగర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా, పీసీసీ అధికార ప్రతినిధిగా కూడా ఆమె పని చేశారు. పీసీసీ చీఫ్ నియామకం విషయంలో కొత్త వారికి ఎలా పదవి ఇస్తారని సీనియర్లు గళం ఎత్తుతున్న సమయంలో.. మహిళా కాంగ్రెస్‌కు వచ్చేసరికి ఆ రూల్ వర్తించదా అని ప్రశ్నిస్తున్నారట.
Also Read : టీడీపీ మాట.. రఘురామరాజు లేఖ !